ఏలూరుకు చెందిన ముగ్గురి మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు
కావలిలో ఘటన
కావలి: ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో రోడ్డు మార్జిన్‌లో ఆగి ఉన్న కంటైనర్ లారీని ఓ కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృత్యువాత పడగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయిన ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలంలో చోటుచేసుకుంది. కావలి రూరల్ సీఐ కె.శ్రీనివాసరావు కథనం మేరకు.. ఏలూరు వైఎస్సార్ నగర్‌కు చెందిన కుమార్ (45), జ్యోతి (38), సిరి అలియాస్ రాజీ (38) వన్‌గ్రామ్ గోల్డ్, ఇమిటేషన్ జ్యూవెలరీ వ్యాపారం చేస్తుంటారు.
వస్తువుల కోసం చెన్నైకి కారులో వెళ్లారు. తిరిగి ఏలూరుకు బయలుదేరిన క్రమంలో బుధవారం తెల్లవారుజామున ముసునూరు టోల్‌ప్లాజా సమీపంలో ముందు వెళ్తున్న లారీని కారు ఓవర్‌టేక్ చేసే క్రమంలో రోడ్డు మార్జిన్‌లో ఆగి ఉన్న కంటైనర్ లారీని వేగంగా ఢీకొంది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న కుమార్, జ్యోతి, సిరి అక్కడికక్కడే మృతిచెందగా.. డ్రైవర్ జిలానీ, కుమారి అనే మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు గుర్తించి 108 అంబులెన్స్‌లో వారిని చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. కుమారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కాగా కారులో నుంచి మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచి్చంది. మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment