సాక్షి, హైదరాబాద్: దుబాయ్ తొలిరోజు పర్యటనలో భాగంగా మంత్రి కె.తారకరామారావు మంగళవారం పలు వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధి బృందాలతో సమావేశమయ్యారు. సుమారు రూ. 1,040 కోట్లకుపైగా పెట్టుబడులు తెలంగాణలో పెట్టేందుకు తొలిరోజే అంగీకరించాయి. తెలంగాణ ప్రభుత్వం భారీగా పెట్టుబడులను రప్పించి, యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తోందని కేటీఆర్ వారికి వివరించారు.
మంత్రి కేటీఆర్‌తో లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది. ప్రతిఏటా సుమారు వెయ్యి కోట్ల ఆక్వా ఉత్పత్తులను ఈ ప్రాంతం నుంచి సేకరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందుకు అవసరమైన కోల్డ్ స్టోరేజీ, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ వంటి వాటిపై పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. తమ పెట్టుబడి ద్వారా ఈ ప్రాంతంలో 500 మందికి నేరుగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని పేర్కొంది.
మలబార్ గ్రూప్ పెట్టుబడి రూ.125 కోట్లు
తెలంగాణలో ఇప్పటికే బంగారం రిఫైనరీ రంగంలో తెలంగాణలో పెట్టుబడి పెట్టిన మలబార్ సంస్థ తాజాగా ఫర్నిచర్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం రూ.125 కోట్లు పెట్టుబడిగా పెడుతున్నట్టు తెలియజేసింది. దీనిద్వారా వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు కేటీఆర్‌తో మలబార్ గ్రూపు ప్రతినిధి బృందం సమావేశమైంది. ఆ సంస్థ చైర్మన్ ఎంపీ అహ్మద్ వీడియో కాన్ఫరెన్ ్స ద్వారా మంత్రితో మాట్లాడారు.
రూ.700 కోట్లతో నాఫ్కో ప్లాంట్
రాష్ట్రంలో రూ.700 కోట్లతో అగ్నిమాపక సామగ్రి తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్కో ప్రకటించింది. ఈ మేరకు నాఫ్కో కంపెనీ సీఈవో ఖాలిద్ అల్ ఖతీజ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కేటీఆర్‌తో సమావేశమైంది. న్యాక్‌తో కలిసి అంతర్జాతీయస్థాయి ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలన్న కేటీ ఆర్ ప్రతిపాదనకు నాఫ్కో అంగీకరించింది.
కాగా, తెలంగాణలో తమ కార్యకలాపాల విస్తరణకు రూ. 215 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రపంచ దిగ్గజ పోర్ట్ ఆపరేటర్ డీపీ వరల్డ్ ప్రకటించింది. మంత్రి కేటీఆర్‌తో డీపీ వరల్డ్ గ్రూప్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అనిల్ మెహతా, ప్రాజెక్టు డెవలప్‌మెంట్ డైరెక్టర్ సాలుష్ శాస్త్రి మంగళవారం దుబాయ్‌లో భేటీ అయ్యారు. డీపీ వరల్డ్ హైదరాబాద్‌లో తన ఇన్ లాండ్ కంటైనర్ డిపో ఆపరేషన్ కోసం రూ.165 కోట్లు, మేడ్చల్ ప్రాంతంలో 5,000 ప్యాలెట్ కెపాసిటీ కలిగిన కోల్డ్ స్టోరేజ్ వేర్‌హౌస్‌ను రూ.50 కోట్లతో ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment