ఎక్కడో పుడుతుంది.. ఎక్కడో పెరుగుతుంది.. ఊరిలోకి వస్తుంది.. తైతక్కలాడిస్తోంది! అదే గ‘మ్మత్తు’ గంజాయి. మన్యం ప్రాంతాల్లో సాగవుతూ రాష్ట్రం అంతటా రవాణా అవుతూ.. యువతను తనకు బానిసలుగా మార్చేసుకుంటోంది. దీనిని అరికట్టాల్సిన పోలీసులు చోద్యం చూస్తుండటంతో తేలిగ్గా పాగా వేస్తోంది. ముఖ్యంగా విజయవాడ నగరంలో గంజాయి దందా మూడు దమ్ములు.. ఆరు కిక్కులు అన్న చందంగా సాగిపోతోంది. అంతేకాక ఇతర ప్రాంతాల రవాణాకూ నగరమే అడ్డాగా మారుతుండటం ఆందోళన కల్గిస్తోంది.
సాక్షి, అమరావతిబ్యూరో: ఉత్తరాంధ్ర, తెలంగాణలోని దండకారణ్యం నుంచి గంజాయి బెజవాడను ముంచెత్తుతోంది. నగరంలో అనూహ్యంగా పట్టుబ డుతున్న గంజాయి పోలీసులను ఉలికిపాటుకు గురిచేస్తోంది. ఇన్నాళ్లు గుట్కా, నకిలీ నెయ్యి, కాల్‌మనీ కేసుల విచారణకే పరిమితమైన సిటీ పోలీసులకు గంజాయి మాఫియా సవాల్‌గా మారింది. కృష్ణలంక, వన్‌టౌన్, టూటౌన్, రైల్వేస్టేషన్, బస్టాండు ప్రాంతాల్లో పనిపాటలేనివాళ్లు గంజాయి సేవనం నిత్యకృత్యం. రూ. పాతిక ఇస్తే చిటికెడు గంజాయిని పొట్లాల్లో విక్రయిస్తుంటారు. చెత్త ఏరేవారు, యాచకులు, రిక్షా, ముఠాకూలీ కార్మికులు, నదిగట్లపై బైరాగులు గంజాయికి నిత్య వినియోగదారులు. వివిధ రూపాల్లో దీనిని వినియోగిస్తూ మత్తులో తేలిపోతుంటారు.
యువత చిత్తు..
సాధారణ యువత, విద్యార్థులు సైతం ఇటీవల సంవత్సరాల్లో గంజాయికి దాసోహమవుతున్నారు. గతేడాది కాలంలో నగరంలో గంజాయి కొనుగోలు చేస్తూ కొందరు.. గంజాయిని విక్రయిస్తూ కొందరు ఇంజినీరింగ్ విద్యార్థులకు నగర పోలీసులకు పట్టుపడ్డారు. అలాగే ఇటీవల ఇద్దరు పోలీసు అధికారుల కుమారులు విశాఖ నుంచి గంజాయి తెస్తూ పోలీసులకు దొరికిపోయారు. ఇలా నగర శివార్లలో ఉన్న కళాశాలల్లో చాలా మంది విద్యార్థులు మాదకద్రవ్యాలకు అలవాటు పడినట్లు సమాచారం. దీంతో గంజాయి విక్రేతలు నగరంలోని కాలేజీల వద్దే విక్రయాలు సాగిస్తున్నారు. ఇవన్నీ తెలిసినా పోలీసులు పెద్దగా స్పందించడం లేదనే ఆరోపణలున్నాయి. నగరంలో జరిగే చెల్లర నేరాలకు గంజాయే కారణం. బ్లేడుబ్యాచ్‌లకు ప్రధాన మత్తు ఆదాయ వనరు ఇదే. విశాఖపట్నం అటవీ ప్రాంతాల నుంచి తక్కువ రేటుకు తెప్పించి ఇక్కడ అధిక ధరలకు విక్రయిస్తుంటారు. ఇందులో ఆధిపత్య పోరు తరచూ కొట్లాటలు, కొన్నిసార్లు హత్యలకు దారితీస్తోంది.
జాతీయ రహదారిపై దర్జాగా..
తాజాగా పట్టుబడిన గంజాయి.. నగరం దీని రవాణాకు ఒక కేంద్రంగా మారిందనేది చెబుతోంది. ఏలూరు మీదుగా విజయవాడ, గుంటూరుకు, అటు నుంచి హైదరాబాద్‌కు, బెంగళూరు, చెన్నైలకు గంజాయి నిత్యం పెద్ద మొత్తాల్లో అక్రమ రవాణా అవుతోంది. పండ్లు, కూరగాయలు, కొబ్బరికాయలు, ఇతరత్రా వస్తువుల లోడ్ల కింద గంజాయిని దాచి జిల్లాలను దాటిస్తున్నారు. కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారి పొడవునా ఉన్న రవాణా, పోలీసు, వాణిజ్య పన్నుల చెక్‌పోస్టుల్లో నిర్లక్ష్యం, అవినీతి వల్ల పట్టుబడడం చాలా తక్కువ. గంజాయి ఘాటైన వాసన వస్తుంది. కాబట్టి దానిని పకడ్బందీగా ప్యాక్ చేసి ట్రక్కులు, మినీ లారీల్లో సరుకుల కింద ఉంచుతారు. అంత లోతుగా తనిఖీ చేసే ఓపిక లేక, లేదా భారీ ముడుపులకు లొంగిపోయిన సిబ్బంది వీటిని వదిలేస్తున్నారు. ఉత్తరాంధ్ర అడవుల్లో గంజాయి అక్రమంగా సాగవుతోంది. అక్కడ కిలో రూ. ఐదు వేలు పలికే గంజాయి మెట్రో నగరాల్లో రూ. 60 వేలకు చేరుతుంది.
స్థావరంగా బెజవాడ!
మెట్రో నగరాల సంగతి పక్కన పెడితే విజయవాడ గంజాయి నెట్‌వర్క్ సురక్షిత స్థావరంగా ఉందన్నది తాజా ఘటనల సారాంశం. వన్‌టౌన్, భవానీపురం, ఇబ్రహీపట్నం, లారీ టెర్మినల్, పటమట, పెనమలూరు ప్రాంతాల్లో గంజాయి మాఫియా గోదాములు నిర్వహిస్తోన్నట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లో గోదాములపై ఎలాంటి నిఘా లేదు. వివిధ సరుకుల మాటున తెప్పించే గంజాయిని ఇక్కడే నిల్వ చేసి కావలసిన వ్యక్తులకు, ప్రదేశాలకు తరలిస్తున్నట్లు పోలీసు వర్గాల అనుమానం. ముడి గంజాయిని ఇక్కడ శుభ్రంగా ప్రాసెస్ చేసి చిన్న చిన్న ప్యాకెట్లలో ఇతర ఉత్పత్తుల మాటున నగరాలకు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఇక నిత్య రైళ్లు, బస్సుల్లో ఉత్తరాంధ్ర నుంచి ట్రావెల్‌బ్యాగుల్లో తెచ్చి విక్రయించే వ్యక్తులకు లెక్కలేదు.
నిఘా పెట్టాం..
విజయవాడలో గంజాయి విక్రయ ముఠాల కార్యకలాపాలపై గట్టి నిఘా పెట్టాం. ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇక్కడకు గంజాయి సరఫరా అవుతోంది. అక్కడి మూలాల్ని గుర్తించే పనిలో ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ విక్రయదారులను కట్టడి చేసే పనిలో ఉన్నాం. విజయవాడ కేంద్రంగా హైదరాబాద్, చెన్నై నగరాలకు గంజాయి సరఫరా అవుతోందని గుర్తించాం. సిటీ పోలీసులకు అందుతున్న సమాచారం మేరకు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ గంజాయిని పట్టుకుంటున్నారు. శనివారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆర్టీసీ బస్టాండ్‌లో రెండు బ్యాగుల ద్వారా తరలిస్తున్న 15 కిలోల గంజాయిని పట్టుకున్నారు. శుక్రవారం సైతం 27 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.– ద్వారకా తిరుమలరావు,నగర పోలీసు కమిషనర్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment