
సంగ్రామం: యుద్ధం శాయరా ప్రేమికా!
1914 ఆగస్టు చివరిలో, సెప్టెంబర్ మొదటి వారంలో ఇంగ్లండ్ అంతటా తెల్ల ఈకల ప్రభంజనం తుపానులా వీచింది. అంటే, ఇది 1914 ఆగస్టు నాటి మోన్స్ యుద్ధంలో ఇంగ్లండ్ పలాయనం చిత్తగించిన తరువాత పరిణామమన్నమాట. పదవీ విరమణ చేసిన సైనికోద్యోగి అడ్మిరల్ చార్లెస్ పెన్రోజ్ ఫిట్జ్‌గెరాల్డ్ ముప్పయ్ మంది మహిళలను కూడగట్టి, ఫోక్‌స్టోన్ అనే చోట ఈ ఈకల పంపకాన్ని మళ్లీ మొదలుపెట్టించాడు. ఆ ముప్పయ్ మంది మహిళలంతా ఒంటి మీద సైనిక దుస్తులు లేని వారు ఎవరు కనిపించినా పట్టుకెళ్లి ఇచ్చేశారు. సామూహిక పూనకం వచ్చినట్టు మహిళలు తెల్ల ఈకలతో వీర విహారం చేశారు.
ఇరవయ్యో శతాబ్దం ఆరంభం నుంచే యూరప్ ఖండం మొత్తానికి మిలటరీ యూనిఫారమ్ తొడిగే పని మొదలయింది. గ్రేట్‌వార్ (మొదటి ప్రపంచయుద్ధం) మొదలయ్యే సమయానికి ఆ పని పూర్తయింది. ఇందులో జర్మనీది అందె వేసిన చేయి. ప్రతి పౌరుడు మూడేళ్లు సైన్యంలో పనిచేయడం అనివార్యం చేస్తూ అక్కడ చట్టాలే వచ్చాయి. ఆ తరువాతి స్థానం ఇంగ్లండ్‌దే. ఇదంతా దేశాధినేతలూ, సైనికాధికారుల చొరవతో లేదా బలవంతంతోనే జరిగినది కాదు. సామాన్య ప్రజలూ, చాలామంది తండ్రులూ, ఎంతో మంది బాలికలూ కూడా ఈ ‘దేశ రక్షణ’పనిలో భాగం పంచుకున్నవారే. బెల్జియం, ఫ్రాన్స్ సరిహద్దులలోని మోన్స్ దగ్గర బ్రిటిష్ సైన్యం పలాయనం చిత్తగించిన తరువాత సైనికీకరణ ఆంగ్ల జాతిలో అంటువ్యాధిలా విస్తరించింది.
‘‘నువ్వు యూనిఫారమ్‌లో కనిపించాలి....!’’
పౌర దుస్తుల్లో ఉన్న ఓ యువకుడు లేదా అప్పుడే మీసాలు మొలుస్తున్న బాలుడు వీధిలో నడిచి వెళుతూ ఉంటాడు. అత డి దృష్టిని తన వైపు తిప్పుకోవడానికి హొయలు పోతూ ఎవరో యువతి ఆ దారిలో నిలబడి ఉంటుంది. అతడు చూస్తాడు. అందుకు స్పందనగా ఆమె ఓ వాలు చూపు విసిరి, చిరునవ్వును కూడా సంధిస్తుంది. ఆ కుర్రాడు వడివడిగా దగ్గరకి వెళతాడు.
ఆమె ఒక తెల్లటి ఈక తీసి చేతికి అందిస్తూనో, చొక్కాకు తగిలిస్తూనో చెబుతుంది, పై మాట. 1914 ఆఖరు నుంచి 1915 వరకు ఇంగ్లండ్‌లో, ప్రధానంగా లండన్‌లో ఎక్కడ చూసినా ఈ దృశ్యాలే. ఇరవై వేల మంది యువతులు దీనినో ఉద్యమంగా మలిచారు. వీరినే ‘వైట్ ఫెదర్ బ్రిగేడ్’ అని పిలిచేవారు. వైట్ ఫెదర్ ఆర్డర్ అనీ, ఖాకీ ఫీవర్ అని కూడా దీనికి పేర్లొచ్చాయి. ఆడపిల్లలంతా యువకులకి ఒక గడువు విధించి, అప్పటిలోగా ఖాకీ దుస్తులు ధరించకుంటే ఇక ముఖం చూపించనక్కరలేదని కటువైన నిబంధనలు విధించేవారు. మిత్రుడు, బంధువు, సోదరుడు ఎవరినీ వదిలిపెట్టలేదు.
గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్న అబ్బాయిలు చాలా మంది సైన్యంలో చేరవలసి వచ్చింది. లండన్ నగరంలోని ఈస్ట్ ఎండ్ ప్రాంత ఆడపిల్లలయితే కోడిపిల్లల కింది భాగం ఈకలు తెచ్చి పురుషుల కోటుకు తగిలించేవారు. ఇది ఇంకాస్త అవమానించడమే. ‘యూనియన్ జాక్ కామిక్’ పేరుతో వచ్చిన ఒక పుస్తకంలో తెల్లఈకలు ఇచ్చే పనిలో ఆడపిల్లలు ఎంత దూకుడుగా ఉండేవారో కనిపిస్తుంది. జేబు నిండా ఈకలను నింపుకుని బయలుదేరుతున్న ఒక బాలికను ఆమె తల్లి నిరోధిస్తుంది. తనను ఆపవద్దని తీవ్రంగా ప్రతిఘటించి మరీ ఆ బాలిక వెళ్లిపోతుంది. అవతలి మనిషిలో పిరికితనాన్ని గుర్తు చేయడానికి తెల్ల ఈకలను ఇచ్చేవారు. తెల్ల ఈక కిటుకు ఇంగ్లండ్‌కు కొత్తకాదు. పందొమ్మిదో శతాబ్దంలో అక్కడక్కడా దీని ప్రస్తావన కనిపిస్తుంది. పద్దెనిమిదో శతాబ్దంలో ఇంగ్లండ్‌లో కోడి పందేలు జరిగేవి. తోక భాగంలో ఉండే ఈకల సముదాయంలో తెల్లవి ఉంటే ఆ కోడి పిరికిదనీ, పోరాడే శక్తి లేనిదనీ ప్రకటించేవారు. దీనినే మనుషులకు కూడా అన్వయించడం మొదలయింది.
ఇదే అంశాన్ని రెండు కోణాల నుంచి ఆవిష్కరించిన నాటకం ‘ద మ్యాన్ హూ స్టేడ్ ఎట్ హోమ్’. లెక్‌మియర్ ఒరాల్, జె.ఇ. హెరాల్డ్ టెరీ అనే ఇద్దరు ఈ నాటకం రాశారు. ఇందులో కథానాయకుడు క్రిష్టోఫర్ బ్రెంట్. ఇతడు ఎవరు ఏమి చెప్పినా వినిపించుకోడు. ఏమన్నా దులిపేసుకుని పోతాడు. ఓ బాలిక హొయలన్నీ ప్రదర్శించి తెల్ల ఈక ఇస్తుంది. అప్పుడు బ్రెంట్ ఏంచేశాడు? అందరిలా అవమానంతో కుంగి పోలేదు. ఎవరికీ కనిపించకుండా మాయమైపోలేదు. ఆ ఈకతోనే తన పైప్‌ని శుభ్రంగా తుడిచి, ఆ పిల్ల చేతికి ఇచ్చి, వెళ్లిరమ్మన్నాడు. నిజానికి ఇతడు అప్పటికే సైన్యంలో ఉన్నాడు. చాలామంది కంటె సాహసి. ఇలా తెల్ల ఈక ఉదంతాలకి ఈ రెండు కోణాలూ కనిపిస్తాయి. ఈకల పుణ్యమా అని యుద్ధానికి వెళ్లిన వాళ్లూ ఉన్నారు. కొన్ని సందర్భాలలో ఈకలు తీసుకువచ్చి ఇవ్వబోయిన బాలికలూ, యువతులూ భంగపడిన ఉదంతాలూ, వారికి దిగ్భ్రమ కలిగించే వాస్తవాలు తెలియడమూ కనిపిస్తాయి.
ఒకసారి బస్సులో కూర్చుని సాధారణ పౌరుడి దుస్తుల్లో ఒక యువకుడు ప్రయాణిస్తున్న సంగతి అమ్మాయిలు పసిగట్టారు. వెంటనే అతడి దగ్గరకి వెళ్లి తెల్ల ఈక అందించారు. అతడు లేచి నిలబడ్డాడు. ఒక కాలు లేదు. అంతకు ముందు జరిగిన ఒక యుద్ధంలో అతడు కాలును కోల్పోయాడు. స్వచ్ఛందంగా సైనిక ఎంపిక కేంద్రాలకు వెళ్లినా అవకాశం దొరకని వాళ్లకి కూడా ఈకల అనుభవం ఎదురయ్యేది. కొందరు తెల్ల ఈకల బెడద పడలేక, సైనిక ప్రవృత్తి ఒంటికి పడకపోయినా వెళ్లేవారు.
యుద్ధంలో చనిపోయారు. ఈ అంశం మీద 1960లో బీబీసీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఎన్నో సంఘటనలు వెలుగుచూశాయి. తెల్ల ఈకల బెడదతోనే కొందరు ప్రభుత్వోద్యోగులు కూడా ఉద్యోగాలు వదిలి యుద్ధానికి వెళ్లే వారు. దీనితో సంక్షోభం ఏర్పడింది. అందుకే ప్రభుత్వోద్యోగులు, ముఖ్యంగా రక్షణ కర్మాగారాలలో ఉన్నవారు కూడా దేశ రక్షణకు పాటు పడుతున్నవారే కాబట్టి వారు వెళ్ల వలసిన అవసరం లేదని హోం శాఖ కార్యదర్శి రెజినాల్డ్ మెకన్నా ప్రకటించారు. వారిచేత ‘కింగ్ అండ్ కంట్రీ’ అని రాయించిన పతకాలు ధరింపచేసేవారు.
ఇంత పూనకం రావడానికీ, ముఖ్యంగా యువతులూ స్త్రీలూ ఇలా ప్రవర్తించడానికీ కారణం లేకపోలేదు. ఫ్రాన్స్ మీదకు దండెత్తి వస్తూ జర్మనీ సైన్యం బెల్జియంను నాశనం చేసింది. ‘రేప్ ఆఫ్ బెల్జియం’ అని దీనికి పేరు. ఆఖరికి చర్చీలూ, గ్రంథాలయాలనూ సయితం విడిచిపెట్టలేదు. ఎందరో స్త్రీలను జర్మనీ సేనలు చంపాయి. మరెందరో వాళ్ల అత్యాచారాలకు బలయ్యారు. ఆ యుద్ధ నేరాలు సృష్టించిన భయంతోనే ఇంగ్లండ్ స్త్రీలు ఇదంతా చేశారని ఒక వాదన!
1902లో మరోసారి ఈ తెల్ల ఈకల సంప్రదాయం దేశాన్ని చుట్టుముట్టింది. ఏఈడబ్ల్యు మేసన్ రాసిన ‘నాలుగు ఈకలు’ అందుకు కారణం. బోయర్ యుద్ధాలు (1880-1881, 1899-1902) జరుగుతుండగా ఈ నవల వచ్చింది. హ్యారీ ఫేవర్‌షామ్ అనే సైనికుడు సూడాన్‌తో యుద్ధానికి వెళుతున్న తన దళంతో వెళ్లకుండా పారిపోయి వస్తాడు. హ్యారీ సహచరులు ముగ్గురూ తెల్ల ఈకలూ పంపుతారు. అతడితో నిశ్చితార్థం జరిగిన యువతికీ ఇది తెలుస్తుంది. ఆమె తన టోపీకి ఉన్న ఒక ఈకను తీసి హ్యారీకి పంపిస్తుంది. తనను మరచిపొమ్మనీ, నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నాననీ కూడా తెలియచేస్తుంది. దీంతో హ్యారీ ధైర్యం తెచ్చుకుని రహస్యంగా సూడాన్ వెళ్లి యుద్ధం చేశాడు. యుద్ధఖైదీలుగా పట్టుబడిన తన సహచరులను విడిపిస్తాడు. స్వదేశం చేరుకుని మిత్రులు పంపిన మూడు తెల్ల ఈకలను వారికే అందచేస్తాడు. మళ్లీ ప్రేయసికి దగ్గరవుతాడు.
తెల్ల ఈకల సంప్రదాయాన్ని చాలామంది నిరసించిన దాఖలాలు ఉన్నాయి. అందుకే కొన్ని కఠోర వాస్తవాలు బయటపడ్డాయి. తెల్ల ఈకలు చూపించి యువకులని సైనిక నియామక కేంద్రాల వైపు పరుగులు తీయించడం వెనుక ఆయా నియామక కేంద్రాల సార్జెంట్ల కుట్ర కూడా ఉండేది. యువతుల చేత అవమానానికి గురై వస్తున్న యువకులని మధ్యలోనే సార్జెంట్లు పట్టుకుని ఆ అవమానం నుంచి బయటపడే మార్గం చూపిస్తామని సైన్యంలో చేర్చేవారు. ‘మీ భర్త, కుమారుడు యుద్ధం చేరవలసిన అవసరం లేదా? వాళ్లని యుద్ధానికి వెళ్లమని చెప్పండి!’ అనీ, ‘అమ్మాయిలూ! మీ బాయ్‌ఫ్రెండ్స్ ఖాకీ దుస్తులు ధరించారా? లేకుంటే వాళ్ల చేత ఆ దుస్తులు వేయించవలసిన అవసరాన్ని మీరు గుర్తించాలి’ ఇలాంటి నినాదాలతో, లండన్ మేయర్ పేరిట వాల్‌పోస్టర్లు వెలిశాయి. ఇలాంటి నినాదాలు తయారు చేసిన వాళ్లలో ప్రముఖ రచయిత ఆర్థర్ కానన్ డాయ్ల్ ముఖ్యుడు.
- డా.గోపరాజు నారాయణరావు