లారీ వెనక దూసుకుపోయిన కారు
గన్నవరం : మిత్రుడి గృహ ప్రవేశ కార్యక్రమానికి వెళ్తున్న స్నేహితులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి కారులో వెళ్తున్న వీరు గన్నవరం వద్ద జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న ఇసుక లోడు లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారులో ముందు సీట్లలో ఉన్న ఇరువురు యువకులు మృతి చెందగా, మరో యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం... హైదరాబాద్‌లోని తార్నాకకు చెందిన అన్నెపొగ పవన్‌కుమార్ (25), అల్వాల్‌కు చెందిన బిజ్జా వినయ్‌కుమార్ (26), రాజేంద్రనగర్‌కు చెందిన పొలి శెట్టి సాయికిరణ్ (24) ఒకే కళాశాలలో ఎంబీఏ చదువుకున్నారు.
ప్రస్తుతం వేర్వేరు ప్రైవేట్ కంపె నీల్లో ఉద్యోగాలు చేస్తున్నప్పటికి స్నేహితులుగా కలిసిమెలసి ఉంటారు. ఈ నెల 2న రాజమండ్రిలో జరగనున్న వారి మిత్రుడైన బెన్నీ గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యేందుకు శనివారం రాత్రి 11.30 గంటలకు మారుతి కారులో బయలుదేరారు. తెల్లవారుజామున 6.20 గంటల సమయంలో స్థానిక సీపీఎం ఆఫీస్ సమీపంలో జాతీయ రహదారిపై పార్క్ చేసి ఉన్న ఇసుక లోడు లారీని వెనుక నుంచి వీరి కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా లారీ కిందకు దూసుకుపోయి నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు, 108 సిబ్బంది అక్కడికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన వారిని అతి కష్టం మీద బయటకు తీసి చిన్న ఆవుటపల్లిలోని పిన్నమనేని ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో పవన్‌కుమార్, వినయ్‌కుమార్ కొద్దిసేపటికి మృతి చెందారు. వెనుక సీట్లో కూర్చొన్న సాయికిరణ్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సీఐ కె. శ్రీధర్‌కుమార్ నేతృత్వంలో కేసు నమోదు చేసి మృతదేహాలకు పోస్టుమార్టం జరిపి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణంలో విషాధచాయలు అలుముకున్నాయి.
నిర్లక్ష్యమే కారణమా..
ప్రమాదానికి నిర్లక్ష్యపు డ్రైవింగే కారణంగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో కారు అతి వేగంగా ఉండడంతో పాటు డ్రైవ్ చేస్తున్న పవన్‌కుమార్ నిద్ర మత్తులో ఉండడం కారణంగా రోడ్డు పక్కన ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. కనీసం బ్రేకు కూడా నొక్కకపోవడం కారణంగా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండి ముందు సీటుల్లో కూర్చున్న పవన్, వినయ్‌కుమార్ తల భాగంలో బలమైన గాయాలై మృతి చెందినట్లు పేర్కొంటున్నారు. రాజమండ్రికి రైలులో వెళ్ళేందుకు ప్రయత్నించినా టిక్కెట్లు దొరక్క పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కారులో బయలుదేరినట్లు క్షతగాత్రుడు సాయికిరణ్ తెలిపారు. ఊహించని ఈ ప్రమాదంలో స్నేహితులను కోల్పోటంతో సాయికిరణ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment