మన దేశం | special article on independence day | Sakshi
Sakshi News home page

మన దేశం

Published Sat, Aug 9 2014 11:04 PM | Last Updated on Sat, Sep 2 2017 11:38 AM

మన దేశం

మన దేశం

జాతీయ చిహ్నాలతో, వాటి వెనుక తాత్వికతతో పౌరులకు మానసిక బంధం ఉంటుంది. జాతి గతాన్ని వర్తమానంతో భావైక్యం చేయించేవే జాతీయ చిహ్నాలు. నిరుడు కురిసిన జ్ఞానధారలలో తడిసేటట్టు చేసేవి కూడా అవే.
 
భిన్న సంస్కృతుల, భాషల నిలయాలుగా ఉండే పెద్ద దేశాలలో ప్రజలందరి మధ్య దూరాలను తగ్గించేవీ, దేశ భౌగోళిక స్వరూపంతో జాతి జనులను మమేకం చేసేవీ జాతీయ చిహ్నాలు. చరిత్ర నుంచి మాత్రమే కాదు, శతాబ్దాల జ్ఞానఖనుల నుంచే కాదు, ఉద్యమాలూ, త్యాగాలూ మిగిల్చిన గొప్ప జ్ఞాపకాల నుంచి కూడా జాతీయ చిహ్నాలు ఆవిర్భవిస్తాయి. కొన్ని ప్రకృతి ప్రసాదించిన జాతీయ చిహ్నాలు కూడా ఉన్నాయి. అలాంటి మన జాతీయ చిహ్నాలే ఈవారం ‘వివరం’.
 
భిన్నమైన ఉద్యమంతో, అనితర సాధ్యమైన పంథాతో స్వాతంత్య్రం తెచ్చుకున్న భారతదేశం అర్థవంతమైన, స్ఫూర్తిదాయకమైన జాతీయ చిహ్నాలను ఎంచుకుంది. నీలిరంగు ధర్మచక్రంతో ఉండే మూడు రంగుల జెండా మన జాతీయ పతాకం. నాలుగు సింహాల అశోకచక్రం మన జాతీయ చిహ్నం. రాజసానికి ప్రతీకగా ఉండే బెంగాల్ టైగర్ మన జాతీయ మృగం. అద్భుత సౌందర్యంతో అలరారే మయూరం మన జాతీయ పక్షి. మర్రి మన జాతీయ వృక్షం.

మామిడి జాతీయ ఫలం. పంకంలో ఉద్భవించినా నిర్మాల్యంగా ఉండే కమలం మన జాతీయ పుష్పం. ప్రజలందరూ ముక్త కంఠంతో పాడుకోవడానికి అందమైన, ఇంపైన జాతీయ గీతాలూ ఉన్నాయి. ఒక ప్రతిజ్ఞ కూడా ఉంది. మనకంటూ ఒక జాతీయ పంచాంగమూ ఉంది. ఇవన్నీ ప్రాచీన నాగరికతలలో ఒకటిగా వర్ధిల్లిన భారత భూమి గతాన్ని స్ఫురణకు తెచ్చేవే. మన మట్టి వాసన వేసేవే. మనవైన విలువల గురించి ఎలుగెత్తి చాటేవే.
 
మువ్వన్నెల పతాకం
కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులలో, తెలుపు రంగులో మధ్యగా 24 ఆకుల నీలిరంగు ధర్మచక్రంతో (అశోక చక్రం) భారత జాతీయ పతాకాన్ని రూపొందించుకున్నాం. దీనిని తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొందించారు. మచిలీపట్నానికి చెందిన వెంకయ్య 1916లో మొత్తం 30 రకాల ఆకృతులలో జాతీయపతాకాలను రూపొందించారు. అంతకు ముందు సిస్టర్ నివేదిత (స్వామి వివేకానంద అనుయాయి) కూడా ఒక పతాకాన్ని తయారు చేశారు.

1916లోనే అనిబిసెంట్, బాలగంగాధర్ తిలక్ హోమ్‌రూల్ ఉద్యమం తరఫున మరో పతాకాన్ని తయారు చేశారు. అయితే 1921లో గాంధీజీ నాగపూర్ కాంగ్రెస్ సమావేశాలలో వెంకయ్య రూపొందించిన పతాకాన్ని ప్రతిపాదించారు. దానినే సంస్థ ఆమోదించింది. స్వాతంత్య్రోద్యమంలో చాలాభాగం ఈ జెండా స్ఫూర్తితోనే సాగినా, అధికారంగా జూలై 22, 1947న జాతీయ పతాకంగా ప్రకటించారు.
 
నాలుగు సింహాలు

గయలో బోధివృక్షం కింద జ్ఞానోదయం అయిన తరువాత బుద్ధుడు తొలి ప్రవచనం చేసిన పుణ్యస్థలం సార్‌నాథ్. ఇది అత్యంత పురాతనమైన నగరాలలో ఒకటిగా చెప్పుకునే మహా పుణ్యక్షేత్రం వారణాసి శివార్లలోనే ఉంది. అందుకే అక్కడ మౌర్య చక్రవర్తి అశోకుడు క్రీస్తుపూర్వం 250లో ఒక స్థూపం నిర్మించాడు. దాని కోసం చెక్కించిన నాలుగు సింహాల శిల్పాన్ని స్వతంత్ర భారతదేశం జాతీయ చిహ్నంగా ఎంపిక చేసుకుంది. బోర్లించినట్టు ఉండే కమలం మీద నిర్మించిన ఈ నాలుగు సింహాల శిల్పంలో ఆ భాగాన్ని వదిలేసి, మిగిలిన భాగాన్ని జాతీయ చిహ్నంగా స్వీకరించారు. కింద ‘సత్యమేవ జయతే’(సత్యమే జయిస్తుంది) అని దేవనాగర లిపిలో రాయించారు. మాధవ్ సాహ్ని దీనిని జాతీయ చిహ్నంగా ఎంపిక చేశారు.
 
ఆ నాలుగు సింహాలు ఆసియాటిక్ లేదా ఇండియన్ లైన్స్. అవి కూర్చున్నట్టు చెక్కిన ఈ శిల్పాన్ని ఎదురుగా చూసినపుడు ఒకటి (వెనుక ఉన్నది) కనిపించదు. ఈ నాలుగు సింహం తలలు నాలుగు గుణాలకు ప్రతీకలు. అవి- శక్తి, గౌరవం, ధైర్యం, విశ్వాసం. గుండ్రటి ఒక వేదిక మీద వీటిని చెక్కారు. ఆ గుండ్రటి వేదిక చుట్టూనే ఉంటాయి అశోక చక్రాలు. వీటినే ధర్మ చక్రాలని కూడా అంటారు. ఒక చక్రం ఒక జంతువు దాని మీద కనిపిస్తూ ఉంటాయి.
 
బలిష్టమైన ఎద్దు, పరుగులు తీస్తున్న గుర్రం, ఏనుగు, సింహం బొమ్మలు ఆ చక్రాల మధ్య చెక్కారు. నాలుగు దిక్కుల ను ఇవి చూస్తున్నట్టు ఉంటాయి. ‘సత్యమేవ జయతే’ సూక్తి ముండకోపనిషత్‌లోనిది. జనవరి 26, 1950న దీనిని జాతీయ చిహ్నంగా భారతదేశం అలంకరించుకుంది. అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి అన్నమాట. ఈ చిహ్నాన్ని పవిత్రంగా చూడాలని వేరే చెప్పక్కరలేదు. భారత రాష్ర్టపతి రాజముద్రిక ఇదే బొమ్మతో ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికార రాజముద్ర కూడా ఈ బొమ్మతోనే ఉంటుంది. మన కరెన్సీ మీద, పాస్‌పోర్టు మీద కూడా అదే ముద్ర కనిపిస్తుంది.
 
జాతీయ నది
గంగానదిని నవంబర్ 5, 2008న జాతీయ నదిగా ప్రకటించారు. హిమాలయాల వద్ద గంగోత్రిలో భాగీరథి పేరుతో పుట్టి, గంగగా కాశీ మొదలైన ప్రదేశాలలో ప్రవహించి, పద్మ పేరుతో బంగ్లాదేశ్‌కు వెళుతుందీ మహానది. మొత్తం 2,510 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. భారతదేశంలో నలభై శాతం ప్రజలకు ఈ నదే జీవనాధారం. అలకనంద, యమున, సోన్, గోమతి, కోసి, గాఘ్రా నదులు ఇందులో కలుస్తాయి. ఈ నదికి భారతీయ జీవనంతో అనుబంధం అనిర్వచనీయమైనది.
 
మర్రి చెట్టు
మర్రి చెట్టు మన జాతీయ వృక్షం. ఈ చెట్టుకి భారతీయ సాహిత్యంలో, వైద్యశాస్త్రంలో ఎనలేని ప్రాధాన్యం కనిపిస్తుంది. ఆ చెట్టుకు పెట్టుకున్న పవిత్రమైన పేరు వటవృక్షం. వృక్షాలలో మర్రి వలెనే, దేవతలలో నేనే నరేంద్రుడను అని గీతాకారుడు చెబుతాడు. ఇది చాలు వైదిక వాఙ్మయం లో వటవృక్షానికి ఉన్న స్థానం ఎలాంటిదో చెప్పడానికి! నిజమే, ఈ భూమి మీద ఉన్న వృక్ష సంపదలో మర్రిది ప్రత్యేక స్థానం. అదో అద్భుతం. దాని విత్తనం ఎంతో చిన్నది. అదే ఇంతటి  మహావృక్షాన్ని నిక్షిప్తం చేసుకున్నదన్న విషయం ఒక అద్భుతమనిపిస్తుంది. ఊడలు మళ్లీ భూమిలోకి వెళ్లి పాతుకుంటాయి.

మహబూబ్‌నగర్ జిల్లా పిల్లలమర్రి 800 సంవత్సరాలనాటిది. 330 మీటర్ల మేర విస్తరించి ఉన్న కలకత్తా మర్రి, 450 సంవత్సరాల నాటి అడయార్ మర్రి చెట్టు, 400 సంవత్సరాల నాటి రమోహళ్లి (బెంగళూరు దగ్గర) అలడ మర్రి ఎంతో ఖ్యాతి గాంచాయి. అనంతపురం జిల్లా తిమ్మమ్మమర్రి 1989లో గిన్నిస్ బుక్ రికార్డుల్లో చేరింది. ఇవి ఎంత మేర విస్తరించి ఉంటాయో చెప్పడానికి ఒక్క చక్కని చారిత్రక సందర్భం చాలు. అలెగ్జాండర్ దండయాత్రకు వచ్చినపుడు ఏడు వేల సైన్యంతో ఒకే మర్రి చెట్టుకింద విడిది ఏర్పాటు చేసుకున్నాడు!
 
కమలం
కమలం అందాన్ని చూసి మురిసిపోని వారు ఉండరు. మన పూర్వ కవులు కూడా అంతే. స్వచ్ఛతకి తిరుగులేని ప్రతీక ఆ పుష్పం. దీనిని భారతదేశం జాతీయ పుష్పంగా ఎంచుకుంది. జలాశయాలలో లోలోతు మట్టిలో నుంచి, బురద, నాచుల మధ్య నుంచి నీటి ఉపరితలం మీదకు వచ్చి వికసిస్తుందీ పువ్వు. కానీ కాస్త కూడా బురద అంటదు. జీవితం కూడా అంత నిర్మలంగా ఉండాలని మనిషి ఆకాంక్షిస్తూ వేల సంవత్సరాలుగా ఆ పుష్పాన్ని ఆరాధిస్తున్నాడు. మనసునూ, శరీరాన్నీ భౌతిక ప్రపంచంలోని బురద అంటకుండా కాపాడుకోవాలని కలలు కంటూనే ఉన్నాడు. కమలం  దైవత్వానికీ, జ్ఞానానికీ, సంపదకూ, పవిత్రతకూ ప్రతీక. భగవానుడి పాదాలను చరణకమలాలు అని కీర్తించడం పరిపాటి.
 
మామిడిపండు

మామిడిపండు మన జాతీయ ఫలం. ఈ ఫలానికి కూడా భారతీయ సంస్కృతితో ఎనలేని అనుబంధం ఉంది. మన దేశంలోనే వందకు పైగా రకాల మామిడిపళ్లు దొరుకుతాయి. భారతదేశ చరిత్రలో మహోన్నత స్త్రీగా గుర్తింపు ఉన్న ఆమ్రపాలి దొరికింది మామిడితోపులోనే. ప్రస్తుత బీహార్‌లో ఉన్న దర్బాంగాలో మొగల్ చక్రవర్తి అక్బర్ లక్ష మొక్కలతో ఒక మామిడితోటను పెంచేవాడు. ఏ,సీ,డీ విటమిన్లు పుష్కలంగా ఉండే మామిడి పండు, కాయ, ఆకు కూడా భారతీయులకు ఎంతో ముఖ్యమైనవి.
 
విశాఖ తీరంలో పుట్టిన  జాతీయ ప్రతిజ్ఞ
‘భారతదేశము నా మాతృభూమి.. భారతీయులంతా నా సహోదరులు..’ అంటూ సాగే ఈ ప్రతిజ్ఞను తొలిసారి 1963లో విశాఖపట్నంలోని ఒక పాఠశాలలో పిల్లల చేత చదివించారు. దీనిని రచించిన వారు పైడిమర్రి వెంకటసుబ్బారావు. నల్లగొండ జిల్లా అన్నేపర్తికి చెందిన వెంకటసుబ్బారావు బహుభాషావేత్త. విశాఖపట్నం ట్రెజరీ అధికారిగా ఉన్నపుడు 1962లో ఈ ప్రతిజ్ఞ తయారుచేశారు.

దీనిని వెంకటసుబ్బారావుగారు  ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు తెన్నేటి విశ్వనాథం దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన అప్పటి విద్యాశాఖ మంత్రి పీవీజీ రాజుకు అందించారు. 1964లో బెంగళూరులో ప్రముఖ న్యాయ నిపుణుడు మహ్మద్ కరీం చాగ్లా అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహామండలి సమావేశం జరిగినపుడు జాతీయ ప్రతిజ్ఞగా స్వీకరించారు. అన్ని భాషలలోకి అనువాదం చేయించి, జనవరి 26, 1965 నుంచి దీనిని దేశమంతా చదువుతున్నారు.
 
కరెన్సీ

భారత కరెన్సీ మీద దేవనాగర లిపిలో ముద్రించిన ‘రా’ అన్న అక్షరమే జాతీయ చిహ్నం. దీనిని జూలై 15, 2010న భారత ప్రభుత్వం తీసుకుంది.
 
జాతీయ పంచాంగం
చైత్ర మాసంతో మొదలయ్యే శక యుగం పంచాంగాన్ని (కేలండర్) మన ప్రభుత్వం మార్చి 22, 1957న జాతీయ పంచాంగంగా గుర్తించింది. అంతకు ముందు గ్రెగారియన్ కేలండర్ అమలులో ఉండేది. ఇందులో 365/366 రోజులు ఉంటాయి. ఇప్పుడు గ్రెగారియన్ కేలండర్‌తో పాటు దేశీయ కేలండర్‌ను కూడా భారత్ గెజెట్, ఆకాశవాణి, ప్రభుత్వ కార్యక్రమాల వివరణకు ఉపయోగిస్తున్నారు.
 
జాతీయ మృగం
బెంగాల్ టైగర్ మన జాతీయ మృగం. రాజసం, శక్తి, సామర్థ్యం పుష్కలంగా ఉండే ఈ జంతువు భారతీయ పురాణాలలో, వాఙ్మయంలో విశేషమైన స్థానం కలిగి ఉంది. 1973 నుంచి దేశంలో పులుల సంరక్షణ పథకం ప్రారంభమైంది. ఆ సంవత్సరం ఏప్రిల్‌లోనే పులికి జాతీయ మృగం హోదా వచ్చింది. ప్రస్తుతం దేశంలో 23 టైగర్ రిజర్వులు పని చేస్తున్నాయి.
 
నీటి జంతువు
గంగానదిలో కనిపించే మంచినీటి డాల్ఫిన్‌ను జాతీయ నీటి జంతువుగా పేర్కొంటారు.

జాతీయ పక్షి
1963లో నెమలి భారతీయుల జాతీయ పక్షి అయింది. నెమలి అందానికే కాదు, గొప్ప మార్మికతకు కూడా పేర్గాంచినదే. 200 ఈకలతో ఉండే మగ నెమలి పింఛం రమణీయతకు ఆలవాలం. 1972లో నెమలిని వేటాడడం నిషేధించారు.
 
వందేమాతరమ్
బంకించంద్ర చటర్జీ రాసిన నవల ‘ఆనందమఠం’లో (1882) ఒక రమ్యమైన సన్నివేశం ఉంది. మహేంద్రుడు, భవానందుడు అనే రెండు ప్రధాన పాత్రలు అర్థరాత్రి, వెన్నెల్లో అడవి గుండా వెళుతూ ఉంటారు. అంతకు ముందే దొంగలకు సంబంధించి ఆ ఇద్దరి మధ్య చిన్న వివాదం చెలరేగితే, మహేంద్రుడు అలుగుతాడు. ఆ సందర్భంలో భవానందుడు ఒక పాట అందుకుంటాడు. అదే- ‘వందేమాతరమ్.. సుజలాం సుఫలాం... మలయజ శీతలాం....’ ఆ సంస్కృత గీతానికి పరవశించిన మహేంద్రుడు వెంటనే మాట్లాడడం మొదలుపెడతాడు.

ఇది బంకింబాబు సృష్టించిన మహేంద్రుడు అనే పాత్రనే కాదు, భారతదేశాన్నీ కదిలించింది. 1896లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో దీనిని మొదటిసారి పాడారు. అప్పటి నుంచి ఆ పాట పాడడం సంప్రదాయంగా మారింది. దీనిని మొదట రవీంద్రనాథ్ టాగూర్ గానం చేశాడు. అదొక ప్రత్యేకత. ఇంకొక విశేషం - అరవింద ఘోష్ దీనిని ఆంగ్లంలోకి అనువదించారు. ఇది పెద్ద గేయం. మొదటి రెండు చరణాలను 1950లో భారత ప్రభుత్వం జాతీయ గేయం (సాంగ్)గా స్వీకరించింది.
 
జనగణమన
సాహిత్య నోబెల్ అందుకున్న ఏకైక భారతీయుడు రవీంద్రనాథ్ టాగూర్ రాసిన గీతం జనగణమన. దీనిని మొదట కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో డిసెంబర్ 27, 1911న ఆలపించారు. తరువాత రవీంద్రుడి సంపాదకత్వంలో వెలువడిన ‘తత్వబోధ ప్రకాశిక’లో ప్రచురించారు. అది ఆరోజులలో కొద్దిమంది బ్రహ్మ సమాజ అవలంబీకులకు తప్ప ఎవరికీ తెలియదు కూడా. కానీ ఫిబ్రవరి, 1919లో  టాగూర్ తెలుగు ప్రాంతంలోని మదనపల్లెకు (చిత్తూరు జిల్లా) రావడంతో ఆ గీతానికి బాణీ కట్టే సందర్భం వచ్చింది.
 
ఆయనను అప్పుడు థియోసఫికల్ విద్యాసంస్థల తరఫున జేమ్స్ హెచ్ కజిన్స్ ఆహ్వానించారు. అప్పుడే రవీంద్రుడు విద్యార్థుల సమావేశంలో ఆ గీతాన్ని ఆలపించారు. తరువాత జేమ్స్, ఆయన భార్య మార్గరెట్ (పాశ్చాత్య సంగీతజ్ఞురాలు) ఈ గీతాన్ని రవీంద్రుడి చేతే ఆంగ్లంలోకి అనువదింప చేసి బాణీ కట్టారు. తరువాత అది బడిపిల్లలకు ఉదయగీతంగా మారిపోయింది. 52 సెకన్లు పాడుకునే ఈ గీతాన్నే జనవరి 24, 1950లో జాతీయ గీతంగా మన ప్రభుత్వం ప్రకటించింది.  
 
జిలేబీ
అనధికారికంగా దేశంలో చాలా చోట్ల జిలేబీని జాతీయ మిఠాయిగా పరిగణిస్తారు.  ప్రపంచంలోనే మొదటి తరం వంటకాల పుస్తకాలలో ఒకటిగా పేరొందిన మహ్మద్ బిన్ హసన్ అల్ బాగ్దాదీ పుస్తకంలో జిలేబీ ప్రస్తావన కనిపిస్తుంది. ఇది 13 శతాబ్దంలో వచ్చిన వంటకాల పుస్తకం. ఇది ముస్లింల పాలనలోనే భారతదేశంలోకి ప్రవేశించిన మాట నిజం. జైన మత బోధకుడు జినసుర క్రీ.శ.1450  రాసిన ‘ప్రియకర్ణపాకత’ పుస్తకంలో కూడా జిలేబీ ప్రస్తావన ఉంది. ఏ విధంగా చూసినా భారతదేశంలో ఈ మిఠాయి 500 సంవత్సరాలకు పూర్వమే తయారైనట్టు దాఖలాలు కనిపిస్తాయి.
 
హాకీ
మొత్తం 15 జాతీయ చిహ్నాలు మన జాబితాలో కనిపిస్తాయి. అందులో హాకీని జాతీయ క్రీడగా పరిగణించడం ఒకటి. హాకీలో ఇంతవరకు ఒలింపిక్స్ పోటీలలో 8 బంగారు,1 వెండి, 2 రజత పతకాలను భారత దేశం తెచ్చుకుంది. 1928 నుంచి 1956 వరకు వరుసగా ఆరు పర్యాయాలు ఒలింపిక్స్‌లో మనదేశమే చాంపియన్‌గా నిలిచింది. ఇంతకీ హాకీ జాతీయ క్రీడేనా?  కాదు.

తన పాఠ్య పుస్తకాలలో మన జాతీయ క్రీడ హాకీ అని చెప్పడం కనిపించిందనీ, ఇది వాస్తవమో కాదో వివరించవలసిందంటూ 2012లో ఐశ్వర్య పరాశర్ అనే పదేళ్ల బాలిక సమాచార హక్కు చట్టం కింద చేసిన విన్నపం మేరకు ఆగస్టు 2, 2012న ఆనాటి యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ శివప్రతాప్‌సింగ్ తోమార్ హాకీ కి జాతీయ క్రీడ హోదా లేదని తెలియ చేశారు. అంటే మన దేశానికి జాతీయ క్రీడ లేదు.
 
జాతీయ చిహ్నాలను తయారు చేసుకున్నాం సరే, వాటిని గౌరవించే దృక్పథం మనలో ఉన్నదా? అది ప్రశ్నార్థకమే. నెమలి, పులి మీద జరుగుతున్న దాడులు, గంగ కాలుష్యం మన నిజాయితీని నిలదీస్తున్న సంగతి వాస్తవం.
 
జాతీయ చిహ్నాలను అగౌరవ పరచడం రాజ్యాంగ విరుద్ధం. కానీ చెదురుమదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి.
 - డా॥గోపరాజు నారాయణరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement