పోలీసుల అదుపులో నిందితులు
సుల్తాన్‌బజార్: గంజాయి అక్రమరవాణా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి 102 కిలోల గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా, మాకవరం పాలెం మండలం, తామారం గ్రామానికి చెందిన శ్రీనివాస్, అశోక్‌తేజ అనే ఇద్దరు వ్యక్తులు నగరంలోని ధూల్‌పేట్, కాటేదాన్, నారాయణఖేడ్‌లోని వ్యాపారులకు గంజాయి సరఫరా చేసేవారు. మంగళవారంశ్రీనివాస్ రెండు కిలోల గంజాయి ప్యాకెట్లను విక్రయించేందుకు మలక్‌పేటలోని టీవీ టవర్ వద్ద ఉన్నట్లు సమాచారం అందడంతో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిని విచారించగా మరో వ్యక్తితో కలిసి ఏపీలోని నర్సిపట్నం నుంచి గంజాయి విక్రయించేందుకు నగరానికి వచ్చినట్లు తెలిపారు. అతడిచ్చిన సమాచారం అధారంగా అబ్దుల్లాపూర్ మేట్‌లో హైవే పక్కన నిలిపి ఉన్న కారులోని 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏడాదిగా నగరంలోని వ్యాపారులకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మొదట్లో 10 కిలోల చొప్పున విక్రయించానని, దశలవారిగా సరఫరా పెంచామన్నారు. పాడేరు, చింతపల్లి, నర్సిపట్నం ప్రాంతాల్లో కిలో రూ.1500 చొప్పున కొనుగోలు చేసి నగరంలో రూ.4 వేలకు విక్రయిస్తున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో నగరంలో గంజాయి కొనుగోలు చేస్తున్న వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి పర్యవేక్షణలో ఏఈఎన్ అంజిరెడ్డి, సీఐ రవి, ఎస్‌ఐలు నిజాముద్దీన్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment