ఎల్లలు దాటనున్న మాడుగుల హల్వా! | Arrangements for Geographical Identification of Madugula Halwa | Sakshi
Sakshi News home page

ఎల్లలు దాటనున్న మాడుగుల హల్వా!

Published Sat, Sep 16 2023 4:45 AM | Last Updated on Sat, Sep 16 2023 4:45 AM

Arrangements for Geographical Identification of Madugula Halwa - Sakshi

సాక్షి, విశాఖపట్నం : నోట్లో వేసుకోగానే మైమరపించే మాడుగుల హల్వా రుచిని ప్రపంచానికి పరిచయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో దీనిని ప్రత్యేక పరిశ్రమగా అభివృద్ధి చేయడంతో పాటు.. భౌగోళిక గుర్తింపు తీసుకొచ్చేందుకు అడుగులేస్తోంది. ఇందుకోసం దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయంతో ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ ఒప్పందం కుదుర్చుకుంది.

జీడి పప్పు.. బాదం పలుకులు.. కవ్వంతో చిలికిన ఆవు నెయ్యి, ఎండు ఖర్జూరం నీళ్లు, తేనే.. గోధుమ పాలు.. వీటన్నింటినీ రాతి రుబ్బు రాయితో గంటల పాటు సానబెట్టి.. ఆపై కట్టెల పొయ్యిలో తగిన ఉష్ణోగ్రతలో తగిన పాకంతో పదునుపెట్టగానే పుట్టుకొస్తుందీ హల్వా. మాడుగులలో 1890వ సంవత్సరంలో దంగేటి ధర్మారావు కుటుంబం మాత్రమే దీనిని తయారు చేసేది. ప్రస్తుతం ఈ వ్యాపారంపై అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 5 వేల మందికి పైగా నిరుపేద కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.  

మొట్టమొదటిగా ‘మాడుగుల హల్వా’ ఎంపిక
మాడుగుల హల్వా వ్యాపారాన్ని మరింత వృద్ధిలోకి తేవడమే కాకుండా విదేశాల్లో దర్జాగా విక్రయించేందుకు అవసరమైన చేయూతనందించేందుకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరించనుంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (పీఎంఎఫ్‌ఎంఈ)లో భాగంగా ఈ పరిశ్రమని అభివృద్ధి చేయనుంది. ఇందుకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు సమకూరుస్తాయి.

యంత్రాల్ని సమకూర్చడం, స్కిల్స్‌ అప్‌గ్రేడ్‌ చేయడం, ప్రాసెసింగ్‌ ఫెసిలిటీస్‌ వంటివి కల్పిస్తారు. వీటితో పాటు.. మార్కెటింగ్‌ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. ఇందుకోసం రాష్ట్రంలో తొలిసారి మాడుగుల హల్వాని ఎంపిక చేశారు. ఇకపై ఈ హల్వా.. ఒక బ్రాండెడ్‌ ప్రొడక్ట్‌గా మార్కెట్‌లో లభించనుంది. ఇందుకు కావాల్సిన వసతుల్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది.

పథకంలో భాగంగా ఏడాది పాటు ప్యాకేజింగ్‌ మెటీరియల్, గోదాముల్లో నిల్వ చేసుకునేందుకు అద్దె, రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వమే అందిస్తుంది. ఎలాంటి పెట్టుబడి భారం లేకుండా హల్వాని విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన వ్యయంలో 50 శాతం వరకూ గ్రాంట్‌ కింద ప్రభుత్వం సమకూరుస్తుంది.  

భౌగోళిక గుర్తింపునకు ఒప్పందం..
వందేళ్ల చరిత్ర గల మాడుగుల హల్వాకు భౌగోళిక గుర్తింపు తెచ్చేందుకు దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యా­లయంతో ఏపీ ఫుడ్‌ప్రాసెసింగ్‌ సొసైటీ శుక్రవారం ఎంవోయూను కుదుర్చుకుంది. ఈ గుర్తింపు కోసం అవసరమయ్యే రుసుము­లు, ఇతర ఖర్చులకు సంబంధించి రూ.3 లక్షల వరకూ ప్రభుత్వమే భరించనుంది. వచ్చే ఆరు నెలల్లోపు మాడుగుల హల్వాకు కూడా భౌగోళిక గుర్తింపు వచ్చే అవకాశాలున్నాయి. ఈ గుర్తింపు వస్తే ఇక ఈ పేరుతో ఇక్కడి నుంచి తప్ప మరెవరూ, ఎక్కడా మాడుగుల హల్వాను తయారు చేయలేరు. 

వారసత్వ సంపదగా గుర్తింపు
వందల ఏళ్ల చరిత్ర కలిగిన అనేక తినుబండారాలు తయారు చేసే పరిశ్రమలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ చిరు వ్యాపారం మాదిరిగానే మిగిలిపోయాయి. వాటన్నింటినీ అభివృద్ధి చేసి.. వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే మాడుగుల హల్వాకు భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ మాదిరిగా దీని అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నాం. ఆ తర్వాత మిగిలినవాటిపైనా దృష్టిపెడతాం.   – కేజే మారుతి, ఏపీ ఫుడ్‌ప్రాసెసింగ్‌ సొసైటీ మేనేజర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement