మెదక్: కారు పల్టీ కొట్టిన ఘటనలో 9 నెలల బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు మహిళలకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన అందోల్ మండల పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆదివారం నాందేడ్‌లో జరిగే ఫంక్షన్‌కు కారులో వెళ్తున్నారు.
నాందేడ్, అకోలా జాతీయ రహదారిపై వెళ్తుండగా అందోల్ మండల పరిధి డాకూరు–ఎర్రారం గ్రామ శివారులోకి రాగానే వారి కారు టైరు పగిలిపోయింది. దీంతో కారు అదుపుతప్పి పల్టీకొట్టడంతో అందులో ఉన్న 9 నెలల బాలుడు విరాట్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు మహిళలకు గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్‌లో ఇద్దరు క్షతగాత్రులను సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులను సంప్రదించగా తమకు ఎటువంటి సమాచారం లేదని తెలిపారు.
బిడ్డ మృతదేహంతో తల్లి రోదన
ప్రమాదం జరిగిన వెంటనే తనకు తగిలిన గాయాలను లెక్క చేయకుండా కుమారుడి కోసం అటు ఇటు వెతికిన తల్లి చివరకు జీవచ్చవంలా పడి ఉన్న కొడుకును చూసి రోదించడం అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టించింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎంపీ బీబీపాటిల్ తన కారును నిలిపి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సహాయక చర్యలకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment