పార్వతీపురం సబ్‌కలెక్టర్ కార్యాలయానికి విచారణ కోసం వచ్చిన ఉద్యోగులు, అధికారులు
తప్పు ఒప్పుకున్నారు. తప్పుడు ధ్రువీకరణతో బిల్లులు పెట్టుకుని నిధులు తీసుకున్నట్టు అంగీకరించారు. ఎప్పటికైనా... వాస్తవాలు బయటకు రాక తప్పదని భావించి అప్రూవర్లుగా మారారు. గడచిన కొద్ది రోజులుగా సాక్షిలో వస్తున్న వరుస కథనాలు ఓ వైపు సంచలనం సృష్టించగా... విచారణ నివేదిక ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. పార్వతీపురం సబ్ కలెక్టర్ చేతన్ శుక్రవారం నిర్వహించిన విచారణకు వచ్చిన అధికారులు... బాధ్యులతో కార్యాలయంలో హడావుడి నెలకొంది.
సాక్షి ప్రతినిధి విజయనగరం: చేసిన తప్పును ఒప్పేసుకుంటే శిక్ష తగ్గుతుందనుకున్నారో ఏమో.. పార్వతీపురం పట్టణంలోని ఆర్‌సీఎం బాలుర ఉన్నత పాఠశాల, ఎలిమెంటరీ పాఠశాల, బాలగుడబ ఆర్‌సీఎం యూపీ పాఠశాలలో పనిచేసినట్లు తప్పుడు నివేదికలు, బిల్లులు సమర్పించినట్లు 13 మం ది ఉపాధ్యాయలు విచారణలో అంగీకరించారట. తప్పుడు సర్వీసు రిజిస్టర్‌ను విద్యాశాఖకు సమర్పించి తద్వారా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి 14 సంవత్సరాలకు సంబంధించిన జీతం బకాయిలు రూ.4.01కోట్లు స్వాహా చేశారనే ఆరోపణలపై కొద్దిరోజులుగా ‘సాక్షి’ వరుస కథనాలు వెలువరించిన సంగతి తెలిసిందే. గుట్టు మొత్తం బయటపడిపోవడంతో ఇక తప్పించుకోలేమని భావించి ఈ కుంభకోణంతో ప్రమేయం ఉన్నవారు నిజాన్ని ఒప్పుకున్నారు.
ముచ్చటగా మూడవసారి
ఈ కుంభకోణంపై పార్వతీపురం సబ్ కలెక్టర్ టి.ఎస్.చేతన్ ఈ నెల 7, 15 తేదీల్లో ఇప్పటికే రెండు సార్లు విచారణ జరిపి తాజాగా శనివారం మూడోసారి కూడా విచారణ నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 6 గంటల వరకు జరిగింది. ఈ విచారణలో అనేక విషయాలపై సబ్‌కలెక్టర్ ఆరాతీసి జరిగిన అవకతవలను గుర్తించినట్టు సమాచారం. విచారణకు జిల్లా విద్యాశాఖ అధికారులు, ఎయిడెడ్ పాఠశాలలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు, గతంలో పనిచేసిన ఉపాధ్యాయులు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, ఫాదర్‌లు హాజరయ్యారు.
అవకతవకలు నిజమే...: యాజమాన్యం
ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తప్పుడు సర్వీస్ రిజిస్టర్‌లు చూపించి ఎరియర్స్‌ను పొందినట్టు ఉపాధ్యాయులు అంగీకరించినట్టు విచారణకు హాజరైనవారి నుంచి వచ్చిన ప్రాధమిక సమాచారం. మొత్తం 13 మంది ఉపాధ్యాయులు తాము 2017లో విధుల్లో చేరినట్టు రాత పూర్వకంగా సబ్‌కలెక్టర్ కు తెలియజేశారు. మిగిలిన 14 సంవత్సరాలకు ఎరియర్సు బిల్లులు ఉద్దేశ పూర్వకంగానే సమర్పించి ప్రభుత్వం కళ్లుగప్పి, విద్యాశాఖ ఉన్నతాధికారులను మోసం చేసి డబ్బును రాబట్టినట్టు విచారణలో స్పష్టమైనట్టు తెలిసింది.
చర్చి ఫాదర్‌లను విచారించిన సబ్‌కలెక్టర్
విచారణలో భాగంగా సబ్‌కలెక్టర్ టి.ఎస్.చేతన్ చర్చి ఫాదర్‌లను శనివారం విచారించారు. ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్ల నిర్వహణ చేయడంలో కొంతమంది ఫాదర్‌లు కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. అలాగే ఉపాధ్యాయుల నియామకాలను కూడా నిబంధనలకు విరుద్ధంగా చేసినట్లు పిటిషనర్ గురువులు ఆరోపించారు. ఈ కోణంలో కూడా సబ్ కలెక్టర్ పూర్తి విచారణ జరుపుతున్నారు.
రాజీ ప్రయత్నాలు
ఈ కుంభకోణం కేసును ఎలాగైనా ఇక్కడితో ఆపేయించడానికి కొందరు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు..తప్పు జరిగిపోయిందని, ఇది విచారణలో రుజువై శిక్ష పడితే ఆర్‌సీఎం ఎయిడెడ్ పాఠశాలల పరువు పోతుందని, ఈ రొంపి నుండి ఎలాగైనా తప్పించాలని వారు తమ ఉన్నతాధికారులను సంప్రదించి మొరపెట్టుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
నివేదిక ఆధారంగా చర్యలు
ఇప్పటికే పార్వతీపురం సబ్ కలెక్టర్ చేతన్ విచారణ చేపట్టారు. దానికి సంబంధించిన నివేదిక మరో రెండు రోజుల్లో చేరే అవకాశం ఉంది. ఆ తర్వాత నివేదికలోని అంశాల ఆధారంగా కుంభకోణంలో బాధ్యులపై చర్యలు ఉంటాయి. – డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, జిల్లా కలెక్టర్, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment