డ్రగ్ ప్యాకెట్‌ని మీడియాకు చూపిస్తున్న సీపీ అంజనీ కుమార్
సాక్షి, హైదరాబాద్: గోవా నుంచి నగరానికి మాదకద్రవ్యాలను తెచ్చి విక్రయిస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ. 21 లక్షల విలువ చేసే 89 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను సోమవారం ఇక్కడి నగర పోలీసు కమిషనరేట్‌లో సీపీ అంజనీకుమార్ మీడియాకు వివరించారు. గోవాకు చెందిన లివియో జోసెఫ్ అల్మీద అలియాస్ పియూష్ అక్కడే ట్రావెల్స్ వ్యాపారం చేస్తున్నాడు. అక్కడకు వచ్చే టూరిస్ట్‌లకు వాహనాలను అద్దెకిస్తుంటాడు.
ఈ వ్యాపారంలో వచ్చే ఆదాయం సరిపోక ఇబ్బందులు పడుతున్న సమయంలో పియూష్‌కు డ్రగ్స్ క్రయవిక్రయాలు చేస్తున్న నైజీరియన్లతో పరిచయం ఏర్పడింది. వీరు రూ.3 వేలకు గ్రాము చొప్పున కొకైన్ కొనుగోలు చేసి అవసరమైనవారికి రూ.6 వేల నుంచి రూ.7 వేలకు విక్రయించడాన్ని గమనించాడు. విలాసవంతమైన జీవితంతోపాటు భారీగా ఆదాయం సంపాదించవచ్చనే ఉద్దేశంతో వారితో చేతులు కలిపి దందా మొదలెట్టాడు.
మధ్యవర్తి ద్వారా పరిచయం
8 నెలల క్రితం గోవాకు వచ్చిన బంజారాహిల్స్‌వాసి, వాల్ పెయింటర్ యు.శంకర్‌తో ఓ మధ్యవర్తి ద్వారా పియూష్‌కు పరిచయం ఏర్పడింది. శంకర్‌ది ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు. శంకర్ ద్వారా గోవా నుంచి మాదకద్రవ్యాలను నగరానికి పంపించి పియూష్ డ్రగ్స్ వ్యాపారం చేయసాగాడు. కాగా, కొత్త సంవత్సర వేడుకలకు హైదరాబాద్‌లో కొకైన్ విక్రయించాలని పథకం వేశారు. ఒక్కో గ్రాము చొప్పున గోవాలో ప్యాక్ చేసిన కొకైన్ శంకర్‌కు ఇచ్చేందుకు పియూష్ నగరానికి వచ్చాడు.
ఈ సమాచారం వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అందడంతో బంజారాహిల్స్‌లో నిఘా పెట్టి శంకర్, పియూష్‌లిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరి నుంచి 89 గ్రా. కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ను ఎవరెవరికి సరఫరా చేస్తున్నాడనే విషయాలు విచారణలో వెలుగులోకి వస్తాయని సీపీ వెల్లడించారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు, ఎస్సై గట్టుమల్లు బృందం పాల్గొంది. డ్రగ్స్ ముఠా సమాచారం సేకరించిన కానిస్టేబుల్ జి.లోకేశ్వర్‌ను సీపీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment