ఉలవపాడు(ప్రకాశం): అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. సమన్వయ లోపానికి ఇదో మచ్చు తునక. ‘ఎద్దు ఈనిందంటే దొడ్లో కట్టేయ్’మన్న చందంగా ఇసుక తవ్వకం దందా సాగుతున్నాగానీ, ఇటు మైన్స్ అధికారులుగానీ అటు రెవెన్యూ అధికారులుగానీ అటువైపు చూడకపోవడంతో 50 వేల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక తవ్వి తరలించుకు పోయూరు.
అసలేం జరిగింది..?
ప్రకాశం జిల్లా ఉలవ పాడు మండల పరిధిలో ఉచితంగా ఇసుక తోలుకోవడానికి ఒక రీచ్‌ను కేటాయించారు. ముందుగా రెవెన్యూ, మైనింగ్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సర్వే చేసి ఆ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. దీన్ని ఉలవపాడు మండలంలోని కొల్లూరుపాడు-రాజుపాలెం మధ్యలో ఉన్నట్లు నిర్ణయించారు. ఈ మేరకు ఒంగోలు కలెక్టరేట్ నుంచి ఈ రీచ్‌కు అనుమతి వచ్చింది. ఆర్డీఓ, తహసీల్దార్లు విలేకరుల సమావేశంలో ఈ రీచ్ నుంచి 42 క్యూబిక్ మీటర్ల ఇసుక తోలుకోవచ్చని తెలిపారు. దీంతో నెల నుంచి ఇసుకను వివిధ వర్గాలకు చెందినవారు భారీగా తరలించారు. అనుకున్న దాని కన్నా ఎక్కువ మొత్తంలో తరలిస్తున్నారని కలెక్టర్‌కు రైతులు ఫిర్యాదు చేశారు.
దీంతో కందుకూరు ఆర్డీఓ మల్లికార్జున, డీఎస్పీ శ్రీనివాసరావులు బుధవారం రీచ్ వద్దకు వచ్చారు. మైనింగ్ శాఖ అధికారులు కూడా రీచ్‌కు చేరుకొని ఇంకా రాలేదేమిటని ఆర్డీవో, తహసీల్దార్లకు ఫోన్ చేయడంతో.. తామంతా రీచ్ దగ్గరే ఉన్నామని వారు తెలిపారు. ఎక్కడున్నారని ఆరా తీసి కొల్లూరుపాడు రీచ్ వద్దకు వచ్చిన మైనింగ్ శాఖ ఏడీ రామచంద్రరావు కంగుతిన్నారు. తాము ఇచ్చిన రీచ్ ఇది కాదని, మరోచోటని ఆర్డీఓకు తెలిపారు. అంటే రెవెన్యూ, పోలీస్ అధికారులకు తెలిసిన రీచ్ ఒకటి, మైనింగ్‌శాఖ తెలిపిన రీచ్ మరొకటి. అంటే అధికార యంత్రాగం ఎంత నిద్రపోతోందో ఈ ఘటనతో అర్థమవుతోంది. రీచ్ ఎక్కడో తెలియకుండానే నెల రోజులుగా తవ్వుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల పరిసర ప్రాంత ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.
తేలిగ్గా తీసేసిన అధికారులు...
ఇంత జరిగినా జరిగిందేదో జరిగిపోరుుందంటూ ఆర్డీఓ తేలికగా తీసుకోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. ఇప్పటి వరకు తెలిసే ఇదంతా చేశారా? ఎన్ని లక్షలు చేతులు మారాయంటూ అక్కడున్నవారు వ్యాఖ్యానించడం గమనార్హం. ఆత్మకూరుకు చెందిన హనుమంతరావు అనే రైతు మాట్లాడుతూ అధికారులు ఇక్కడ ఉంటే అక్రమాల గుట్టు తెలుస్తుంది.. హెచ్‌ఆర్‌ఏ తీసుకుంటూ ఎక్కడో ఉంటున్నారు. వారి పై ఎందుకు చర్యలు తీసుకోరు..? దీనిపై నేను క్యాంపు ఆఫీస్‌లో ఫిర్యాదు చేస్తాను’ అని ఆర్డీఓతో వాగ్వివాదానికి దిగితే ‘ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పో’ అంటూ నిర్లక్ష్యంగా అక్కడినుంచి వెళ్లిపోయూరు. ఒక్కట్రాక్టర్ తీసుకెళితే కేసులు నమోదు చేయిస్తున్న ప్రభుత్వం కేటారుుంచని రీచ్ నుంచి 50 వేల క్యూబిక్ మీటర్ల తవ్వకం జరిగి ట్రాక్టర్లతో ఇసు క తరలిస్తే చర్యలు తీసుకోరా..? అని రైతులు నిలదీశారు.
అనుమతులు ఇచ్చిన రీచ్ చినిగేవారిపాలెం వద్ద ఉంది. మరి దానికి రాజుపాలెం-కొల్లూరుపాడు అని ఎందుకు పేరు పెట్టారని మైన్స్ అధికారులు ప్రశ్నించగా.. ఆ సమయంలో ఇది వద్దనుకుని వెళ్లామని ఆర్‌ఐ సుందరరామయ్య సమాధానమిచ్చారు. మైనింగ్ అధికారులు జోక్యం చేసుకుని ఈ ప్రాంతానికి కొల్లూరుపాడు అని ఎందుకు చెప్పారని, దీనికి సంబంధించిన సంతకాలు కూడా తహసీల్దార్ పెట్టారని చూపించారు. దీంతో అధికారుల మధ్య సమన్వయలోపం బయటపడింది.