Hyderabad: Terrible Road Accident In Kamareddy - Sakshi
Sakshi News home page

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Published Sat, Dec 18 2021 2:32 PM | Last Updated on Sun, Dec 19 2021 1:30 AM

Road Accident In Kamareddy District - Sakshi

నిజాంసాగర్‌ (జుక్కల్‌): వారు దర్గా వద్ద మొక్కులు తీర్చుకొని క్వాలిస్‌ వాహనంలో ఇంటికి తిరుగుముఖం పట్టారు. మార్గమధ్యంలో ఆ వాహనం అతివేగంగా వెళ్లి ఆగిఉన్న లారీని ఢీకొట్టడంతో ఏడు గురు మృత్యువాతపడ్డారు. వీరిలో రెండు కుటుంబాలకు చెందిన భార్యాభర్తలు, ముగ్గురు పిల్లలున్నారు. మరో ఐదుగురు పిల్లలు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.

కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్‌గల్‌ మండలం జగన్నాథపల్లిలో సంగారెడ్డి– నాం దేడ్‌ 161 జాతీయ రహదారిపై శనివారం మధ్యా హ్నం ఈ ఘోర ప్రమాదం జరిగింది. స్నేహితులైన హైదరాబాద్‌లోని మూసానగర్, వినాయక వీధి ప్రాంతాలకు చెందిన మహమ్మద్‌ అమీర్‌తాజ్, మహమ్మద్‌ హుస్సేన్‌ తమ కుటుంబాల్లోని మొత్తం 12 మందితో కలసి రెండురోజుల క్రితం క్వాలిస్‌ వాహనంలో మహారాష్ట్ర నాందేడ్‌ జిల్లాలోని ఖందార్‌ దర్గాలో కందురు చేసేందుకు వెళ్లారు. 

మొక్కులు తీర్చుకొని వస్తుండగా... 
ఖందార్‌ దర్గా వద్ద మొక్కులు తీర్చుకుని అమీర్, హుస్సేన్‌ కుటుంబాలు తిరుగుప్రయాణంలో 110 కిలోమీటర్ల దూరం వచ్చారు. అదే సమయంలో హైదరాబాద్‌ వైపు వెళ్తున్న లారీని డ్రైవర్‌ జగన్నాథపల్లి దాబా వద్ద రోడ్డు పక్కన నిలిపాడు. డ్రైవర్‌ దాబాలోకి వెళ్లేలోపు క్వాలిస్‌ అతివేగంగా వచ్చి లారీని బలంగా ఢీకొట్టింది.

దీంతో క్వాలిస్‌ ముం దుభాగం లారీ కిందికి చొచ్చుకెళ్లింది. ఈ ప్రమాదం లో అమీర్‌ (29), అతని భార్య పర్వీన్‌ సనా (20) వారి ఇద్దరు పిల్లలు అలియా పాతిమా (18 నెలలు), హన్నన్‌ ఫాతిమా, అలాగే, హుస్సేన్‌ (33), తస్లీమ్‌ బేగం(26) దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు.

హుస్సేన్‌ కూతురు నూర్‌ బేగం (8) నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ మరణించింది. మరో ఐదుగురు పిల్లలు అజార్‌ బేగం, సుల్తానా, హరి, హిబా, యాస్మిన్‌ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులైనవారిలో నలుగురు హుస్సేన్‌ పిల్లలు కాగా, మరొకరుసనా పర్వీన్‌ అక్క కూతురైన యాస్మా బేగం ఉన్నారు.

ప్రమాద సమాచారం అందుకున్న బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డి, బిచ్కుంద సీఐ శోభన్‌ ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన చిన్నారులను 108 అంబులెన్స్‌లో బాన్సువాడ ఆస్పత్రికి, అక్కడి నుంచి నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  

అనాథలైన హుస్సేన్‌ పిల్లలు 
ప్రమాదంలో మృతి చెందిన హుస్సేన్‌(33), తస్లీం బేగం(26) దంపతులకు ఐదుగురు సంతానం. నలుగురు కూతుళ్లు హాజరాబేగం, నూర్‌బేగం, సుల్తానా బేగం, హిబా, కుమారుడు అలీ ఉన్నారు.  హుస్సేన్‌ దంపతులతోపాటు కూతురు నూర్‌ బేగం మృతి చెందారు. మిగిలిన నలుగురు పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు. 

బహుత్‌ అచ్చా రహ్తె థే: షేక్‌ జహంగీర్, సనా బంధువు, నిజామాబాద్‌ 
మా అన్న కూతురైన సనా, అమీర్‌లు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వారికి ఇద్దరు అమ్మాయిలే ఉన్నారు. ఎంతో ప్రేమతో ఉండే వీరిని రెప్పపాటులో మృత్యువు కబళించింది. ఇద్దరు పిల్లలూ చనిపోయారు. చాలా బాధగా ఉంది. 

చదవండి: పెళ్లయిన 42 రోజులకే.. నవ వధువు హత్య!.. మూఢనమ్మకాలతో భర్తే అలా చేశాడా?

చిన్ననాటి స్నేహితులు... 
మృతులు మహమ్మద్‌ హుస్సేన్, మహమ్మద్‌ అమీర్‌ చిన్ననాటి స్నేహితులు. హుస్సేన్‌ వాటర్‌ప్లాంట్‌ నిర్వహిస్తుండగా అమీర్‌ ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. వీరు ప్రతిఏటా దర్గాకు వెళ్లి వస్తుంటారు. వీరి స్నేహబంధం మృత్యువులోనూ వీడలేదు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement