యుద్ధము... అశాంతి! | Uneasiness in Chem city by World war | Sakshi
Sakshi News home page

యుద్ధము... అశాంతి!

Published Sat, Aug 10 2013 12:01 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

యుద్ధము... అశాంతి! - Sakshi

యుద్ధము... అశాంతి!

ఇద్దరూ ఏక్షణంలోనైనా మళ్లీ అడవులకు పారిపోయే ప్రమాదం ఉందని అందరికీ అనుమానమే. గ్రామీణులు ఇచ్చిన తిండే కాదు, నీరు కూడా లాన్ ముట్టడం లేదు. 40 ఏళ్లు ఈ ఇద్దరు ఆ అడవిలో జీవించగలగడం వింతల్లో కెల్లా వింత అని కెమ్ గ్రామస్థులు అనుకుంటున్నారు. నిజమే... యుద్ధం తరువాత ఏదీ నాగరికంగా మిగలదు. థాన్, లాన్ నిష్ర్కమణ అందుకు నిదర్శనం. ఈ వాస్తవాన్ని అమెరికా మేధావులు ఇప్పటికైనా గుర్తిస్తున్నారు.
 
 ప్రపంచంలో ఏ యుద్ధ చరిత్ర చూసినా విజయ భావన క్షణికమే. అది మిగిల్చే విషాదం మాత్రం అనంతం. మొదటి ప్రపంచ యుద్ధం (1914-18), రెండో ప్రపంచ యుద్ధం (1939-45), వియత్నాం యుద్ధం (1959-75), ఇరాన్-ఇరాక్ యుద్ధం (1980-88)- మరే ఇతర యుద్ధ జ్ఞాపకమైనా, విషాదమైనా కాలాన్ని వెంటాడుతూనే ఉంటుంది. యుద్ధం దుష్ఫలితాలను వియత్నాం భూభాగాలు ఇప్పటికీ అనుభవిస్తున్నాయి. గెరిల్లా తం త్రంతో అడవుల నుంచి యుద్ధం చేసిన వియత్నాం సైనికులకు నిలువనీడ లేకుండా చేయడానికి చల్లిన ఏజెంట్ ఆరెంజ్ అనే ప్రాణాం తక రసాయనం ప్రభావాన్నీ, ఇప్పటికీ భూమిలో మిగిలిన మందుపాతరలని తొల గించడానికీ 2012లో మళ్లీ అమెరికాయే చర్య లు ప్రారంభించింది. అప్పటి ఒక మందుపాతర ప్రతిధ్వనిని అనుకోకుండా రెండు రోజు ల క్రితమే వియత్నాం పౌరులు థాన్, లాన్ అనే తండ్రీ కొడుకుల ఉనికితో విన్నారు. మం దుపాతర, బాంబులు తన ఇంటి దగ్గర పేలి; భార్యా, ఇద్దరు పిల్లలు చనిపోవడంతో మిగి లిన ఏడాది వయసు మగబిడ్డను తీసుకుని అడవులలోకి నిష్ర్కమించిన థాన్ ఆచూకీ ఇప్పుడు దొరికింది.
 
 ఇదొక వెండితెర కథను మరిపిస్తుంది. కానీ యుద్ధ బీభత్సాన్ని చూడలేక అడవుల లోకి పారిపోతూ ఆ వ్యక్తి అనుభవించిన మానసిక హింసనూ, బాహ్య ప్రపంచం గురించిన జ్ఞానం లేకుండా, తన మాతృభాష కూడా నేర్పకుండా కొడుకుతో నలభై ఏళ్లు కొండకోనలలో ఉండిపోయేటట్టు చేసిన అతని భయాందోళనలూ ఏ కెమెరా కన్నుకూ అందేవి కావు.
 
 ప్రచ్ఛన్నయుద్ధం తారస్థాయిలో ఉన్నకాలంలో వియత్నాం యుద్ధం జరిగింది. ఫ్రాన్స్, జపాన్‌ల ఆధిపత్యాన్ని కూలదోయడానికి వియత్నాం సుదీర్ఘ పోరాటమే జరిపింది. డాక్టర్ హోచిమిన్ 1954లో ఫ్రెంచ్ ఆధిపత్యా న్ని పడగొట్టాడు. అప్పుడు జరిగిన ఒప్పం దంలో ఉత్తర వియత్నాం ప్రాంతాన్ని కమ్యూనిస్టుల చేతికీ, దక్షిణ వియత్నాం అమెరికా మద్దతు ఉన్న వర్గానికీ వెళ్లాయి. దక్షిణ వియత్నాంను కూడా కలిపి విశాల వియత్నాం ఏర్పాటు చేయడానికి వెంటనే మరో పోరాటం మొదలైంది.
 
  ఈ ప్రయత్నాలను అడ్డుకోవడానికి అమెరికా చేసిన ప్రయత్నమే వియత్నాం యుద్ధం. అమెరికా సుదీర్ఘకాలం చేసిన ఒకే ఒక్క యుద్ధం. నలభై లక్షల మంది ఉత్తర, దక్షిణ వియత్నాం సాధారణ పౌరులుచనిపోయారు. 11 లక్షల మంది కమ్యూనిస్టులు చని పోయారు. దాదాపు 60 వేల అమెరికా సైన్యం మట్టి కరిచింది. ఎలాంటి ఫలితం సాధించకుండానే అమెరికా యుద్ధం విరమించుకుం ది. మొదట్లో సైన్యానికి మద్దతు ఇచ్చిన అమెరికా పౌరులు అనంతర కాలంలో తమ వైమనస్యాన్ని ప్రకటించారు.
 
 యుద్ధ సమయంలో వియత్నాం, లా వోస్, కంబోడియాల మీద అమెరికా దాదాపు 70 లక్షల బాంబులు కురిపించింది. వాటిలో వియత్నాంలోని క్వాంగ్ ప్రాంతంలోని టేత్రా కమ్యూన్‌లోని కెమ్ అనే శివారు గ్రామం మీద 1971లో పడిన ఒక బాంబే హో వాన్ థాన్ జీవితాన్ని అడవుల పాల్జేసింది. అతడి ఇంటికి సమీపంగా మందుపాతర పేలడం వల్ల, విమానాల నుంచి పడుతున్న బాంబుల వల్ల అప్పుడే ప్రసవించిన థాన్ భార్య, మరో ఇద్దరు పిల్లలు చనిపోయారు. చేతికి అందిన ఏడాది వయసు కొడుకు హో వాన్ లాన్‌ను తీసుకుని థాన్ నలభై మైళ్ల దూరంలోని అడవులకు పారిపోయాడు. అతడు ఉత్తర వియత్నాం తరఫున అమెరికాతో పోరాడుతున్నవాడే.
 
 అయితే అంత బీభత్సంలోను థాన్ భార్య ప్రసవించిన కొడుకు హో వాన్ త్రి బతికే ఉన్నాడు. అతడిని సమీప బంధువొకరు పెంచి పెద్ద చేశారు. ఇరవై ఏళ్ల క్రితం ఇతడే అడవులలో ఉన్న తన తండ్రి, అన్నల ఉనికిని కనుగొనగలిగాడు. వాన్ త్రి, ఇతర బంధువులు ఎంత చెప్పినా ప్రయోజనం లేకపోయింది. థాన్ అడవి విడిచి గ్రామంలోకి రావడానికి అంగీకరించలేదు. తరువాత మళ్లీ కొన్ని సంబారాలు, బట్టలు తీసుకుని వెళితే ఆ ఇద్దరి ఆచూకీ దొరకలేదు. దీనితో ఆ ఇద్దరు చనిపోయి ఉంటారని కెమ్ గ్రామవాసులు నిర్ధారణకు వచ్చారు. ఇప్పుడు మళ్లీ అనుకోకుండా అడవి శివార్లలోని గ్రామీణులు వంట చెరకు కోసం పాతిక మైళ్లు లోపలికి వెళ్లినపుడు ఈ తండ్రీ కొడుకుల ఆచూకీ తెలిసింది. అధికారులకు విషయం తెలిసి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి రహస్యంగా వెళ్లి పట్టుకున్నారు. థాన్ నడిచే స్థితిలో లేడు. అతడి వయసు 82 సంవత్సరాలు. లాన్ వయసు 41 సంవత్సరాలు. థాన్‌ను కమ్యూన్ కేంద్ర వైద్యాలయంలో చేర్చి చికిత్స చేస్తున్నారు. లాన్‌ను బంధువుల అధీనంలో ఉంచారు.
 
 ఆధునిక కాల యుద్ధం ఆ తండ్రీ కొడుకులను ఆటవిక జీవితాన్ని ఎంచుకునేటట్టు చేసింది. ఆ ఇద్దరు కూరలు పండించేవారు. వేటాడేవారు. చెరకు, పొగాకు కూడా సొంత అవసరాల కోసం పండించారు. చెట్టు బెరడు తో తయారు చేసిన గుడ్డలాంటి వస్త్రంతో, అడ్డదిడ్డంగా కత్తిరించిన జుట్టుతో 41 ఏళ్ల లాన్ దొరికాడు. అడవిలో ఆకాశాన్ని చుంబిస్తున్నట్టు ఉండే ఓ చెట్టు మీద ఇరవై అడుగుల ఎత్తున వెదురుబొంగులతో ఆవాసాన్ని (ట్రీహౌస్) ఏర్పాటు చేసుకున్నారు. నిప్పు తయా రు చేయడం నేర్చుకున్నారు.
 
 థాన్ వియత్నాంలోని అనేక తెగలలో ఒక మైనారిటీ తెగకు చెందినవాడు. అతడి మాతృభాష కొర్. కమ్యూన్ అంతా మాట్లాడే కిన్ భాషను పూర్తిగా మరచిపోయాడు. కొర్ భాషలో కొద్దిగా మాట్లాడుతున్నాడు. లాన్‌కు కొన్ని పదాలు మాత్రమే తెలుసు. ఇద్దరూ ఏక్షణంలోనైనా మళ్లీ అడవులకు పారిపోయే ప్రమాదం ఉందని అందరికీ అనుమానమే. గ్రామీణులు ఇచ్చిన తిండే కాదు, నీరు కూడా లాన్ ముట్టడం లేదు. 40 ఏళ్లు ఈ ఇద్దరు ఆ అడవిలో జీవించగలగడం వింతల్లో కెల్లా వింత అని కెమ్ గ్రామస్థులు అనుకుంటున్నారు.
  నిజమే... యుద్ధం తరువాత ఏదీ నాగరికంగా మిగలదు. థాన్, లాన్ నిష్ర్కమణ అందుకు నిదర్శనం. ఈ వాస్తవాన్ని అమెరికా మేధావులు ఇప్పటికైనా గుర్తిస్తున్నారు.
 డా॥గోపరాజు నారాయణరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement