
నల్ల చెరువులో ఆక్రమణలు
కొత్త చామలాపల్లి (శృంగవరపుకోట రూరల్), న్యూస్‌లైన్:చామలాపల్లి పంచాయతీ పరిధిలో కొత్త చామలాపల్లి గ్రామ ఆయకట్టు భూములకు నీరందిస్తున్న నల్ల చెరువును క్వారీ యజమానులు మట్టితో కప్పేస్తున్నారు. క్వారీ లారీల రాకపోకలకు వీలుగా రహదారి పనులు చేపట్టడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లచెరువు కొమ్ము వద్ద గల మదుముకి నీరు వెళ్లే ఆస్కారం లేకుండా క్వారీ సిబ్బంది శుక్రవారం అర్థరాత్రి జేసీబీతో రోడ్డు పనులు చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. జేసీబీని రైతులు తమ అధీనంలోకి తీసుకుని కొత్త చామలాపల్లి గ్రామంలో ఉంచారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి,
ఇరిగేషన్ అధికారుల దృష్టికి రైతులు తీసుకెళ్లారు. రైతులు తెలియజేసిన సమాచారం మేరకు విలేకరులు శనివారం ఉదయం నల్లచెరువు వద్ద జరిగిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, నల్ల చెరువుకు ఆవల ఒడ్డున రెండు క్వారీలున్నాయని తెలిపారు. ఆ క్వారీలకు సంబంధించిన లారీలు చుక్కవానిపాలెం గ్రామం మీదుగా రాకపోకలు సాగించాల్సి ఉందని చెప్పా రు. అయితే క్వారీ యజమానులు మాత్రం క్వారీ రాతిమట్టితో నల్ల చెరువును కప్పేసి రహదారి నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. చెరువు కబ్జాకు గురవ్వడం వల్ల తమ పొలాలకు సాగునీరు అందదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలుమార్లు పనులు అడుడ్డుకున్నా, రహదారికడ్డంగా చెట్లు, రాళ్లు పడేసినా జేసీబీలతో వాటిని తొలగించి మరీ పనులు చేపడుతున్నారని రైతులు తొత్తడి ప్రకాశరావు,
టి.స్వామినాధం, టి.సన్యాసిరావు, తొత్తడి ఎర్నిబాబు, టి.స్వామినాయుడు, గుమ్మడి ఆనందరావు, టి.ముత్యాలనాయుడు, టి.సింహాద్రిదేముడు, టి.పైడితల్లి, టి.చినఅప్పారావు, గుమ్మడి అప్పలనాయుడు, జుత్తాడ బుచ్చి అప్పారావు, తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు. చెరువు గట్టుపై నుంచి భారీ లారీలు తిరుగుతున్నందు వల్ల ఇప్పటికే రెండు మదుములు పాడయ్యాయని చెప్పారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి క్వారీ యజమానులు నిర్మించిన రహదారిని ధ్వంసం చేసి పొలాలకు నీరందేలా చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని రైతులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇరిగేషన్ డీఈఈ అప్పలనాయుడు వద్ద ప్రస్తావించగా చెరువులో రహదారి నిర్మించి వాహన రాకపోకలు సాగించడం చట్ట విరుద్ధమన్నారు. రైతుల ఫిర్యాదు మేరకు క్వారీ యజమానులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.