నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యం
దేవరపల్లి : క్వారీ లారీ ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులను బలిగొంది. నల్లజర్ల మండలం అనంతపల్లి ఎర్రకాలువ వంతెన వద్ద శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.నల్ల్లజర్లకు చెందిన ఉప్పాటి సురేష్ (38), భార్య లక్ష్మీదుర్గ (34), కుమారుడు ఉప్పాటి ప్రేమసాగర్ (2), సురేష్ మేనకోడలు లిఖిత మోటార్ బైక్‌పై రాజమండ్రి వెళుతుండగా అనంతపల్లి వద్ద ఎర్రకాలువ సమీపంలో ఎదురుగా వస్తున్న క్వారీలారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్ష్మీదుర్గ, ప్రేమసాగర్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందగా కొనఊపిరితో ఉన్న సురేష్, తీవ్రంగా గాయపడిన లిఖితను చికిత్స కోసం 108 వాహనంలో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సురేష్ మృతి చెందాడు. లిఖిత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటోంది.
నల్లజర్లకు చెందిన సురేష్ కుటుంబం ఎలక్ట్రికల్ పనుల నిమిత్తం రాజమండ్రిలో నివాసం ఉంటున్నారు. అప్పుడప్పుడు నల్లజర్ల వచ్చి కుటుంబ సభ్యులను కలిసి వెళుతుంటారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నల్లజర్ల వచ్చి వెళుతుండగా క్వారీలారీ రూపంలో మృత్యువు కబళించింది. ప్రమాదం గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదంలో లక్ష్మీదుర్గ, ప్రేమసాగర్ మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా నుజ్జయ్యాయి. నల్లజర్ల ఎస్సై వి.చంద్రశేఖర్ ప్రమాదస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment