
సంఘటనా స్థలంలోనే మృతి చెందిన సునీత
విజయనగరం, బొబ్బిలి రూరల్: ఓ ఆటో డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ఓ బాలిక ప్రాణాలు కోల్పోగా.. మరో బాలిక కోమాలోకి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని లింగంవలస గ్రామానికి చెందిన అలజంగి సునీత (10), మామిడి లావణ్య (18) మరో నలుగురైదుగురు ప్రయాణికులతో కలసి ఆటోలో బొబ్బిలి వెళ్తున్నారు. వీరి ఆటో ముత్తాయవలస జంక్షన్ వద్దకు వచ్చేసరికి డ్రైవర్‌నిర్లక్ష్యంగా నడపడంతో ఇద్దరు బాలికలు రోడ్డుమీద పడిపోయారు. ఈ ప్రమాదంలో సునీత తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మరో బాలిక మామిడి లావణ్య స్పృహ కోల్పోయింది. వెంటనే స్థానికులు లావణ్యను బొబ్బిలి ఆస్పత్రికి తరలించడంతో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించారు. ఏఎస్సై చదలవాడ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.