రోగికి సెలైన్ ఎక్కిస్తున్న కారు డ్రైవర్
సాక్షి, ఉలవపాడు (ప్రకాశం): ఏదైనా వైద్యశాలకు వెళ్లాలంటే అక్కడ ఎలా వైద్యం చేస్తారని కనుక్కుని వెళతాం. ఇలాంటి పరిస్థితుల్లో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న సీహెచ్‌సీలో కారు డ్రైవర్ ఇంజక్షన్లు, సెలైన్లు వేస్తున్న దుస్థితి నెలకొంది. ప్రభుత్వ వైద్యశాల అంటే ఎక్కువగా పేదలే వస్తుంటారు. వారి వైద్యం అంటే ప్రభుత్వానికి ఆటగా మారింది. ఉలవపాడు వైద్యశాలలో కంటి వైద్య నిపుణురాలుకి కారు ఉంది. ఆమె కావలి నుంచి ప్రతిరోజూ కారులో వస్తుంది. ఆమె కారు డ్రైవరే ఇప్పుడు వైద్యశాలలో వైద్యం చేస్తున్నాడు. ఉలవపాడు వైద్యశాలలో ఆరుగురు వైద్యులు ఉన్నారు. గైనకాలజిస్టు, పిల్లల వైద్యనిపుణులు, పంటి వైద్య నిపుణులు, కంటి వైద్య నిపుణులు, జనరల్ వైద్యులతో పాటు వైద్యాధికారిణి కూడా ఉన్నారు. వీరు ఓపీ చూసిన తరువాత ఇంజక్షన్లు లేదా, సెలైన్లు రాస్తారు. ఈ సెలైన్లను కారు డ్రైవర్ పెడతున్న పరిస్థితి నెలకొంది. శిక్షణ పొందిన స్టాఫ్ నర్సులు ఉన్నా డ్రైవర్ పెడుతుండడంతో రోగులు భయాందోళనలు చెందుతున్నారు.
భయాందోళనలో రోగులు..
రోగులు కారు డ్రైవర్ ఇంజక్షన్లు, సెలైన్లు పెడుతుండడంతో భయాందోళనలు చెందుతున్నారు. ప్రభుత్వ వైద్యశాలలో ఎలాంటి శిక్షణ లేని వారు, వైద్యశాలకు సంబంధం లేని వారు వైద్యం ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. వారి డ్రైవర్లు ఇలా చేస్తే ఎలా అని అడుగుతున్నారు. సిబ్బంది సైతం కారు డ్రైవర్లతో బాగుంటూ వారు చెప్పిన విధంగా చేస్తున్నారు. లేకుంటే వైద్యులకు చెప్పితమను ఇబ్బంది పెడతారేమో అని భయం సిబ్బందిలో ఉంది. దీంతో వారు వైద్యం చేస్తున్నా ప్రశ్నించడం లేదు. ఈ విషయంపై వైద్యాధికారిణి శోభారాణిని వివరణ కోరగాఈ విషయం నా దృష్టికి రాలేదు. ఒక్కరే నర్సు ఉన్న సమయంలో ఆమెకు సాయం చేస్తున్నారు. ఆపేయమంటు ఆపేస్తామని తెలిపారు.
ఇలా అయితే ఎలా...
ప్రస్తుతం ఉలవపాడు వైద్యశాలను ఎంఎల్‌సీసీ (మెడికో లీగల్ సెంటర్)గా మార్చారు. వివాదాలు, కొట్లాట కేసులు వస్తుంటాయి. వారికి వైద్యం చేసి వెంటనే పోలీసులకు రిపోర్టు అందజేయాలి. దీని పైనే కేసులు ఆధారపడి ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యం చేసిన సమయంలో ఏ ఇబ్బందులు జరిగినా దానికి బాధ్యత ఎవరు వహించాలి. లీగల్ కేసులు వస్తున్న పరిస్థితుల్లో శిక్షణ పొందిన వారు వైద్యం చేయాలని కోరుతున్నారు. బయట వ్యక్తులు కేసులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది. ఇలాంటి చర్యలు పునరావృతంకాకుండా చూడాలని రోగులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment