
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన తాటిశెట్టి సత్తిబాబు వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
ఆనందపురం(భీమిలి): మితిమీరిన వేగం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. స్పోర్ట్స్ బైక్‌పై ఉన్న మోజు చివరకు ఆ యువకుడి ప్రాణాలనే హరించింది. మండలంలోని వెల్లంకి జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో బైక్ నడుపుతున్న యువకుడితో పాటు దాన్ని ఢీకొని మరో వృద్ధుడు మృత్యువాత పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని పిఠాపురం కాలనీకి చెందిన మెంగం నిచ్చలకాంత్(26)కు రేస్ బైకంటే చాలా ఇష్టం. ఇటీవల కవాసికి నింజా 650 సీసీ మోటార్ బైక్‌ను కొనుగోలు చేశాడు. శుక్రవారం తెల్లవారుజామున బైక్‌పై ఇంటి వద్ద నుంచి బయలుదేరి విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లిలో ఉన్న తన స్వగృహానికి వెళ్తున్నా డు.
మండలంలోని వెల్లంకి జంక్షన్ వద్ద జాతీయ రహదారి పైకి చేరుకునే సరికి రోడ్డు దాటుతున్న వెల్లంకి గ్రామానికి చెందిన తాటిశెట్టి సత్తిబాబు (52) అనే వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో సత్తిబాబు చొక్కా బైక్ హ్యండిల్‌కు తగులుకోవడంతో సుమారు వంద మీటర్ల వరకు ఈడ్చుకొని పోయింది. దీంతో బైక్ నడుపుతున్న నిచ్చలకాంత్‌తో పాటు సత్తిబాబు రోడ్డుపై తూలి పడిపోగా.. మోటర్ బైక్ మరో వంద మీటర్లు వరకు దూసుకుపోయింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరికీ స్థానికులు సపర్యలు చేసి 108 వాహనంలో మొదట తగరపువలసలోని ఆస్పత్రికి తరలించారు. మార్గ మధ్యంలో సత్తిబాబు చనిపోగా... నిచ్చలకాంత్‌ను కేజీహెచ్‌కు తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. బైక్‌ను మితిమీరిన వేగంతో నడపడం వల్లనే ప్రమాదం సంభవించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిచ్చలకాంత్ తండ్రి చిన్నయ్యదొర కాంట్రాక్టు పనులు చేస్తూ సొంత గ్రామం నుంచి వచ్చి పిఠాపురంకాలనీలో స్థిరపడ్డారు. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా నిచ్చలకాంత్ చిన్నవాడు. గీతం యూనివర్సిటీలో బీబీఎం చదివిన నిచ్చలకాంత్ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. శవాలకు పోస్టుమార్టం నిర్వహించి ఆనందపురం సీఐ ఆర్.గోవిందరావు కేసును దర్యాప్తు చేస్తున్నారు.