♦ కార్పొరేట్ విద్యకు దూరం అయిన పేద విద్యార్థులు
♦ పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించినా ఆదుకోని పథకం
♦ సర్వర్ మొరాయించడంతో పెండింగ్‌లో వేలాది దరఖాస్తులు
♦ ప్రభుత్వం కావాలనే ఇలా చేస్తోందనే విమర్శలు
♦ గడువు పొడిగిస్తేనే విద్యార్థుకు న్యాయం
ఉలవపాడు:పేదలు కార్పొరేట్ విద్యను అందుకోలేరు. అంత స్థాయిలో ఫీజులు చెల్లించడం అసాధ్యం. అందుకే ప్రభుత్వం ఓ పథకాన్ని ముందుకు తెచ్చింది. పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన వారికి కార్పొరేట్ కళాశాలల్లో ఉచితంగా విద్య అందించే అవకాశం కల్పించింది. దానికి గాను ఈనెల 18 నుంచి 27 వరకు దరఖాస్తులను ఆహ్వానించారు. పదో తరగతిలో 7 జీపీఏ పాయింట్లకంటే పైగా తెచ్చుకున్న విద్యార్థులను అర్హులుగా తేల్చింది.
తీవ్ర నిరాశ
ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసినా.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి వీలులేకుండా సర్వర్ మొరాయించింది. ఇది ప్రభుత్వం కావాలని చేస్తోందా లేక ఇంటర్‌నెట్ సిగ్నల్‌లో సమస్యా అని ఎవరికీ అంతుబట్టడంలేదు. మూడు రోజులుగా సర్వర్ డౌన్ కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలో మునిగిపోయారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ పథకానికి చివరి తేదీ 27 గా ప్రకటించారు. కానీ చివరి మూడు రోజులు పనిచేయకపోయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇలా పేద విద్యార్థులు కార్పొరేట్ ఉచిత విద్యకు అవకాశం కోల్పోయారు. ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి తుది గడువు తేదీని పొడిగించాలని అంతా డిమాండ్ చేస్తున్నారు.
ఇలా చేయాలి..
ఈ ఏడాది మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో 7 గ్రేడు లేదా ఆ పైన మార్కులు సాధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌నెట్‌లో సంబంధిత సైట్ లో అప్లికేషన్ ఫాంమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని హాల్‌టికెట్ వివరాలు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, ఫొటో వంటి వివరాలు అప్‌లోడ్ చేయాలి. అనంతరం కావాల్సిన కార్పొరేట్ కళాశాల ను వరుస క్రమంలో తెలియచేయాలి.
అన్నీ సమస్యలే..
నెట్‌లో దరఖాస్తు చేద్దామని వెళితే సంబంధిత వెబ్‌సైట్ పనిచేయకపోవడంతో అంతా వెనక్కు వస్తున్నారు. కొన్ని సార్లు సైట్ వచ్చినా అందులో 2015–16 విద్యా సంవత్సరం అని కనిపిస్తోంది. అలాగే దరఖాస్తు చేసినా మొబైల్‌కు మెసేజ్ రావడం లేదు. దీంతో అసలు దరఖాస్తు చేశామా లేదా అని ఎవరికీ అర్థం కావడంలేదు. ప్రభుత్వ నిర్వాకం వలన విద్యార్థులు వారి తల్లిదండ్రులు అయోమయంలో పడిపోయారు.
అంతా మాయ!
Published Sun, May 28 2017 2:35 AM | Last Updated on Tue, Sep 5 2017 12:09 PM
Advertisement