హెలిప్యాడ్ వద్దకు దూసుకొచ్చిన వైఎస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు
వారిని కంట్రోల్ చేయలేక చేతులెత్తేసిన పోలీసులు
వైఎస్ జగన్ హెలికాప్టర్ దిగకముందే చుట్టేసిన అభిమానులు
తోపులాట మధ్యే వాహనం ఎక్కిన వైఎస్ జగన్
అభిమానుల ముసుగులో ఎవరైనా హాని తలపెట్టే అవకాశం
భద్రతా వైఫల్యంపై వైఎస్సార్‌సీపీ నేతల మండిపాటు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గురువారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలో భద్రతా వైఫల్యం సృష్టంగా కనిపించింది. తమ అభిమాన నేతను చూసేందుకు వేలాది మంది వైఎస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు తరలి రావడంతో వారిని కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. హెలిప్యాడ్ వద్దకు వేలాది మంది దూసుకు రావడంతో వైఎస్ జగన్ హెలికాప్టర్ నుంచి దిగేందుకు కొద్ది సేపు సంశయించాల్సి వచ్చిందంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ అయ్యేలా పర్యటన ఖరారైంది. నెల్లూరు రూరల్ పరిధిలోని కనపర్తిపాడు జెడ్పీ హైస్కూల్ ఆవరణలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు.
అక్కడ నుంచి నేరుగా వాహనంలో జాతీయ రహదారి మీదగా నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు వెళ్లి వచ్చేలా పర్యటన ఏర్పాట్లు చేశారు. అయితే మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత హోదాలో వైఎస్ జగన్ పర్యటనకు జిల్లా పోలీస్ యంత్రాంగం సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. దాదాపు 80 మంది పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశామని చెబుతున్నప్పటికీ, అంతా హెలికాప్టర్ దిగే ప్రదేశం వద్దకే వేలాది మంది అభిమానులు దూసుకొచ్చి చుట్టు ముట్టేశారు.
కనీసం రోప్ పార్టీ కూడా లేని పరిస్థితి. దీంతో తన వ్యక్తిగత సిబ్బంది సాయంతో అభిమానులు తోపులాటల మధ్య వైఎస్ జగన్ హెలికాప్టర్ దిగి, వాహనం వద్దకు చేరుకున్నారు. హైస్కూల్ ఆవరణలో అభిమానుల్ని కంట్రోల్ చేసేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు కానీ, తగినంత పోలీస్ సిబ్బంది మాత్రం లేరు. దీంతో అభిమానుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు హెలిప్యాడ్ వద్దకు వచ్చేందుకు కూడా అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. చాలా మంది హెలిప్యాడ్ వద్ద జగన్‌ను కలవలేకపోయారు.
ఇదీ చదవండి; పద్ధతి మార్చుకో.. చంద్రబాబుకు వైఎస్ జగన్ హెచ్చరిక
వైఎస్సార్‌సీపీ నేతల్లో ఆందోళన
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించిందని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ అభిమానుల్ని కంట్రోల్ చేయలేక చేతులెత్తేయడంతో అభిమానుల ముసుగులో ఎవరైనా ఆయనకు ఏదైనా ప్రమాదం తలపెట్టే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది హెలికాప్టర్‌ను చుట్టేయడంతో జగన్ వ్యక్తిగత సిబ్బంది కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆ సమయంలో అభిమానుల ముసుగులో టీడీపీ మూకలు ఆయనపై దాడి చేసే అవకాశం ఉందని, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు చూస్తున్న నేపథ్యంలో ఈ సందేహం వస్తోందని ఆ పార్టీ నేత ఒకరు అన్నారు. గతంలో విజయవాడలో ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్‌పై రాయితో హత్యాయత్నం చేశారని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment