కండోమ్స్‌లో డ్రగ్స్ దాచి..
పనాజీ(గోవా): కండోమ్స్ ప్యాకెట్లలో డ్రగ్స్ తరలిస్తూ ఓ బ్రిటిష్ పౌరుడు గోవా పోలీసులకు దొరికిపోయాడు. యూకేకు చెందిన డేవిడ్ జాన్సన్ గత ఫిబ్రవరిలో గోవాకు చేరుకున్నాడు. ఉత్తర గోవా ప్రాంతంలోని అంజునా గ్రామంలో నివాసం ఏర్పరచుకున్నాడు. డేవిడ్ జాన్సన్ ఇక్కడి బీచ్‌ల్లో జరిగే పార్టీల సందర్భంగా కావల్సిన వారికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న యాంటీ నార్కోటిక్ విభాగం పోలీసులు ఇతనిపై నిఘా ఉంచారు.
శుక్రవారం రాత్రి ఇతని నివాసంపై దాడి చేసి రూ.18 లక్షల విలువైన ఎక్‌స్టసీ, ఎల్‌ఎస్‌డీ అనే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని వెనుక డ్రగ్స్ మాఫియా ఉన్నట్లు తాము అనుమానిస్తున్నామని ఎస్పీ ఉమేష్ గవోన్కర్ శనివారం విలేకరులకు తెలిపారు. కండోమ్స్‌తోపాటు మందులను నిల్వ ఉంచే డబ్బాల్లో షుగర్ క్యూబ్స్‌ను పోలి ఉండేలా సింథటిక్ డ్రగ్స్‌ను దాచేవాడు. వాటిని దొంగచాటుగా తీసుకుని లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్టు అధికారులను ఏమార్చి గత ఫిబ్రవరిలో ముంబైకి చేరుకున్నాడు. అక్కడి నుంచి గోవా వచ్చి ఇక్కడి పర్యాటకులకు మాదకద‍్రవ్యాలను విక్రయిస్తున్నట్లు తాము గుర్తించామన్నారు. తీరప్రాంతంలో నిత్యం జరిగే పార్టీలకు వెళ్లే వారు ఈ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారన్నారు. గోవా సముద్ర తీరంలో గడిపేందుకు ఏటా 40 లక్షల మంది టూరిస్టులు వస్తుంటారు. వీరిలో 5లక్షల మంది విదేశీయులే.