ఈ జిల్లాకు ఏమైంది? | Dengue Fever In Vizianagaram | Sakshi
Sakshi News home page

ఈ జిల్లాకు ఏమైంది?

Published Fri, Aug 17 2018 12:21 PM | Last Updated on Fri, Aug 17 2018 12:21 PM

Dengue Fever In Vizianagaram  - Sakshi

గరివిడి మండలం బొండపల్లి గ్రామానికి చెందిన జానకి, ఆమె బిడ్డ మృతదేహాలు(ఫైల్‌) 

చిన్నపాటి జ్వరం వచ్చినా భయపడే పరిస్థితి వచ్చింది. ఇదేంటి... అనుకుంటున్నారా? అవునండీ బాబు. పిట్టల్లా రాలిపోతున్నారు జనం. చికిత్స ఓవైపు సాగుతుండగానే... క్షణాల్లో ప్లేట్‌లెట్లు పడిపోతున్నాయి. ఈ విషయాన్ని రక్తపరీక్షల్లో నిర్థారణ అవుతోంది. అది డెంగీకావచ్చని ఓ వైపు ప్రైవేటు వైద్యులు చెబుతున్నా...

అబ్బే అదేం కాదని తేల్చేస్తున్నారు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారులు. ఏదేమైనా ప్రాణాలు కోల్పోయేది జనాలే కదా. రోజూ ఎక్కడో ఓచోట జ్వరాలతో మృతి చెందుతున్నారన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. గడచిన పదిహేను రోజుల్లో ఇలా ప్రాణాలు పోగొట్టుకున్నవారు 15మంది ఉన్నారంటే పరిస్థితి తీవ్రత ఏమిటో స్పష్టమవుతోంది కదా....

సాక్షిప్రతినిధి, విజయనగరం : ‘స్వచ్ఛభారత్‌ కాయకల్ప అవార్డులు అందుకున్నాం. సంపూర్ణ పారిశుద్ధ్య జిల్లాగా ప్రకటించుకున్నాం. నీతిఅయోగ్‌ ఎంపిక చేసిన 117 వెనుకబడిన యాస్పిరేషన్‌ జిల్లాల్లో మన రాష్ట్రం నుంచి మూడు జిల్లాలుంటే వాటిలో ఒకటి మన జిల్లా కాగా 117 జిల్లాలతో పోటీపడి నాలుగవ స్థానంలోనూ, కృషి కల్యాణ్‌ అభియాన్‌లో మొదటి స్థానంలోనూ నిలిచాం.’’ అని గర్వంగా చెప్పుకుంటున్నాం.

కానీ దోమలు స్వైర విహారం చేస్తూ, వ్యాధులు విజృంభిస్తుంటే నష్ట నివారణ చర్యలు మానేసి కప్పిపుచ్చుకోవడానికి కారణాలు వెదుకుతున్నాం. ప్రజలపై ఒకవైపు డెంగీ, మరోవైపు విషజ్వరాలు పంజా విసిరి ప్రాణాలు తీస్తుంటే సదస్సులు, సమీక్షలంటూ కాలం వెళ్లదీస్తున్నాం. 

ఒక్కరేనట!

2018 జనవరి నెల నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 2,08,368 మందికి జ్వరాలు సోకినట్టు నమోదయ్యాయి. ఇందులో 91,362 కేసులు గిరిజన ప్రాంతాల్లోనివే. ప్రైౖవేటు ఆస్పత్రుల్లో 2.50 లక్షల వరకు జ్వరాల కేసులు నమోదయ్యాయి. తాజాగా డెంగీ, విషజ్వరాల బారిన పడి జిల్లాలో రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. చర్యలు చేపట్టాల్సిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదు. డెంగీతో రోగులు చచ్చి పోతున్నా వైద్య ఆరోగ్యశాఖ మా త్రం అవి డెంగీ మరణాలు కాదంటూ బుకాయిస్తోంది. ఇప్పటి వరకూ గరివిడి మండలం బొండపల్లికి చెందిన జానకి ఒక్కరే డెంగీతో మరణిం చారని అధికారులు చెబుతున్నారు. 

అధికార లెక్కల ప్రకారం 36 కేసులు:

జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం డెంకాడ మం డలంలో 1, డెంకాడలో 7, విజయనగరం మండలంలో 3, అర్బన్‌లో 4, తెర్లాంలో 1, జామిలో 2, నెల్లిమర్లలో 2, భోగాపురంలో 2, దత్తిరాజేరులో 2, బాడంగిలో 1, గుర్లలో 2, గజపతినగరంలో 2, ఎస్‌.కోటలో 1, మెంటాడ లో 1, చీపురుపల్లిలో 1, బొబ్బిలిలో 1, గంట్యాడలో 1, మక్కువలో 1, పూసపాటిరేగలో 1 చొప్పున 36 డెంగీ కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా ఈ సంఖ్య మూడింతలు ఉంటుందని అంచనా. చాలా మంది రోగులు నేరుగా విశాఖ పట్నంలోని కింగ్‌ జార్జ్‌ హాస్పిటల్‌(కేజీహెచ్‌), ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగీ చికిత్స పొందుతున్నారు. వారి వివరాలు ఇక్కడ నమోదు కావడం లేదు. విశాఖ ఆస్పత్రుల్లో వై ద్యం చేయించడానికి ఒక్కక్కరికీ రూ.70వేల నుం చి రూ.లక్ష వరకూ ఖర్చవుతోంది.

డెంగీ అనంగానే రిఫర్‌

జిల్లాలో 68 పీహెచ్‌సీలు, 12 సీహెచ్‌సీలు, జిల్లా కేంద్రాస్పత్రి, ఏరియా ఆస్పత్రి ఉంది. 68 పీహెచ్‌సీలకు 103 మంది  వైద్యులకు 48 మంది రెగ్యుల ర్‌ వైద్యులున్నారు. 35 మంది కాంట్రాక్టు వైద్యులున్నారు. 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయినా డెంగీ అని నిర్ధారణ కాగానే వైద్యులు కేజీహెచ్‌కు రిఫర్‌ చేసేస్తున్నారు. నిజానికి డెంగీకి ప్రత్యేకంగా చికిత్స అందించాల్సిన పని ఉండదు. సాధారణ జ్వరం మాదిరిగానే చేస్తే సరిపోతుంది. అయి తే ప్లేట్‌ లెట్స్‌ కౌంట్‌ గణనీయంగా తగ్గిపోతే వా టిని ఎక్కించాల్సి ఉంటుంది. 

నెలరోజుల్లో నమోదైన డెంగీ, జ్వర మరణాలు

తాజాగా బుధవారం ఎస్‌.కోటకు చెందిన సునా య కుమారి(45) డెంగీతో మత్యువాత పడింది. విజయనగరం రూరల్‌ మండలం మలిచర్లలో తుమ్మగంటి ఆశ(10) ఈ నెల15న డెంగీ జ్వరంతో కన్నుమూసింది. అదే రోజు ఎస్‌కోట పట్టణం ఎరుకులపేటలో సునాయ కుమారి(45) కూడా చనిపోయింది. గరివిడి మండలంలోని బొండపల్లి గ్రామానికి చెందిన ఒలుగింటి జానకి అనే గర్భిణి డెంగీ జ్వరంతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ప్రసవించి మృతి చెందింది.

ఈ నెల 13న జరిగిన ఈ సంఘటనలో అప్పుడే పుట్టిన బిడ్డ కూడా మరణించింది.గుర్ల మండలం గరిడకు చెందిన గులివిందల అప్పల నాయుడు(45) డెంగీ జ్వరంతో ఈ నెల 12న మరణించాడు.ఎస్‌.కోట పుణ్యగిరి రోడ్డులో నివాసమున్న వివాహిత బత్తిన సూరీడమ్మ(38)జ్వరంతో ఈ నెల 10న మృతిచెందింది. లక్కవరపుకోట మండలంలోని రేగ గ్రామానికి చెందిన గొల్ల రాము(24) జ్వరంతో బాదపడుతూ ఈ నెల 9న మృతి చెందాడు. 

కొమరాడ మండలం దళాయిపేటలో రాగల గౌరమ్మ (45) ఈ నెల 9న మృతిచెందింది. ఇదే మండలంలోని విక్రంపురంలో రౌతు ధనుష్‌(3) జ్వరంతో బాధపడుతూ కన్నుమూశాడు. ఎస్‌.కోట పంచాయతీ శివారు సీతంపేట గ్రామానికి చెందిన చిన్నారి చిప్పాడ మౌనిష(4) డెంగీ జ్వరంతో ఈ నెల 6వ తేదీన చనిపోయింది. ఉసిరి గ్రామానికి చెందిన బొబ్బిలి రమణమ్మ(32) డెంగీ జ్వరంతో చనిపోయిందని కుటుం బీకులు చెబుతున్నారు.

చీపురుపల్లి మండలంలోని పికె.పాలవలస పంచాయతీ మధుర గ్రామమైన చిలకరాళ్లబడిలో కొండపల్లి కుసుమ(6) డెంగీ జ్వరంతో మృతి చెందింది. ∙జామి మండలం ఎం.కె.వలస పంచాయతీ బలరాంపురం గ్రామానికి చెందిన జలగడుగుల కల్యాణి డెంగీ లక్షణాలతో జూలై 31వ తేదీన కన్నుమూసింది.

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాం

జిల్లాలో సంభవిస్తున్న మరణాలన్నీ డెంగీ జ్వరా లుగా భావించడానికి వీల్లేదు. ఇప్పటి వరకూ ఒక్కరే ఆ వ్యాధితో మృతి చెందినట్లు నిర్థారించాం. జ్వరాలు అధికంగా వ్యాప్తి చెందుతున్నందున పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాం. జిల్లాలో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని వైద్య సిబ్బంది, ఆర్‌డబ్ల్యూఎస్‌ సిబ్బందిని ఆదేశించాం. వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మొబైల్‌ డెంగీ, మలేరియా అవగాహన వాహనాలే గాకుండా అదనంగా మరో రెండు వాహనాలు ఏర్పాటు చేశాం. దోమలు వృద్ధి చెందకుండా నియంత్రణ చర్యలు చేపడుతున్నాం.

– కె.విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement