
సాక్షి, హైదరాబాద్: జీవశాస్త్ర రంగంలో హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయిలోనూ తనదైన ముద్ర వేస్తోందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. గతేడాది కాలంలో తెలంగాణలో రూ. 6,400 కోట్ల విలువైన పెట్టుబడులు జీవశాస్త్ర రంగంలోనే వచ్చాయని చెప్పారు. 215 కొత్త, ప్రస్తుత కంపెనీలు పెట్టిన ఈ పెట్టుబడులతో 34 వేల మందికి ఉపాధి కల్పించగలిగామని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘బయో ఆసియా’19వ సదస్సును వర్చువల్ పద్ధతిలో గురువారం కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీ ప్రాధాన్యాన్ని ప్ర పంచం గుర్తించిందన్నారు. కరోనా నియంత్రణకుa దేశీయంగా అభివృద్ధి చేసిన 3 టీకాల్లో రెండు హైదరాబాద్‌లోనే తయారవడం తమకు గర్వకారణమన్నారు.
గతేడాది డిసెంబర్‌లో తాము 7 కంపెనీలతో మెడికల్ డివైజెస్ పార్క్‌ను ప్రారంభించగా రానున్న 6 నెలల్లో 20 కంపెనీలు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఇందులో రూ. 1,500 కోట్లతో స్థాపించిన 50 కంపెనీలు పరిశోధనలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. అయితే దేశం ప్రపంచ ఫార్మా రాజధానిగా అవతరించినా.. మేధోహక్కుల విధానం వంటివి మరింత మెరుగు కావాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment