హుకుంపేట మండలం గూడ గ్రామంలో కిడారి అనుచరులు నిర్వహిస్తున్న క్వారీ
విశాఖ సిటీ: అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు దారుణ హత్యకు కారణమైన గూడ నల్లరాయి క్వారీ నిర్వహణ వెనుక టీడీపీ పెద్దల హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్వారీ కిడారి సమీప బంధువుకు కేటాయించుకొని తవ్వకాలు జరపడాన్ని కొన్నాళ్లుగా స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై మావోలు పలుమార్లు హెచ్చరించినా.. ఇంతటి వ్యతిరేకతలోనూ కిడారి ఈ క్వారీ నడపడం వెనుక టీడీపీ నేతల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు సమాచారం. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యకు ముందు మావోయిస్టులు జరిపిన చర్చల్లో ప్రధానమైన అంశం క్వారీ. గిరి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా.. క్వారీ ఎందుకు కొనసాగిస్తున్నావంటూ మావోలు గద్దించి మరీ కిడారిని నిలదీశారు. పలుమార్లు హెచ్చరించినా.. క్వారీ కొనసాగించడాన్ని జీర్ణించుకోలేకపోయిన మావోలు.. సర్వేశ్వరరావుని ఇదే కారణంతో దారుణంగా హత్య చేశారు. అయితే.. నియోజకవర్గంలో ఇంతగా వ్యతిరేకత వస్తున్నా.. మావోయిస్టుల నుంచి హెచ్చరికలు జారీ అవుతున్నా.. ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదముందని తెలిసినా.. క్వారీని ఆపేందుకు కిడారి ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయారు.? ఎవరి ప్రోద్బలంతో గూడ క్వారీని కొనసాగించి.. ఇప్పుడు విగత జీవులయ్యారు.?
ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కిడారి సర్వేశ్వరరావు క్వారీ జోలికి పోలేదు. ప్రజలతో మమేకమవుతూ.. మైనింగ్ జోలికి వెళ్లలేదు. అయితే.. అధికార పార్టీలోకి వెళ్లిన తర్వాత రెండున్నరేళ్ల నుంచి క్వారీ నడపడం ప్రారంభించారు. హుకుంపేట మండలం జోగులపుట్టు, గూడ గ్రామాల సరిహద్దులోని నల్లరాయి (బ్లాక్‌స్టోన్స్) క్వారీలో మైనింగ్ వ్యవహారాలు జరిపేవారు. దీనిపై పూర్తి వ్యతిరేకత వచ్చింది. ప్రజలు ఉద్యమాలు చేయడం ప్రారంభించారు. అయినా.. కిడారి చలించలేదు. మావోయిస్టులు పలుమార్లు గూడ క్వారీలో తవ్వకాలు నిలిపెయ్యాలనీ, ప్రజా ఉద్యమాలకు విలువ ఇవ్వాలంటూ హెచ్చరించారు. అయినా.. కిడారి వినకపోవడానికి కారణం టీడీపీని తమ సొంతమనుకొనే బెజవాడకు చెందిన కొందరు పార్టీ నేతలే కారణమని తెలుస్తోంది. నియోజకవర్గంలో ఈక్వారీ వల్ల చెడ్డ పేరు వస్తోందని పలుమార్లు వారితో కిడారి చెప్పినా.. సదరు బెజవాడ నేతలు చెవికెక్కించుకోలేదు.
టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన కిడారి.. తప్పనిసరి పరిస్థితిలో గూడ క్వారీని కొనసాగించారు. మావోలు హెచ్చరించినా.. టీడీపీ పెద్దల మాట కాదనలేక యథేచ్ఛగా క్వారీ తవ్వకాలు చేపడుతూనే ఉన్నారు. దీంతో.. తాము చెప్పినా వినిపించుకోలేదనీ, ప్రజలు ప్రత్యక్ష ఉద్యమాలు చేపడుతున్నా.. చెవికెక్కించుకోలేదనే కారణాలు... ఇవన్నీ కలిసి.. కిడారిని మావోల తూటాలకు బలిచేశాయి. తెరవెనుక ఉండి టీడీపీ నాయకులు గూడ క్వారీ నుంచి లబ్ధి పొందితే.. శిక్ష మాత్రం కిడారి సర్వేశ్వరరావే పొందాల్సిన పరిస్థితి ఎదురైంది. నాన్న.. క్వారీని ఆపేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కానీ.. విజయవాడకు చెందిన టీడీపీ నేతలు కొందరు కొనసాగించాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అందువల్లనే క్వారీ నడిపించారు. దానివల్లే.. ఇవాళ నాన్న మా మధ్య లేకుండా పోయారంటూ సన్నిహితుల వద్ద కిడారి సర్వేశ్వరరావు కుమారుడు కన్నీటిపర్యంతమయ్యారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment