మళ్లీ తెరపైకి రామాయపట్నం పోర్టు
{పకాశం జిల్లాలో పోర్టు నిర్మాణం కోసం ప్రయత్నాలు
2,135 ఎకరాల భూసేకరణ కోసం కసరత్తు
పోర్టుకు కేంద్రం సానుకూలత
ఒంగోలు: రామాయపట్నం పోర్టు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు సమీపంలో రామాయపట్నం పోర్టు నిర్మాణానికి గతంలో ప్రతిపాదనలు రాగా, వాటిని రద్దుచేసి దీనికి బదులుగా దుగ్గరాజుపట్నం పోర్టు నిర్మాణానికి గత యూపీఏ ప్రభుత్వం 2013 మే 9న ప్రతిపాదనలు మార్చింది. అయితే అప్పటి నుంచి ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఆ పోర్టు నిర్మాణానికి పలు పర్యావరణ సంస్థలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. పోర్టు నిర్మాణం వల్ల అక్కడి విదేశీ పక్షుల విడిది, పులికాట్ సరస్సు కలుషితమవుతాయని ఈ సంస్థలు పేర్కొంటున్నాయి. 40 వేల మంది జాలర్లు జీవనాధారం కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దుగ్గరాజుపట్నం పోర్టును భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ కూడా వ్యతిరేకిస్తోంది. దీంతో రామాయపట్నంలోనే పోర్టు నిర్మాణం చేపట్టాలని ప్రకాశం జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో రామాయపట్నం పోర్టు సాధన సమితి కూడా ఏర్పడింది.
సాధ్యాసాధ్యాలు పరిశీలించిన కేంద్ర బృందం
రామాయపట్నం పోర్టు నిర్మాణం పూర్తయితే జిల్లా నుంచి పొగాకు, గ్రానైట్, ఉప్పు, పత్తి, జీడిపప్పు లాంటి వస్తువులు జిల్లా నుంచి ఎగుమతి చేసే అవకాశాలున్నాయి. పోర్టు నిర్మించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన పరిశీలనా బృందం నెల రోజుల క్రితం ఈ ప్రాంతాన్ని సందర్శించింది. పోర్టు నిర్మాణానికి గతంలో 5 వేల ఎకరాలు కావాల్సి ఉంటుందన్న ప్రతిపాదనను మారుస్తూ, 2,135 ఎకరాల స్థలంలోనే పోర్టు నిర్మించే అవకాశాలపై అధ్యయనం చేసినట్లు తెలిసింది. ఇందులో 1,200 ఎకరాల ప్రైవేటు భూములను సేకరించాల్సి ఉంది. దీనికిగాను గత ప్రభుత్వం రూ.420 కోట్లను కేటాయించినట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లో ఉన్న ఎనిమిది కాలనీలను తొలగించాలి. ఇందులో నివసిస్తున్న 2,200 మందికి ప్రత్యామ్నాయం చూపించాలి. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి దాదాపు రూ.8 వేల కోట్లు అవుతుందని అంచనా. రోజూ 30 మిలియన్ టన్నుల సరుకులను రవాణా చేసేలా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఆరు బెర్తులతో నిర్మాణం చేపట్టి, ఫిషింగ్ హార్బర్‌ను కూడా ఇక్కడ నిర్మించనున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇప్పటికే కృష్ణపట్నం పోర్టు ఉండగా, దుగ్గరాజుపట్నం పోర్టు అవసరం అక్కడ ఉండదని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రకాశం జిల్లాలో పోర్టు నిర్మాణం చేపట్టడం వల్ల సరుకుల రవాణా కూడా సులభతరమవుతుందని ఆలోచిస్తున్నారు. దీనిపై రామాయపట్నం పోర్టు సాధన సమితి సభ్యులు త్వరలోనే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును కలవనున్నారు.
కాకతీయుల కాలంలోనే పోర్టు
ప్రకాశం జిల్లాలో కాకతీయుల కాలంలోనే పోర్టు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. చిన గంజాం సమీపంలోని మోటుపల్లి వద్ద ఆనాటి ఓడరేవు శిథిలాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. అప్పట్లో మోసలపురంగా పిలిచే ఈ ప్రాంతంలో సముద్ర తీరం వంపుగా ఉండటంతో ఓడలు ఆగడానికి వీలుగా ఉందని ఈ ప్రాంతాన్ని ఓడరేవుగా ఉపయోగించుకున్నారు. కాకతీయుల కాలంలో రాణి రుద్రమదేవి ఈ ప్రాంతంలో పర్యటించినట్లు మెకంజీ తన పరిశోధనా గ్రంథంలో ఉటంకించారు. ఆయనతో పాటు పలువురు గ్రీకు నావికులు కూడా ఈ ఓడరేవు గురించి పేర్కొన్నారు. ఇక్కడ ఓడరేవుకు గుర్తుగా మూడు ఆలయాలను కూడా నిర్మించారట. ప్రస్తుతం వీరభద్రస్వామి ఆలయం, కోదండరామస్వామి ఆలయాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అవీ శిథిలావస్థలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో పోర్టు నిర్మాణం చేపట్టేందుకుగాను స్థల సేకరణ చేపట్టాలని వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భావించారు. అయితే ఆయన మరణంతో ఆ ప్రాజెక్టు కనుమరుగైంది. రామాయపట్నంలో కానీ, మోటుపల్లిలో కానీ ఓడరేవు నిర్మాణం చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.