సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ‘‘గంజాయి సరఫరాకు ఇప్పటికే కళ్లెం వేశాం. ఆ మహమ్మారి సమూల నిర్మూలన అసాధ్యమేమీ కాదు. సర్వత్రా కట్టడి కష్టమూ కాదు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఇప్పటికే ఆ దిశగా నిరంతరాయంగా పటిష్ట చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసుల యత్నాలకు అన్నిస్థాయిల్లో తమవంతుగా ప్రజలూ స్పందించి సహకరిస్తే గంజాయితోపాటు మాదకద్రవ్యాలను సమాజం నుంచి పారదోలవచ్చు. వీటి బారి నుంచి విద్యార్థులు, యువతను దూరంగా ఉంచి భవితకు భరోసా ఇవ్వవచ్చు’’ అని చెప్పారు దక్షిణ కోస్తా డీఐజీ త్రివిక్రమ వర్మ.
గంజాయ్ గెటవుట్... పోలీస్ టార్గెట్ అనే నినాదంతో పనిచేస్తున్నామని, గంజాయి నియంత్రణ విషయంలో ఇప్పటికే గణనీయమైన ఫలితాలు సాధ్యమయ్యాయని, గంజాయి ధ్వంసం, స్వాధీనం, కేసుల నమోదు, అరెస్టులే ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనాలని డీఐజీ స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పట్టుబడితే అంతే సంగతులు గంజాయి, మత్తుపదార్థాలకు యువత, విద్యార్థులు దూరంగా ఉండాలి. వాటిని ఉత్పత్తి చేసినా, కలిగి ఉన్నా, రవాణా చేసినా, కొనుగోలుకు సహకరించినా, అక్రమ వ్యాపార లావాదేవీలకు ఆర్థిక సహాయం చేసినా, నిల్వ పెట్టుకున్నా, తమ స్థలాల్లో నిల్వకు అనుమతించినా చట్టరీత్యా నేరం. వారెంట్ లేకున్నా అరెస్టు చేయవచ్చు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్‌స్టెన్స్(ఎన్‌డీపీఎస్) యాక్ట్–1985 ప్రకారం నేర తీవ్రతను బట్టి ఏడాది నుంచి ఇరవయ్యేళ్ల వరకు శిక్ష ఖరారు కావచ్చు. అక్రమంగా వ్యాపారం చేయడం ద్వారా సంపాదించిన మొత్తాన్ని సీజ్ కూడా చేయవచ్చు.
‘ఆపరేషన్ పరివర్తన్’తో గంజాయి ఉత్పత్తికే చెక్
గంజాయి నియంత్రణపై చర్యలకన్నా అసలు దాని ఉత్పత్తే లేకుండా చేయగలిగితే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనే ముఖ్యమంత్రి సూచనల మేరకు ఆంధ్ర– ఒడిశా సరిహద్దు ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో విభిన్న శాఖల సహకారంతో ‘ఆపరేషన్ పరివర్తన్’ పేరిట పోలీస్ యంత్రాంగం పూర్తిస్థాయిలో దృష్టిసారించి సత్ఫలితాలను సాధిస్తోంది. గిరిజనులే స్వచ్ఛందంగా గంజాయి సాగుకు తిలోదకాలు ఇస్తున్నారు. అవగాహన సదస్సులతో గిరిజనుల్లో అధికారులు చైతన్యం తీసుకొస్తున్నారు. దేశంలోనే ఎన్నడూ.. ఎక్కడా జరగని రీతిలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకే రోజున రూ.300 కోట్లకు పైగా విలువ చేసే రెండు లక్షల కిలోల గంజాయిని ధ్వంసం చేయడం రికార్డు.
సీఎం చిత్తశుద్ధికి నిదర్శనమిది..
అటవీ ప్రాంతాల్లో సాగవుతున్న గంజాయిని సమూలంగా లేకుండా చేయడంలో భాగంగా గిరిజనులకు లక్ష ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళికను రూపొందింపజేశారు. మూడేళ్లలో రూ.144 కోట్లతో విభిన్న ప్రోత్సాహకాలను అందజేస్తున్నారు. వేలాది మంది గిరిజనులకు లక్షల ఎకరాలను ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలిచ్చి వారికి యాజమాన్య హక్కులు కలి్పంచి శాశ్వత జీవనోపాధికి బాటలు వేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుతో గంజాయికి చెక్ పెడుతున్నారు.
ఏపీ నుంచి సరఫరా అనేది ఒకప్పటి మాట..
దక్షిణాది రాష్ట్రాలకు ఏపీ నుంచి గంజాయి సరఫరా అన్నది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆ పరిస్థితులు లేనే లేవు. ఎస్‌ఈబీ, పోలీసులు తీసుకుంటున్న చర్యలు గంజాయి నియంత్రణకు బాగా ఉపకరిస్తున్నాయి. రెండేళ్ల కిందట చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో వచ్చిన అంశాన్ని ఇప్పుడు ప్రస్తావించి ఆపాదించడం ఏమాత్రమూ సరికాదు. రాష్ట్రంలో 2020లో 650 కేసులు, 2021లో 2,200 కేసులు నమోదయ్యాయి. అలాగే 2020లో 90 వేల కిలోలు, 2021లో 2.31 లక్షల కిలోల గంజాయిని స్వా«దీనం చేసుకున్నాం. మేం తీసుకున్న చర్యలకు ఇవే నిదర్శనాలు.
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ‘ఆపరేషన్ నయా సవేరా’..
గంజాయి తదితర మాదకద్రవ్యాల నిరోధానికి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ‘ఆపరేషన్ నయా సవేరా’ పేరిట పైలెట్ ప్రాజెక్టును స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) ప్రత్యేకంగా చేపట్టింది. ఎస్‌ఈబీ ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని కట్టడి చేసేందుకు రెండు జిల్లాల్లో గత ఏడాది మార్చి 25– 31 తేదీల మధ్య దాడులు నిర్వహించి 33 కేసులు నమోదుచేసి 56 మందిని అరెస్టు చేసి వారి నుంచి 78.7 కిలోల గంజాయితో పాటు 4 గ్రాముల ఎండీఎంఏ (సింథటిక్ డ్రగ్స్) స్వా«దీనం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment