ముందు ‘పైలట్’.. వెనుక ‘ట్రాన్స్‌పోర్ట్’!
సాక్షి, హైదరాబాద్: నగరంలో వరుసగా పట్టుబడుతున్న డ్రగ్స్ ముఠాలు, పెరిగిన పోలీసు నిఘా నేపథ్యంలో స్మగ్లర్లు కొత్త పంథా అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగా ‘పైలట్... ట్రాన్స్‌పోర్ట్’ విధానంలో అక్రమ రవాణా అవుతున్న 240 కిలోల గంజాయిని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. రెండు వాహనాలు స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలి స్తున్నారు. నల్లకుంటకు చెందిన రవి, ఖానాజీ గూడ వాసి కృష్ణ, ఎల్బీనగర్‌కు చెందిన మధు, అంబర్‌పేటవాసి నరేశ్, భువనగిరి వాసి వెం కన్న ఓ ముఠాగా ఏర్పడ్డారు. 9 నెలలుగా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తక్కువ ధరకు రెండు కార్లలో తీసుకువచ్చి మహారాష్ట్రలో హోల్‌సేల్‌గా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. గడిచిన పది రోజులుగా పంథా మార్చి రెండు వాహనాల్లో ఒక దాన్ని పైలట్‌గా, మరోదాన్ని గంజాయి రవాణాకు వినియోగిస్తున్నారు.
రెండు వాహనాల మధ్య గరిష్టంగా రెండు కిలో మీట ర్ల దూరం ఉండేలా పథకం వేశారు. పోలీసుల కదలికలు, తనిఖీలను గుర్తించే పైలట్ వాహ నం లోనివారు వెనుక వస్తున్న వాహనంలోని వారికి సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తారు. విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చే ఈ గ్యాంగ్ రెండు వాహనాలను కొన్ని గంటలపాటు ఫీవర్ ఆస్పత్రి వద్ద పార్కింగ్‌లో ఉంచుతారు. ఆపై అదును చూసుకుని ముందుకు వెళ్తారు. దీనిపై ఇటీవల వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసు లకు సమాచారం అందింది. దీంతో ఇన్‌స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డి నేతృత్వం లోని బృందం ఈ ముఠాపై నిఘా ఉంచింది. శుక్ర వారం ఈ గ్యాంగ్ విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చినట్లు నిర్ధారించుకున్నారు. రొటీన్‌కు భిన్నంగా హైటెక్ సిటీ సమీపంలో వాహనాలు నిలుపుకున్నారు. ఓ కారులో 240 కిలోల గంజాయి నింపుకున్నారు.
సాంకేతిక ఆధా రాలను బట్టి ఈ రెండు వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ముందు వెళ్తున్న వాహనాన్ని ఆపితే వెనుక వచ్చే రవాణా వాహనం తప్పించుకునే అవకాశం ఉందని భావించారు. దీంతో నార్సింగి టోల్‌గేట్ దగ్గర కాపుకాసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు పైలట్ వాహనాన్ని విడిచిపెట్టి వెనుక వస్తున్న వాహనాన్ని ఆపారు. తనిఖీ చేయగా అందులో 240 కిలోల గంజాయి పార్శిల్స్ లభించాయి. వాహనం నడుపుతున్న నరేశ్‌తోపాటు అందులో ఉన్న మధును అరెస్టు చేశారు. వెనుక వస్తున్న వాహనం కనిపించక పోవడంతో కొద్దిదూరం వెళ్లిన పైలట్ వాహనంలోని రవి, కృష్ణ వాహనాన్ని ఓఆర్‌ఆర్‌పై వదిలి పరారయ్యారు. దీంతో ఈ కారునూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న వీరిద్దరితోపాటు వెంకన్న కోసమూ గాలిస్తున్నారు.