
క్వారీ ప్రమాదంలో కూలీ మృతి
అనకాపల్లి: క్వారీ భూతం ఒకరిని బలిగొంది. మరొకరికి ప్రాణాలపైకి తెచ్చింది. అనకాపల్లి మండలంలో విచ్చలవిడిగా సాగుతున్న క్వారీ పరిశ్రమలో నిబంధనలకు తిలోదకాలివ్వడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు సంభవించడం, ప్రాణాలు హరీమనడం షరా మామూలైంది. శుక్రవారం మండలంలోని వెంకుపాలెం గ్రామం వద్ద జరిగిన క్వారీ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి. రూరల్ ఎస్‌ఐ కోటేశ్వరరావు అందించిన వివరాలిలా ఉన్నాయి.
ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా నందుకూర్ మండలానికి చెందిన సోమరాయి పట్నాయక్ (38) వెంకుపాలెంలో నివాసముంటున్నాడు. కార్వీలో కార్మికుడిగా రెండేళ్లుగా పనిచేస్తున్నాడు. ఉదయం విధులలో ఉండగా క్వారీ పైనుంచి భారీ రాళ్లు పడడంతో పట్నాయక్ మృతిచెందాడు. మృతదేహాన్ని ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. పట్నాయక్ మృతితో వెంకుపాలెంలోని అతని ఇంటి వద్ద విషాధ ఛాయలు అలుముకున్నాయి.
ఈ ప్రమాదంలో సత్తిబాబు అనే వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. అతనిని కేజీహెచ్ నుంచి ఇండస్ ఆస్పత్రికి తరలించగా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. సత్తిబాబు బవులవాడలోని త్రిమూర్తుల గుడి వద్ద నివాసముంటున్నాడు. వెంకుపాలెంకు చెందిన యజమాని క్వారీలో ఈ ప్రమాదం సంభవించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
తరచూ ప్రమాదాలు
అనకాపల్లి మండలంలో క్వారీ ప్రమాదాలతో ప్రాణనష్టం కొనసాగుతూనే ఉంది. గతంలో అక్కిరెడ్డిపాలెం వద్ద బండరాయి దొర్లి పడడంతో ఒక వ్యక్తి మృతి చెందగా నష్టపరిహారం అందించే విషయంలో క్వారీ నిర్వాహకులు మొండికేశారు. మార్టూరు పరిధిలోని క్వారీలో కూడా ప్రమాదాలు సంభవించాయి. మాన్యువల్ పద్ధతికి స్వస్తి పలుకుతూ కొన్నిచోట్ల బ్లాస్టింగ్‌లు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి మండలంలోని పలు ప్రాంతాలలో కొండ శివార్లు ప్రమాదకర కేంద్రాలుగా మారాయి.
బండరాళ్లు కిందికి దొర్లడం అక్కడక్కడ కనిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే క్వారీ క్రషరు అసోసియేషన్లు పుట్టుకొచ్చినప్పటికీ మృతులకు తగిన న్యాయం చేయడంలో యాజమాన్యాలతో పోరాడలేకపోతున్నాయి. అనైక్యతతో అసోసియేషన్లు తమ ఉనికిని చాటుకోలేకపోతున్నాయి. అనకాపల్లి మండలంలోని జరుగుతున్న క్వారీ ధ్వంసకాండను నిరోధించడంలో వివిధ విభాగాలకు చెందిన అధికార యంత్రాంగం విఫలమవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ, భూగర్భ గనుల శాఖ, కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వల్ల అనేక ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.