
ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ (సర్కిల్‌లో) ఇన్‌స్పెక్టర్ దయా నాయక్
సాక్షి, సిటీబ్యూరో: న్యూ ఇయర్ వేడుకల సహా ఇతర సందర్భాల్లో ఉత్తరాది నుంచి భారీ స్థాయిలో మాదకద్రవ్యాలు నగరానికి దిగుమతి అవుతూ ఉంటాయి. ఈ డిసెంబర్ 31ని టార్గెట్‌గా చేసుకుని గోవా నుంచి కొకైన్‌ను తీసుకువచ్చిన గ్యాంగ్‌ను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే చింతల్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇస్మాయిల్ గులామ్ హుస్సేన్ మాత్రం ఈ సీన్‌ను రివర్స్ చేశాడు. నగర శివార్లలోని పారిశ్రామిక వాడలో తయారైన ఎఫిడ్రిన్ డ్రగ్‌ను మరో వ్యక్తితో కలిసి ముంబైకి అక్రమంగా చేరవేశాడు. సోమవారం తెల్లవారుజామున వీరిద్దరినీ పట్టుకున్న అక్కడి అంబోలీ పోలీసులు రూ.3.4 కోట్ల విలువైన 20 కేజీల ఎఫిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. దేశంలోనే పేరెన్నికగన్న ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ ఈ కేసును దర్యాప్తు చేస్తుండటం విశేషం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతానికి సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. చింతల్‌లోని వెంకటేశ్వరనగర్‌కు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ గులాం హుస్సేన్ కొన్నేళ్లుగా డ్రగ్స్ దందా చేస్తున్నాడు. మహారాష్ట్రలోని పాల్‌ఘర్ ప్రాంతానికి చెందిన దయానంద్ మాణిక్ ముద్దన్నార్ అతడికి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు.
గత కొన్నేళ్లుగా వీరు దేశవాళీ డ్రగ్‌గా పిలిచే ఎఫిడ్రిన్‌ను విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) హైదరాబాద్ యూనిట్ అధికారులు 2013లో వీరిని పట్టుకుని 200 కేజీల ముడి ఎఫిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వీరి వ్యవహారాలపై కన్నేసి ఉంచేందుకుగాను హిస్టరీ షీట్లు కూడా తెరిచారు. ఈ కేసులో బెయిల్ పొందిన వీరు 2015లో బయటికి వచ్చారు. ఈ ద్వయం అప్పటి నుంచి తమ దందాను హైదరాబాద్ నుంచి ముంబైకి మార్చింది. అక్కడి కొందరు డ్రగ్ పెడ్లర్స్‌తో (విక్రయదారులు) సంబంధాలు ఏర్పాటు చేసుకుని వారు కొరినప్పుడల్లా సిటీ నుంచి రోడ్డు మార్గంలో ఎఫిడ్రిన్ తీసుకువెళ్లి అప్పగించి వస్తున్నారు. డిసెంబర్ 31 పార్టీలను టార్గెట్‌గా చేసుకున్న ముంబైలోని డ్రగ్ పెడ్లర్లు ఇస్మాయిల్ ద్వయానికి భారీ ఆర్డర్ ఇచ్చారు. దీంతో హై క్వాలిటీ ఎఫిడ్రిన్ తీసుకున్న వీరు ఆదివారం ఉదయం సిటీ నుంచి రోడ్డు మార్గంలో ముంబై చేరుకున్నారు. సోమవారం తెల్లవారుజామున ఎఫిడ్రిన్‌తో ఉన్న బ్యాగ్‌ను డెలివరీ చేయడానికి వెళుతుండగా అంబోలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోగేశ్వరి వెస్ట్‌లో ఉన్న అగర్వాల్ ఎస్టేట్స్ వద్ద సంచరిస్తున్న వీరి వ్యవహారంపై అక్కడి పోలీసులకు సమాచారం అందింది.
దీంతో తెల్లవారుజామున 2.40 గంటలకు రంగంలోకి దిగిన ఇన్‌స్పెక్టర్ దయా నాయక్ నేతృత్వంలోని బృందం వీరిని అదుపులోకి తీసుకుంది. వీరి వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా... అందులో మూడు ప్యాక్స్‌లో పార్శిల్ చేసి ఉన్న 20 కేజీల 348 గ్రాముల ఎఫిడ్రిన్ లభించింది. దీనిని స్వాధీనం చేసుకున్న అంబోలీ పోలీసులు వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ మాదకద్రవ్యం విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.3 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ అరెస్టుపై సమాచారం అందుకున్న ఇక్కడి పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. 2013లో, తాజాగా వీరి వద్ద లభించిన ఎఫిడ్రిన్ పరిమాణాన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు నగర శివార్లలో దీనిని తయారు చేస్తున్నారని భావిస్తున్నారు. ఈ రాకెట్‌కు సంబంధించిన మూలాలను కనిపెట్టడానికి ఎన్సీబీ సైతం రంగంలోకి దిగింది. ఇస్మాయిల్‌తో పాటు మరో నిందితుడిని అరెస్టు చేసిన ముంబైలోని అంబోలీ ఠాణా ఇన్‌స్పెక్టర్ దయా నాయక్‌కు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరుంది. దేశంలోనే పేరెన్నికగన్న ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌ల్లో ఈయన ఒకరు. 1995లో ముంబై పోలీసు విభాగంలో చేరిన దయా పేరు 2000 ప్రాంతంలో మారుమోగింది. డిటెక్షన్ యూనిట్‌లో పని చేస్తూ దాదాపు 80 మందిని ఎన్‌కౌంటర్ చేసిన చరిత్ర ఉంది. ప్రస్తుతం ఈయన అంబోలీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment