ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన అనసూయ.(ఫైల్‌ఫోటో)
– వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న బాధితులు
– అన్నివిధాలా ప్రయత్నించామంటున్న వైద్యులు
పలమనేరు:
డెలివరీ కోసం ఆస్పత్రికొచ్చిన ఓ మహిళ ప్రసవం జరిగాక మృతి చెందింది. నవశిశువు పరిస్థితి విషమంగా మారడంతో తిరుపతి స్విమ్స్‌కు తీసుకెళ్లగా బిడ్డ అక్కడ చనిపోయాడు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గంగవరం మండలం ఏడూరుకు చెందిన తిమ్మారెడ్డి కుమార్తె అనసూయ(22)కు అదే మండలం సామరాజుపల్లెకు చెందిన సుబ్బారెడ్డితో ఏడాదిక్రితం వివాహమైంది. అనసూయ గర్భం దాల్సి కాన్పుకోసం పుట్టింటికి వెళ్లింది. ఆదివారం రాత్రి ప్రసవనొప్పులు రావడంతో పలమనేరు ఆస్పత్రికి తరలించారు. ఆదివారం రాత్రి 9.57 గంటలకు ఆమెకు సుఖప్రసవం జరిగింది. విపరీతంగా రక్తస్రావం కావడంతో ఆమె భర్త డ్యూటీ డాక్టర్ విశ్వనాథ్‌కు సమాచారం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సూపరిండెంట్ వీణాకుమారి, పలువురు డాక్టర్లు అక్కడికి చేరుకుని ఆమెకు రక్తం ఎక్కించేందుకు ఏర్పాట్లు చేసేలోపు అనసూయ మృతిచెందింది. వైద్యులు సరైన సేవలు అందించకపోవడం వల్లే తన భార్య చనిపోయిందనీ.. చనిపోయిన తర్వాత తన భార్య శవానికే వైద్యం చేసినట్టు డాక్టర్లు డ్రామా ఆడారని ఆరోపించారు. ఇలా ఉండగా శిశువు పరిస్థితి కూడా విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో వారు వెంటనే బిడ్డను కుప్పం పీఈఎస్‌కు తీసుకెళ్లారు. అక్కడ వారు కుదర దని చెప్పడంతో తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బిడ్డ చనిపోయింది. తల్లి, బిడ్డ మృతితో ఆ కుటుంబం తీవ్రంగా విలపించింది. ఈ విషయంపై ఆస్పత్రి సూపరిండెంట్ వీణాకుమారిని వివరణ కోరగా అనసూయ డెలివరీ అయిన అరగంటేకే విపరీతమైన రక్తస్రావంతో చనిపోయిందన్నారు. ఆమె ప్రాణాలు కాపాడేందుకు తాము తీవ్రంగా కృషిచేస్తామన్నారు. అవసరమైన రక్తం తెప్పించి క్రాసింగ్ చేసేలోపే ఆమె కన్నుమూసిందని తెలిపారు. దీన్ని వైద్య భాషలో పోస్ట్‌పార్టమ్ హెమరేజ్ అంటారని ఇలాంటి కేసులు అరుదుగా సంభవిస్తాయని తెలిపారు.