స్కానింగ్‌కు ఫాయిల్‌తో చెక్‌! | Check with scanning foils! | Sakshi
Sakshi News home page

స్కానింగ్‌కు ఫాయిల్‌తో చెక్‌!

Published Thu, Jul 20 2017 3:18 AM | Last Updated on Fri, May 25 2018 2:11 PM

స్కానింగ్‌కు ఫాయిల్‌తో చెక్‌! - Sakshi

స్కానింగ్‌కు ఫాయిల్‌తో చెక్‌!

- విదేశాల నుంచి పోస్టులో వస్తున్న డ్రగ్స్‌
స్కానింగ్‌కు చిక్కకుండా సిల్వర్‌ ఫాయిల్స్‌లో ప్యాక్‌
టాస్క్‌ఫోర్స్‌ దర్యాప్తులో వెలుగులోకి కీలకాంశాలు

సాక్షి, హైదరాబాద్‌: టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేసిన డ్రగ్స్‌ గ్యాంగ్‌ విచారణలో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. వంశీధర్‌కి ఎల్‌ఎస్‌డీ డ్రగ్‌ సరఫరా చేసిన మల్లికార్జున్‌రావు ఇప్పటి వరకు మూడుసార్లు డార్క్‌నెట్‌ వినియోగించి జర్మనీ నుంచి డ్రగ్స్‌ ఖరీదు చేసినట్టు వెల్లడైంది. వర్చువల్‌ కరెన్సీ అయిన బిట్‌ కాయిన్స్‌ను ఆన్‌లైన్‌లో ఖరీదు చేసి వాటి ద్వారా డ్రగ్స్‌ ఆర్డర్‌ చేస్తున్నాడని తేలింది. బిట్‌ కాయిన్‌ విలువ ప్రస్తుతం భారత కరెన్సీలో రూ.1.65 లక్షలు ఉందని పోలీసులు చెప్తున్నారు.
 
సిల్వర్‌ ఫాయిల్స్‌లో పార్శిల్‌..
ఆర్డర్లు తీసుకునే జర్మనీ, యూరోపియన్‌ దేశాల్లో ఉన్న డ్రగ్స్‌ సరఫరాదారులు వాటిని కొరియర్, పోస్టల్‌ ద్వారానే ఇక్కడకు పంపిస్తున్నారు. ఒక్కో దఫా గరిష్టంగా 200 గ్రాములు మాత్రమే ఖరీదు చేస్తుండటంతో ఆ మేరకు పార్శిల్‌ చేస్తున్నారు. ఎల్‌ఎస్‌డీ బిస్కెట్స్, ఎల్‌ ఎస్‌ఏ విత్తులతో ఇబ్బంది లేక పోయినా.. కొకైన్, ఎల్‌ఎస్‌డీ స్టాంపుల్ని విమానాశ్రయాల్లో స్కాన్‌ చేసినప్పుడు గుర్తించే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలోనే స్కానింగ్‌కు చిక్కకుండా ఉండేందుకు వీటిని సిల్వర్‌ ఫాయిల్స్‌లో పార్శిల్‌ చేస్తున్నట్లు వెల్లడైంది. మల్లికార్జున్‌ వీటిని డెలివరీ చేయడానికి ఓ కిరాణా దుకాణం యజమాని చిరునామా ఇచ్చాడు.
 
అభివన్‌కు సహకరించిన బాబీ..
డార్క్‌నెట్‌ ద్వారా అభినవ్‌ మహేందర్‌ కూడా డ్రగ్స్‌ ఖరీదు చేశాడు. ఈ వ్యవహారాల్లో ఇతడికి శశికాంత్‌ చర్ల అలియాస్‌ బాబీ సహాయకారిగా ఉన్నాడు. బాబీ చెరస్‌ అనే మాదక ద్రవ్యాన్నీ తీసుకువచ్చి అభినవ్‌కు అప్పగించేవాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కస్సోల్‌ లో లభించే ఈ చెరస్‌ కోసం తరచు అక్కడకు వెళ్లేవాడు. ప్రస్తుతం అక్కడే ఉన్న ఇతడిని సిటీకి వచ్చిన తర్వాత అరెస్టు చేయాలని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిర్ణయించారు. మల్లికార్జున్, అభినవ్‌ నుంచి డ్రగ్స్‌ ఖరీదు చేసి విక్రయించే వంశీధర్‌ నిత్యం తన వెంట ఓ ఎయిర్‌గన్‌ ఉంచుకునేవాడు. డ్రగ్స్‌ క్రయవిక్రయాల దగ్గర ఎదుటి వారిని బెదిరించడానికి దీనిని వినియోగించే వాడని తేలింది. సౌత్‌ ఆఫ్రికాకు చెందిన చికా 2012లో బిజినెస్‌ వీసాపై గోవా వచ్చాడు.

ప్రస్తుతం అక్కడే వస్త్రవ్యాపారం చేస్తున్నాడు. నైజీరియాకు లక్కీ 2014లో స్టూడెంట్‌ వీసాపై ముంబై వచ్చాడు. 2016 వరకు ఢిల్లీలోని ఛత్రపతి కాలేజ్‌లో బీఎస్సీ (పెట్రో కెమికల్స్‌) చేశాడు. ప్రస్తుతం మణికొండలో స్నేహితుడితో కలిసి నివసిస్తున్నాడు. చికా, లక్కీ ఇద్దరూ వీసా గడువు ముగిసినా భారత్‌లోనే ఉంటున్నట్లు గుర్తించారు. చికా గోవాతో పాటు ముంబై, హైదరాబాద్‌ల్లో తరచు సంచరిస్తూ పబ్స్, హోటల్స్, రెస్టారెంట్స్‌లో డ్రగ్స్‌ అమ్మే వాడని వెల్లడైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement