భోగాపురం: భోగాపురం మండలం రామచంద్రపేటకు చెందిన దుక్క అప్పన్న ఆటోనడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య గోవిందమ్మ కూలి పనులు చేస్తూ చేదోడువాదోడుగా ఉంటోంది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. వారిలో రెండో కుమారుడు దుక్క రమేష్ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. అప్పన్న రోజూలాగానే ఆటోనడిపేందుకు ఉదయమే వెళ్లిపోయాడు. గోవిందమ్మ ఇంటివద్దే ఉంది. పాఠశాలకు ఆదివారం సెలవు కావడంతో రమేష్(8) తోటి పిల్లలతో కలిసి దగ్గరలో ఉన్న క్వారీ దగ్గరకు వెళ్లి ఆడుకుంటున్నాడు. మధ్యాహ్నం సుమారు 12గంటల సమయంలో తోటి పిల్లలతో కలిసి ఆ గొయ్యలో స్నానం చేసేందుకు దిగాడు. అయితే రమేష్ దిగిన చోట గొయ్యి బాగా లోతుగా ఉండడంతో వెంటనే మునిగిపోయాడు.
దీంతో తోటి పిల్లలు వెంటనే గ్రామంలోకి పరుగుపెట్టి పెద్దలకు విషయం తెలియజేశారు. వెంటనే గ్రామస్తులు హుటాహుటిన సంఘటనా స్థలంవద్దకు చేరుకుని, బాలుడి తండ్రికి సమాచారం అందించారు. ఇంతలో ఈతగాళ్లు గొయ్యిలో దిగి గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు గంట పాటు వెతకగా బాలుని మృతదేహం లభ్యమయ్యింది. అంతే బాలుని తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. విషయం తెలిసి గ్రామం మొత్తం క్వారీ వద్దకు చేరుకుంది. క్వారీలో బాలుని మృతదేహం వద్ద తల్లితండ్రులు పడి రోదిస్తున్న తీరు చూపరుల హృదయాన్ని కలిచివేసింది. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై దీనబంధు, లోవరాజులు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
మిరాకిల్ కంపెనీ ఎదుట ఆందోళన
ఇదేవిధంగా గ్రామానికి చెందిన పలువురు గతంలో అదే గోతిలో పడి చనిపోతున్నా మిరాకిల్ సాఫ్ట్‌వేర్ యాజమాన్యం పట్టించుకోవడంలేదని రామచంద్రపేట గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరిగినా వారెవ్వరూ సంఘటనా స్థలం వద్దకు రాకపోవడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో బాలుడి మృతదేహాన్ని తీసుకుని మిరాకిల్ కంపెనీ కాల్‌సెంటర్ భవనం గేటు వద్ద ధర్నా నిర్వహించారు. రామచంద్రపేటతో పాటు చుట్టు పక్కల గ్రామాలైన పిట్టపేట, ముంజేరునుంచి సుమారు 800మంది కంపెనీని ముట్టడించారు. దీంతో సీఐ వైకుంఠరావు సిబ్బందితో సహా సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు, మహిళా కానిస్టేబుళ్లు కంపెనీ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కంపెనీ యాజమాన్యానికి పోలీసులు కొమ్ము కాస్తున్నారంటూ ఆగ్రహం వెలిబుచ్చారు.
దీంతో సీఐ గ్రామపెద్దలతో చర్చించారు. తగాదాల ద్వారా సమస్య పరిష్కారం కాదని అందరూ శాంతించాలని కోరారు. కంపెనీ యాజమాన్యంతో మాట్లాడతానని అందరూ సహకరించాలన్నారు. అయితే ఇంత జరుగుతున్నా కంపెనీ యాజమాన్యం స్పందించకపోవడంతో సీఐ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ చేసినప్పటికీ కంపెనీ యాజమాన్యం స్పందించలేదు. దూరంగా ఉన్నామంటూ ఫోనులో చెప్పి దిగువ స్థాయి తప్పించుకున్నారు. బాలుని తండ్రి ఫిర్యాదు మేరకు మిరాకిల్ యాజమాన్యంపై 304(ఏ) కేసు నమోదు చేయనున్నట్లు సీఐ తెలిపారు. ముందు బాలుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించడానికి సహకరించాలని సోమవారం ఉదయం యాజమాన్యాన్ని పిలిపించి చర్యలు చేపడతామని బాధితులకు సీఐ హామీ ఇచ్చారు.
అయినా వారు శాంతించలేదు. రాత్రి 7.30 గంటల సమయంలో ఎంపీపీ కర్రోతు బంగార్రాజు సంఘటనా స్థలం వద్దకు చేరుకుని పోలీసులతో చర్చించారు. అలాగే యాజమాన్య ప్రతినిధులతో ఫోను ద్వారా మాట్లాడారు. ఆయనకు కూడా కంపెనీ యాజమాన్యం సరిగా స్పందించలేదు. దీంతో యాజమాన్యంపై గట్టి చర్యలు చేపట్టాలని పోలీసులను ఎంపీపీ కోరారు. పూసపాటిరేగ జెడ్‌పీటీసీ ఆకిరి ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. రాత్రి 9గంటల వర కూ ఆందోళన కొనసాగుతూనే ఉంది.
బాలుడిని మింగిన క్వారీ
Published Mon, Mar 2 2015 12:44 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
Advertisement
Advertisement