పాడేరు, న్యూస్‌లైన్: మండలంలోని మినుములూరు క్వారీలో రంగురాళ్ల తవ్వకాలు జోరందుకున్నాయి. మైదాన ప్రాంతాలకు చెందిన వ్యాపారులు నాలుగు రోజుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు చే యిస్తున్నారు. ఈ క్వారీలో తవ్వి తీసిన మట్టిని వ్యాన్లపై మైదాన ప్రాంతాలకు తరలించుకుపోతున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో సుమారు రూ.40 లక్షల వ్యాపారం జరిగినట్టు ప్రచారం సాగుతోంది. రెవెన్యూ, పోలీస్ అధికారులు ఐదు నెలల క్రితం ఈ రంగురాళ్ల క్వారీని మూసివేసి తవ్వకాలపై నిషేధం విధించినప్పటికీ వ్యాపారులు స్థానికులను ప్రోత్సహిస్తూ తవ్వకాలను సాగిస్తున్నారు. విలువైన క్యాట్స్ ఐ రకం రంగురాళ్లు లభ్యమవుతుండడంతో పట్టా భూమిలో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు.
గ్రామస్తులంతా నిద్రపోయిన సమయంలో రంగురాళ్ల తవ్వకాలు జరుపుతున్నారు. క్వారీలో తవ్వకాలు జరుగుతున్న సంగతి తెలుసుకున్న స్థానిక సర్పంచ్ భర్త, కాంగ్రెస్ నాయకుడు మినుముల కన్నాపాత్రుడు మంగళవారం పాడేరు పోలీస్‌లకు సమాచారం అందించారు. రంగురాళ్ల తవ్వకాలకు ఏర్పాటు చేసిన సొరంగాన్ని గ్రామస్తుల సహకారంతో పూడ్చివేయించారు. ఆ క్వారీలో రంగురాళ్ల తవ్వకాలను పూర్తిగా నిలిపివేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు.
జోరుగా రంగురాళ్ల తవ్వకాలు
Published Wed, Dec 11 2013 2:39 AM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM
Advertisement
Advertisement