వాడిపోతున్న స్కూలు పూలు | special story on drugs case to students | Sakshi
Sakshi News home page

వాడిపోతున్న స్కూలు పూలు

Published Thu, Jul 6 2017 11:07 PM | Last Updated on Fri, May 25 2018 2:29 PM

వాడిపోతున్న స్కూలు పూలు - Sakshi

వాడిపోతున్న స్కూలు పూలు

పుస్తకాల్లోనే కక్కుకుంటున్నారు. అక్షరాలతో సోపానాలు వేసుకునే వయసులో శిక్షలు పడి పాతాళానికి కూరుకుపోతున్నారు. మత్తు.. నిప్పులా చెలరేగుతోంది.  బడులలో తెల్లపొడి భగ్గుమంటోంది. డ్రగ్స్‌... విషనాగులై కాటేస్తున్నాయి. స్కూళ్లలోనే జీవితాలు కూలిపోతున్నాయి. తల్లిదండ్రులు ఏం చేయాలి? ఈ భూతాన్ని ఎలా బంధించాలి. పిల్లలకు విముక్తి ఎలా కల్పించాలి?

ట్రింగ్‌... ట్రింగ్‌... ట్రింగ్‌... హైదరాబాద్‌లోని ఓ ఆఫీసులో ల్యాండ్‌ ఫోను మోగుతోంది. ఎవరో ఫోను లిఫ్ట్‌ చేసి ‘శ్రీదేవీ... మీకు ఫోన్‌’ అన్నారు. శ్రీదేవి ఉలిక్కిపడింది, వెంటనే ఫోను దగ్గరకు చేరుకుని రిసీవర్‌ అందుకుంది. అవతలి వ్యక్తి ఎవరో? ఏం చెబుతున్నారో? ఎవరికీ తెలీలేదు గానీ... శ్రీదేవి చెంపలను తాకుతున్న కన్నీటి చుక్కలు అందరికీ కనిపిస్తున్నాయ్‌! ఒక్కసారిగా నిశ్శబ్దం. ఫోన్‌ పెట్టేసిన వెంటనే మేనేజర్‌ దగ్గర పర్మిషన్‌ తీసుకుని వెళ్లిపోయిందామె. ‘శ్రీదేవికి ఏమైంది?’ – ఆఫీసులో డిస్కషన్‌! మరో రెండు రోజులు ఆమె ఆఫీసుకు రాలేదు.

రెండు రోజుల తర్వాత
శ్రీదేవి ఆఫీసుకు వచ్చింది. ఆమెలో భయం, ఆందోళన. కాసేపటికి ల్యాండ్‌ ఫోను మళ్లీ మోగింది. రెండు రింగులయ్యే సరికి శ్రీదేవి లిఫ్ట్‌ చేసింది. అవతలి వ్యక్తి ఏదో చెబుతున్నారు. శ్రీదేవి ‘ఊ’ కొడుతోంది. పది నిమిషాల తర్వాత ఫోన్‌ పెట్టేసి తన సీటులోకి వచ్చింది. ఆమె మనసులో ఆందోళనలు తగ్గలేదు. శ్రీదేవిని అలా చూడలేని ఆమె స్నేహితురాలు పుష్ప మెల్లగా కదిలించింది. మాటలు కలిపింది.‘శ్రీదేవీ... అంతా మంచే జరుగుతుంది. భయాలేం పెట్టుకోకు! అసలేమైంది?’ అనడిగింది పుష్ప. ఇటువంటి ఓదార్పు, ధైర్యం కోసమే ఎదురు చూస్తోన్న శ్రీదేవి, పుష్ప ఒళ్లో తల వాల్చి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమెనలా చూసి సహోద్యోగుల కళ్లు చెమ్మగిల్లాయి. వెక్కిళ్లు తగ్గిన తర్వాత ఏం జరిగిందనేది విడమర్చి చెప్పడం ప్రారంభించింది.

కస్టడీలో కన్న కొడుకు!
శ్రీదేవి కొడుకు సుధీర్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. డ్రగ్స్‌ కేసులో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సుధీర్‌తో పాటు మరో ఐదుగుర్ని కూడా అరెస్ట్‌ చేశారు. అంతా స్కూల్‌ పిల్లలే.. మూడ్రోజుల క్రితం శ్రీదేవి సహోద్యోగులంతా టీవీల్లో, పేపర్లలో, సోషల్‌ మీడియాలో ఈ న్యూస్‌ చూశారు. ‘ఇప్పుడు సుధీర్‌ ఎక్కడున్నాడు?’ – పుష్పలోనూ ఆందోళన! ‘టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల కస్టడీలో...’ – క్లుప్తంగా చెప్పింది శ్రీదేవి. ‘ఎప్పుడు విడుదల చేస్తారట?’ – ఆఫీసులో ఇంకొకరు అడిగారు.‘ఐదుగురిలో ముగ్గుర్ని పంపించేశారు! వీణ్ణి (సుధీర్‌), ఇంకొకణ్ణి ఇంకా కస్టడీలోనే ఉంచారు’ – కళ్లు తుడుచుకుంటూ చెప్పింది శ్రీదేవి. ‘అదేంటి? కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించేస్తారు కదా! వీళ్లిదర్నీ కస్టడీలో ఉంచడం ఎందుకు? పదండి... అందరం స్టేషనుకు వెళదాం’ – ఆఫీసులో ఇంకో గొంతు వినిపించింది.

‘డ్రగ్స్‌ తీసుకునేవాళ్లకు కౌన్సెలింగ్‌ ఇస్తారు. డ్రగ్స్‌ అమ్మేవాళ్లను అరెస్ట్‌ చేస్తారు’ – ఈసారి శ్రీదేవి సమాధానంతో అందరూ సైలెంట్‌. ‘సుధీర్‌ డ్రగ్స్‌ అమ్మడం ఏంటే? వాడు ఎంత అడిగితే నువ్వు అంత ఇస్తావ్‌ కదా! డ్రగ్స్‌ దందాలోకి వెళ్లడం ఏంటి?’ – శ్రీదేవి చెప్పేదేది నమ్మేట్టు లేదన్నట్టు పుష్ప అడిగింది. ‘వన్‌ ఇయర్‌ బ్యాక్‌ వరకు వాడు బాగానే ఉండేవాడు! కానీ, గతేడాది ఫ్రెండ్స్‌తో టూర్‌ వెళ్లాడు. అప్పుడు వీడికి డ్రగ్స్‌ అలవాటయ్యాయి. చదువు మేడ ఎక్కింది. మా మేడ మీదకు డ్రగ్స్‌ ప్యాకెట్లు వచ్చి చేరాయి!’ – తండ్రి లేని పిల్లాడని గారాబం చేసి తప్పు చేశాననే భావనలో చెప్పింది శ్రీదేవి. ‘అంటే... సుధీర్‌ డ్రగ్స్‌ తీసుకుంటున్నాడని నీకు ముందే తెలుసా?’ – సూటిగా ప్రశ్నించింది పుష్ప.తెలుసన్నట్టు తలూపింది శ్రీదేవి.

‘తెలిసిన తర్వాత కూడా చూసీ చూడనట్టు వదిలేశారన్నమాట?’ – తప్పు శ్రీదేవిదే అన్నట్టు నిందలేసే ప్రయత్నం చేశారు. ‘లేదు. కంట్రోల్‌ చేయడానికి ప్రయత్నించా. వాడికి డబ్బులు ఇవ్వడం మానేశా. కష్టమైనా కాస్త కఠినంగానే వ్యవహరించా. మొదట్లో గోల చేశాడు. తర్వాత కామ్‌ అయ్యాడు. కుదురుకున్నాడనుకున్నా. కానీ, ఇంత దూరం వస్తుందనుకోలేదు. నేను ఆఫీసుకు వచ్చేసిన తర్వాత పిల్లాడు ఏం చేస్తున్నాడో మనకెలా తెలుస్తుంది? ఇంటికి వెళ్లే సరికి బుద్ధిగా ఉన్నట్లు నటిస్తున్నాడు’ – శ్రీదేవి మాటలతో వాళ్లకు విషయం బోధపడింది. అక్కడ శ్రీదేవి చుట్టూ ఉన్నవాళ్లలో చాలామందికి... వాళ్లు ఆఫీసుకు వచ్చేసిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారో తెలీదు. శ్రీదేవి మాటలు చాలామందిలో ఆలోచన రేకెత్తించాయి. అందరూ తేరుకుని ముందు సుధీర్‌ను బయటకు తీసుకొచ్చి, అతనిలో మార్పు తేవాలని నిర్ణయించుకున్నారు.

కేస్‌ 1: నేపాల్‌కు చెందిన సాకేత్‌ జైస్వాల్‌ వరంగల్‌లోని ఎన్‌ఐటీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి. తరచూ గోవా వెళ్ళే ఇతడికి శ్లాష్‌ అనే వ్యక్తితో పరిచయమైంది. శ్లాష్‌ ఇతడికి తక్కువ ధరకు ఎల్‌ఎస్‌డీ సరఫరా చేసేవాడు. ఆ మాదకద్రవ్యాన్ని తీసుకువచ్చి సిటీకి చెందిన మరో ముగ్గురితో కలిసి సేవించేవాడు. అలా మొదలైన అలవాటు ఆ తర్వాత ఎల్‌ఎస్‌డీని నగరంలో అమ్మాలని నలుగురూ నిర్ణయించుకున్నారు. దీంతో గోవా నుంచి ఎల్‌ఎస్‌డీతో పాటు కొకైన్, చరస్‌ కూడా తీసుకువచ్చి అమ్ముతూ గత నెల 29న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కారు.

కేస్‌ 2:  కామెరూన్‌ దేశానికి చెందిన మెక్‌డోనాల్డ్‌ ఎడ్యుకేషన్‌ వీసాపై హైదరాబాద్‌ వచ్చాడు. యూసుఫ్‌గూడలోని సెయింట్‌ మేరీస్‌ కాలేజీలో డిగ్రీ చదువుతూ బృందావన్‌ కాలనీలో ఉండేవాడు. అతడి స్నేహితులైన నైజీరియన్ల నుంచి డ్రగ్స్‌ ఖరీదు చేస్తూ వినియోగించడంతో పాటు అమ్మకాలు మొదలెట్టాడు. కొకైన్, హెరాయిన్‌ అమ్ముతున్న ఇతడిని గత నెల 17న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు.

కేస్‌ 3: తార్నాక నాగార్జున నగర్‌కు చెందిన ఓ కుర్రాడు పదో తరగతిలో ఉండగానే హుక్కాకు అలవాటుపడ్డాడు. శివంరోడ్‌లోని ఓ హుక్కా పార్లర్‌కు రెగ్యులర్‌ కస్టమర్‌గా మారాడు. కొన్నాళ్ళకు హుక్కాతో పాటు గంజాయికీ బానిసగా మారాడు. ధూల్‌పేట ప్రాంతానికి చెందిన కిషోర్‌ అనే వ్యక్తి నుంచి గంజాయి ఖరీదు చేసేవాడు. తన ఇంటిపై ఉన్న ఓ గదిలోనే స్నేహితులతో కలిసి హుక్కా, గంజాయి పీల్చేవాడు. ఇతడికి 2016లో మెహదీపట్నం ప్రాంతానికి చెందిన హన్నన్‌ అనే వ్యక్తితో పరిచయమైంది. ఇతడి నుంచి ఎక్స్‌టసీ, ఎల్‌ఎస్‌డీ వంటి మాదకద్రవ్యాలు ఖరీదు చేయడం ప్రారంభించిన ఆ కుర్రాడు తొలినాళ్ళల్లో తానే వినియోగించేవాడు. కొన్నాళ్ళకు విక్రేతగా మారిన ఇతగాడు లాలాగూడకు చెందిన అల్తాఫ్‌ హుస్సేన్, మహ్మద్‌ ఇబ్రహీం, బొగ్గులకుంటకు చెందిన ప్రశాంత్‌ పౌల్‌కు అమ్మడం ప్రారంభించాడు. వీరిని గత నెల 13న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.

కేస్‌ 4: నైజీరియాకు చెందిన ప్యాట్రిక్‌ విలియమ్స్‌ ఒజొన్నా గతేడాది సెప్టెంబర్‌లో విజిట్‌ వీసాపై హైదరాబాద్‌కు వచ్చాడు. ఓ పబ్‌కు వెళ్ళిన సందర్భంలో ఇతడికి కెన్యా జాతీయుడైన కొలిన్స్‌తో పరిచయమైంది. ఇతడు మాదకద్రవ్యాలు వ్యాపారం చేస్తున్నాడని తెలుసుకున్న ప్యాట్రిక్స్‌ తానూ ఆ దందాలో దిగాడు. కొలిన్స్‌ నుంచి గ్రాము కొకైన్‌ను రూ.2 వేలకు ఖరీదు చేస్తూ... దీన్ని వినియోగదారులకు గ్రాము రూ.5 వేల నుంచి రూ.6 వేలకు అమ్ముతున్నాడు. ద్విచక్ర వాహనంపై సంచరిస్తూ మాదకద్రవ్యాలు అమ్ముతున్న ఇతడిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఈ ఏడాది మార్చ్‌లో పట్టుకున్నారు.

గుర్తించడం ఇలా!
ప్రవర్తనలో మార్పులు, మూడ్‌ స్వింగ్స్, దిగులు, చిన్న విషయానికే కోపం, ఆలస్యంగా పడుకుని ఆలస్యంగా లేవడం, ఆకలి, బరువు తగ్గిపోవడం, వాంతులు, వ్యక్తిగత పరిశుభ్రత లోపం, కళ్లు ఎర్రబారడం, మాటకు ఆలోచనలకు పొంతన లేకపోవడం, పనిని త్వరగా ముగించడం లేదా జాగు చేయడం, ప్రశ్నిస్తే సహించలేకపోవడం, చేతిలో ఉన్న వస్తువును విసిరికొట్టడం, అబద్దాలాడడం వంటివి.చదువులో వెనుకబడడం, అటెండెన్స్‌ తగ్గడం, డబ్బు అవసరం పెరగడం, కొత్త స్నేహాలు, బయటకు వెళ్లిన వెంటనే ఫోన్‌ స్విచాఫ్‌ చేయడం, ఎక్కువ సేపు ఏకాంతంగా గడపడం.

బయటపడేదెలా?
టీనేజ్‌ పిల్లలున్న పేరెంట్స్‌ చాలా అలర్ట్‌గా ఉండాలి. ∙గుర్తించగానే సైకియాట్రిస్ట్‌తో కౌన్సెలింగ్‌ ఇప్పించాలి. సైకియాట్రిస్ట్‌ దగ్గరకు వెళ్లడానికి ఇష్టపడకపోతే ఫ్యామిలీ కౌన్సెలర్‌ను సంప్రదించాలి. మొదట పేరెంట్స్‌ మాత్రమే సైకియాట్రిస్ట్‌ను కలిసి సిచ్యుయేషన్‌ని ఎలా డీల్‌ చేయాలో సూచనలు తీసుకోవాలి. మెల్లగా వారిని కూడా కౌన్సెలింగ్‌ సెంటర్‌కు తీసుకురావాలి ∙డ్రగ్స్‌తో వచ్చే నష్టాలను పిల్లలకు స్నేహపూర్వకంగా వివరించి డీటాక్సిఫికేషన్‌ మెడిసిన్‌ ఇస్తారు ∙తీవ్రతను బట్టి సిట్టింగ్స్, కొందరికి ఆరు నెలలు కూడా పట్టవచ్చు. కొందరికి రీహ్యాబిలిటేషన్‌ సెంటర్‌లో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది. – డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తి, సైకియాట్రిస్ట్, లూసిడ్‌ డయాగ్నస్టిక్స్, హైదరాబాద్‌
– సత్య పులగం
గమనిక: వ్యక్తుల పేర్లు మార్చడమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement