కష్టాలు మాఫీ | Special to United Arab Emirates annually | Sakshi
Sakshi News home page

కష్టాలు మాఫీ

Published Wed, Aug 1 2018 12:13 AM | Last Updated on Wed, Aug 1 2018 12:13 AM

Special to United Arab Emirates annually - Sakshi

కంటికి కనిపించే భౌగోళిక సరిహద్దుల్ని దాటడం సులువే. కానీ కనిపించని భాషా సరిహద్దును దాటడమే కష్టం. బతుకు బాట వేసుకోవడానికి గల్ఫ్‌ దేశాల దారి పట్టిన  శ్రామికులలో చాలామంది భాష తెలియక అక్కడి చట్టాల ఉల్లంఘన జాబితాలో  చేరిపోతుంటారు. అలాంటి వారి కోసం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఏటా ఓ  ‘మన్నింపు’ అవకాశం ఇస్తుంటుంది. ఈ ఏడాది కూడా ఆగస్టు ఒకటి నుంచి అక్టోబర్‌  చివరి వరకు  ‘యుఏఈ ఆమ్నెస్టీ 2018’  పేరుతో కష్టాలను మాఫీ చేసేందుకు  ఈ అవకాశాన్ని ఇచ్చింది.

ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఇండియా, బంగ్లాదేశ్, చైనా, ఇథియోపియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, కెన్యా, శ్రీలంక, ఇండోనేషియా దేశాలు ఇప్పటికే తమ ప్రతినిధులను ఎమిరేట్స్‌కు పంపేశాయి. అయితే ఇండియా నుంచి వెళ్లిన ప్రతినిధుల్లో ఒక్క తెలుగు అధికారి కూడా లేకపోవడంతో.. గతంలో అరబ్‌ ఎమిరేట్స్‌ ఎంబసీలో ఉద్యోగం చేసి, అక్కడ.. చదువు సరిగ్గా రాని తెలుగు వాళ్లు పడే ఇబ్బందులు స్వయంగా చూసిన నంగి దేవేందర్‌ రెడ్డి తన వంతుగా ‘యుఏఈ ఆమ్నెస్టీ 2018’లో ఒక స్టాల్‌ పెట్టించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

పేరు తప్ప ఇంకేం చదవలేరు
‘‘ఇండియా నుంచి వెళ్లిన అధికారులు ఇంగ్లిష్, హిందీలోనే మాట్లాడతారు. ‘తెలుగు వచ్చిన  అధికారి ఒక్కరైనా ఉండేటట్లు చూడండి’ అని అడిగాం. అయినా పట్టించుకున్న వాళ్లు లేరు. భారత దేశం అంటే హిందీ మాట్లాడే ప్రజలుండే దేశమేననే అపోహలో ఉండే కేంద్ర ప్రభుత్వానికి, దక్షిణ రాష్ట్రాల మీద పెద్ద పట్టింపు ఉండదు. ‘కనీసం మాకు ఒక స్టాల్‌ పెట్టుకునే అవకాశమైనా ఇవ్వండి’ అని వేడుకుంటే ఆ మొరను మాత్రం ఆలకించారు.  ఆగస్టు 1 నుంచి మొదలౌతున్న ‘యుఏఈ ఆమ్నెస్టీ 2018’లో ‘నవ తెలంగాణ సమితి’ పేరు మీద స్టాల్‌ పెట్టాం. పేరుకిది తెలంగాణ సమితి అయినప్పటికీ తెలుగువాళ్లందరికీ మా బృందం సేవలు అందిస్తుంది. మన దేశం నుంచి గల్ఫ్‌కి వెళ్లే వాళ్లలో మలయాళం, తెలుగు వాళ్లే ఎక్కువ. మలయాళీయులు బాగా చదువుకుని వైట్‌ కాలర్‌ జాబ్స్‌ చేసుకుంటున్నారు. తెలుగు వాళ్లు.. ముఖ్యంగా తెలంగాణ వాళ్లు మాత్రం భవన నిర్మాణ కార్మికులుగా వెళ్తున్నారు. వాళ్లలో తమ పేరు తప్ప ఇంగ్లిష్‌లో మరే పదాన్ని కూడా చదవలేని వాళ్లే ఎక్కువ. ఆమ్నెస్టీ పీరియడ్‌ గురించి తెలుసుకుని అప్లయ్‌ చేసుకోవడం కూడా తెలియదు. అసలు ఆమ్నెస్టీ అనే పదం కూడా తెలియదు. వాళ్లకు తెలిసిందల్లా ‘అవుట్‌ పెట్టినారంట. వీసా గడువు తీరిపోయిన వాళ్లను, కలివెలి వీసా (రాంగ్‌ వీసా) తో వెళ్లిన వాళ్లను అవుట్‌లో ఇండియాకి పంపించేస్తార’ని మాత్రమే. 

వేడికి అన్నం పాచిపోయేది
గల్ఫ్‌లో భవన నిర్మాణరంగంలో పని చేసే వాళ్లు రోజూ ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచి వండుకుని, బాక్స్‌ సర్దుకుని, ఇతర పనులన్నీ చేసుకుని ఐదున్నరకంతా సైట్‌కెళ్లే వెహికల్‌ ఎక్కాలి. తిరిగి బసకొచ్చేసరికి రాత్రి ఎనిమిది– తొమ్మిదవుతుంది. పగలంతా ఎర్రటి ఎండలో పని చేయాలి, ఉదయం వేడిగా ఉన్నప్పుడే బాక్సులో పెట్టుకున్న అన్నం అక్కడి ఎండలకు ఒక్కోసారి పాచిపోతుంది కూడా. అలాగే తింటే ఆరోగ్యాలు పాడవుతాయి. 45 డిగ్రీల ఎండల్లో చెమట రూపంలో రెండు లీటర్ల నీరు పోతుంది. రోజుకి పది లీటర్లకు తక్కువ కాకుండా నీళ్లు తాగితే తప్ప బతికి బట్ట కట్టడం కష్టం. ఇదేమీ తెలియక పనులు చేసుకుంటూ కొన్నాళ్లకే బీపీ, షుగర్‌ల బారిన పడుతుంటారు. హఠాన్మరణాలన్నీ హార్ట్‌ ఎటాక్‌లే. వర్క్‌ ప్రెషర్‌ ఎక్కువై గుండె ఆగిపోయేవాళ్లు కొందరైతే, బాడీ డీ హైడ్రేట్‌ అయి లోబీపీతో గుండె ఆగిపోయేవాళ్లు కొందరు. రోజంతా ఎండలో పని చేసి గదికొచ్చి స్నానం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన వాళ్లెందరో. వీటన్నింటి మీద వారిలో చైతన్యం కలిగిస్తే కనీసం తగినంత నీళ్లయినా తాగుతారనేది మా ప్రయత్నం. గల్ఫ్‌లో మంచి ఉద్యోగాల్లో ఉన్న తెలుగు వాళ్లందరం కలిసి మెడికల్‌ క్యాంపులు పెట్టి మందులిప్పించాం. ఇప్పటికీ ఇప్పిస్తున్నాం. 

నెలకు ఐదారు మరణాలు
నేను 2010 నుంచి ఐదేళ్ల పాటు బహ్రెయిన్‌లో ఇండియన్‌ ఎంబసీలో ఉద్యోగం చేశాను. కనీసం నెలకు ఐదారు మరణాలుండేవి. గడచిన నాలుగేళ్లలో ఒక్క తెలంగాణలోనే 800 గల్ఫ్‌ మరణాలు సంభవించాయి. ఇవన్నీ చూస్తుంటే మనకు గల్ఫ్‌ అంటే భూతల నరకమేమో అనిపిస్తుంది. అయితే పనిలో నైపుణ్యం పెంచుకుని, ప్రభుత్వ ఆథరైజ్‌డ్‌ సంస్థ ద్వారా, ఒరిజినల్‌ వీసాతో వెళితే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. రహదారి సరిగ్గా లేనప్పుడే పక్కదారులు డెవలప్‌ అవుతాయి. పొరపాట్లు జరుగుతున్నది అక్కడే. 

ముందే ట్రైనింగ్‌ తీసుకోవాలి
మనకు హైదరాబాద్‌లో 45 ఎకరాల ట్రైనింగ్‌ సెంటర్‌ ‘న్యాక్‌’ (నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌) ఉంది. తాపీ పని నుంచి, ఎలక్ట్రికల్, ప్లంబింగ్‌ వంటి భవన  నిర్మాణానికి అవసరమైన అన్ని విభాగాల్లోనూ ఇంజనీరింగ్‌ స్కిల్స్‌లో ఇక్కడ ట్రైనింగ్‌ ఇస్తారు. నెలకు వెయ్యిమందికి శిక్షణ ఇవ్వగలిగిన సంస్థ మన దగ్గర ఉన్నప్పటికీ ఆ విషయం మన గ్రామాల్లోని యువకులకు తెలియడం లేదు. గ్రామాల్లో వేలాది మంది పని లేక, పని చేయడం చేతకాక ఉన్నారు. కనీసం గల్ఫ్‌ వంటి చోట్లకు వెళ్లే వాళ్లయినా న్యాక్‌లో ట్రైనింగ్‌ తీసుకుని సర్టిఫికేట్, వర్క్‌ పర్మిట్‌తో  వెళ్తే.. ఉద్యోగ భద్రత ఉంటుంది.  ‘ప్రొటెక్ట్‌ యువర్‌సెల్ఫ్‌ వయా రెక్టిఫై యువర్‌ స్టేటస్‌’ నినాదంతో ఇవాళ్టి నుంచి మొదలౌతున్న ‘యుఏఈ ఆమ్నెస్టీ 2018’ లో అక్కడున్న మనవాళ్లు తప్పు దిద్దుకోవడానికి రెండు అవకాశాలున్నాయి. అక్కడే ఉండాలంటే ఇల్లీగల్‌ వీసాను లీగలైజ్‌ చేసుకుని కొనసాగవచ్చు. వచ్చేయాలనుకుంటే ఇండియాకి వచ్చేయవచ్చు. ఎలాంటి సహకారం కావాలన్నా టోల్‌ ఫ్రీ నంబరులో సంప్రదించాలి. ‘క్షమాభిక్షకు అవకాశం ఆగస్టు 1 నుంచి అక్టోబరు 31 వరకు ఉంటుంది’’ అని వివరించారు దేవేందర్‌. 

‘అవుట్‌’ పెట్టినట్లే తెలీదు!
ఆమ్నెస్టీ వార్తలు గల్ఫ్‌లో అరబిక్, ఇంగ్లిష్‌ పత్రికల్లో ప్రచురితమవుతాయి. వాటిని మనవాళ్లు చదవలేరు. నగరాల్లో ఉద్యోగం చేసే ఏ కొందరికో తెలుస్తుంది. వాళ్లు సాధ్యమైనంత వరకు ఇతర తెలుగువాళ్లకు చేరవేస్తుంటారు. కానీ మనవాళ్లు పని చేసే వర్క్‌సైట్‌లు నగరాలకు 30–40 కిలోమీటర్ల దూరాన ఉంటాయి. వాళ్లకు అవుట్‌ (ఆమ్నెస్టీ) పెట్టినట్లే తెలియదు. కనీసం మన తెలుగు పత్రికలైనా విస్తృతంగా ప్రచురిస్తే... గల్ఫ్‌ వెళ్లిన వాళ్ల కుటుంబీకులు ఇక్కడ చదివి, వారానికో–నెలకో ఫోన్‌లో దొరికినప్పుడు సమాచారమిస్తారనేది నా ప్రయత్నం. 
– నంగి దేవేందర్‌ రెడ్డి, కన్వీనర్, టీపీసీసీ గల్ఫ్‌ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ 

గల్ఫ్‌లో పనిచేసే భారతీయులు అనేక కారణాలతో వెనక్కి వచ్చేయాల్సి వుంటుంది. ప్రభుత్వాలు ‘ప్రకృతి విపత్తు నిర్వహణ’ కోసం ఏర్పాటు చేసినట్లే – గల్ఫ్‌ బాధితుల కోసం కూడా శాశ్వత పథకాన్ని పెట్టాలి. ‘ప్రవాసి మిత్ర’ ద్వారా మేము ప్రభుత్వాలను కోరుతూనే ఉన్నాం. బాధితులకు పునరావాసం కూడా కల్పించాలి. 
– భీంరెడ్డి, ప్రవాసి మిత్ర అధ్యక్షులు

సహాయం కోసం
టోల్‌ ఫ్రీ ఫోన్‌ నంబర్లు: దుబాయ్‌లోని భారత్‌ కాన్సులేట్, అబుదాబి లోని భారత రాయభార కార్యాలయాల్లో సహాయ కేంద్రాలున్నాయి. దుబాయ్‌ వాళ్లు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబరు :0097150565463909 లేదా indianindubai.amnesty@gmail.com అబుదాబిలో ఉన్న వాళ్లు... 00917508995583 లేదా  indemb.uaeamnesty18@gmail.com యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో తెలుగు వారికి సేవలందిస్తున్న వారు: టీపీసీసీ గల్ఫ్‌ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ కో ఆర్డినేటర్‌ మారుతి ముత్యాల: 00971566670013; కేవీఎస్‌ రెడ్డి: 00971527714549
గమనిక: క్రిమినల్‌ కేసులున్న వాళ్లకు ఈ సహాయం వర్తించదు.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement