రంగు.. రుచి.. చిక్కదనం..! ఈ స్లోగన్ ఓ టీ పొడి కంపెనీదని అందరికీ తెలుసు. అంటే టీ పొడిలో ఆ మూడు గుణాలు ఉంటాయని వినియోగదారులకు సదరు కంపెనీ యాజమాన్యం చెబుతుంతోంది. వీరి వ్యాపారానికి పభుత్వ అనుమతి ఉండే ఉంటుంది. కల్తీ నూనె విషయంలో అక్రమార్కులు కొందరు అదే తరహాలో ప్రచారం చే స్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. వీరి వ్యాపారం అక్రమం. ఫలితంగా సామాన్యులు అనారోగ్యం పాలవుతున్నారు.
* జంతు కళేబరాలతో తయారవుతున్న ఆయిల్
* ఆటోల్లో అర్ధరాత్రి తరలింపు
* తక్కువ రేటుకు హోటళ్లకు సరఫరా
* అనారోగ్యం పాలవుతున్న ప్రజలు
ఉలవపాడు : జిల్లాలో కల్తీ నూనె వ్యాపారం ఇష్టారాజ్యంగా సాగుతోంది. అర్ధరాత్రి ఆటోల్లో కొన్ని దుకాణాలకు రహస్యంగా తరలిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కల్తీ నూనె పీపాలను ఉలవపాడు నుంచి సింగరాయకొండ, కందుకూరులోని పలు షాపులకు తక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. జంతు కళేబరాలతో నూనెను తయారు చేసి.. నల్లరంగు వేసి ఉన్న డబ్బాల్లో అచ్చం నూనెను పోలి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బయట ప్రాంతంలో తయారవుతున్న కల్తీ నూనెను రాత్రి వేళల్లో మాత్రమే షాపులకు తరలిస్తున్నారు.
ప్రతి రెండు రోజులకు సుమారు 7 నుంచి 10 పీపాలు ఒక్క ఉలవపాడుకు సరఫరా చేస్తున్నారంటే అక్రమ వ్యాపారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో పీపాలో 220 లీటర్ల నూనె ను నింపుతారు. వ్యాపారులు చిన్న డబ్బాల్లోకి మార్చి ప్రజలకు కుచ్చుటోపీ పెడుతున్నారు. కల్తీ నూనెను పామాయిల్ రేటుకు విక్రయిస్తుండటంతో వినియోగదారులు కూడా ఆ నూనెను వాడేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఎక్కువ వినియోగించే హోటళ్లకు చాలా తక్కువ ధరకే అమ్ముతుండటంతో వ్యాపారులు కూడా పోటీ పడి మరీ కొట్టున్నట్లు సమాచారం.
ఇట్టే.. గుర్తు పట్టొచ్చు
ఇటీవల ఓ పండుగకు ఉలవపాడు హైస్కూల్ సంఘానికి చెందిన రైల్వే ఉద్యోగికి ఓ దుకాణం యజమాని కల్తీ నూనె అమ్మాడు. ఇంటికి తీసుకెళ్లి కూర వండిన తర్వాత దుర్వాసన రావడంతో సదరు ఉద్యోగికి అనుమానం వచ్చింది. నూనె కల్తీ జరిగిందని గ్రహించి దుకాణ యజమానిని నిలదీశాడు. సదరు యజమాని హడావుడిగా డబ్బులు తిరిగి ఇచ్చేశాడు. గుర్తు పట్టలేని ఎందరో ప్రజలు క ల్తీ నూనె భారిన పడి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు.
కొందరు అప్రమత్తమై హోటళ్లకు వెళ్లడం మానేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కల్తీ నూనెలో ఎముకల పొడి, కుళ్లిన కళేబరాల అవశేషాలు ఉండటంతో గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు వాంతులు, విరేచనాలు కూడా అవుతాయని చెబుతున్నారు. వ్యాపారుల దందా అధికారులకు తెలిసే ఉంటుందని ప్రజలు అనుమానిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కల్తీ నూనె విక్రయాలపై కన్నెర్రజేయాలని కోరుతున్నారు.
కల్తీ నూనె అమ్మారు : కర్రెద్దుల బాబూరావు, ఉలవపాడు
ఉలవపాడులో ఓ దుకాణం యజమాని నాకు కల్తీ నూనె అమ్మాడు. ఇంటికి వెళ్లి దాంతో కూర వండితే అంతా చేదుగా మారింది. వెంటనే వెళ్లి ఆ వ్యాపారిని నిలదీశా. గొడవ వద్దు మాట్లాడుకుందాం.. అని బతిమాలాడు. ప్రజలు కల్తీ నూనె విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
ఆ నూనె.. ప్రాణాంతకం!
Published Sat, Nov 1 2014 5:06 AM | Last Updated on Sat, Aug 11 2018 4:36 PM
Advertisement