బ్లాస్టింగ్ వైరు పేలడంతో గాయపడిన చిన్నారి
ప్రమాదం జరిగితే తప్ప కళ్లు తెరవని అధికారులు.. ప్రాణాలు పోతే తప్ప మేల్కొనని ప్రభుత్వం.. కర్నూలులో క్వారీ పేలుడు ఘటన నేపథ్యంలోనూ ఇక్కడి అధికారుల్లో చలనం లేకపోయింది. ఈ నిర్లక్ష్యమే ఓ చిన్నారికి శాపంగా మారింది. రాయదుర్గం ప్రాంతంలో అనుమతి లేని క్వారీల నిర్వాహకులు పడేసిన కేప్ వైరుతో ఆడుకుంటుండగా పేలిన ఘటనలో నేమకల్లు గ్రామానికి చెందిన విలాజ్(7) తీవ్రంగా గాయపడ్డాడు.
బొమ్మనహాళ్: క్వారీలో ఉపయోగించే బ్లాస్టింగ్ వైరు(కేప్) పేలడంతో మండలంలోని నేమకల్లు గ్రామానికి చెందిన రైతు ఫిరోజ్ కుమారుడు విలాజ్ (7)కు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే.. కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న క్వారీ ప్రమాదం నేపథ్యంలో అధికారులు జిల్లాలో తనిఖీలు చేపట్టారు. విషయం ముందుగానే తెలుసుకున్న క్వారీల నిర్వాహకులు తమ వద్ద నిల్వ చేసుకున్న బ్లాస్టింగ్ సామగ్రిని ఎక్కడిపడితే అక్కడ పడేశారు.
ఈ నేపథ్యంలో స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న విలాజ్ సోమవారం సాయంత్రం పాఠశాల వదిలిన తర్వాత ఇంటికి వెళ్తూ దారిలో దొరికిన బ్లాస్టింగ్ వైరును తీసుకెళ్లాడు. రాత్రి 7 గంటల సమయంలో ఆడుకుంటూ వైరుపై రాయితో బలంగా కొట్టడంతో ఒక్కసారిగా పేలింది. దీంతో విలాజ్ చేయి, ఇతర శరీర భాగాలతోపాటు మర్మాంగానికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెంటనే బళ్లారిలోని విమ్స్ ఆస్పత్రికి తరలించారు. రాయదుర్గం ప్రాంతంలో అనుమతి లేకుండా లెక్కకు మించి క్వారీలు నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా సెంట్రల్ ట్రిబ్యునల్ టీమ్ కూడా క్వారీలను, కంకర మిషన్లను పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో అనుమతులు లేకుండా క్వారీలు నిర్వహించేవాళ్లు ఎక్కడ పడితే అక్కడ బ్లాస్టింగ్ వైరును పడేసినట్టు సమాచారం. క్వారీల సమీపంలోని పొలాల్లోనూ బ్లాస్టింగ్ వైర్లు పడేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment