పోలీసులు పట్టుకున్న నిందితులు, గంజాయి
మలక్‌పేట: నగర పోలీసులు ఇప్పటి వరకు గంజాయి విక్రేతలు, రవాణా చేసే దళారుల్ని మాత్రమే పట్టుకున్నారు. తొలిసారిగా నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ మాదకద్రవ్యాన్ని పండించేవారికీ చెక్ చెప్పారు. విశాఖ ఏజెన్సీకి చెందిన ఇద్దరు రైతులు సహా మొత్తం నలుగురిని పట్టుకున్నారు. వీరి నుంచి రూ.6.7 లక్షల విలువైన సరుకు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు బుధవారం వెల్లడించారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. ఒడిశాలో పండిస్తున్న గంజాయిని ఈ గ్యాంగ్ భద్రాచలం మీదుగా సిటీకి తరలిస్తున్నట్లు తెలిపారు.
తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఆశతో..
విశాఖ ఏజెన్సీలోని జీకే వీధికి చెందిన కయ్యం నాగరాజు, పేరి చిన్నారావు సమీప బంధువులు. ఒకప్పుడు వీరు జొన్న సాగు చేసేవారు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం గంజాయి పండించడం ప్రారంభించారు. జీకే వీధి ఆంధ్రా– ఒడిశా సరిహద్దుల్లో ఉండటంతో తమ ‘వ్యవసాయానికి’ అవతలి వైపు ఉన్న ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఒడిశా పరిధిలోని వచ్చే పోపులూరులో గంజాయి సాగు చేయడం మొదలెట్టారు.
ఇలా పరిచయం..
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా వేలర్తి గ్రామానికి చెందిన ఎం.దుర్గాబాబు వృత్తిరీత్యా ఆటోడ్రైవర్. ఈ నేపథ్యంలోనే ఇతడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక గ్రామానికి చెందిన మరో ఆటోడ్రైవర్ జి.నర్సింహతో పరిచయమైంది. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఆలోచనలో ఉన్న ఈ ద్వయం గంజాయి అక్రమ రవాణాకు సహకరించడం ప్రారంభించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చి నగరంలో నివసిస్తున్న డి.శివశంకర్‌రెడ్డికి కొన్నాళ్ల క్రితం నాగరాజుతో పరిచయమైంది. అతడు గంజాయి పండిస్తున్నాడని తెలుసుకున్న ఇతగాడు దాన్ని స్మగ్లింగ్ చేయడం ద్వారా నగరానికి తరలించిన విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఇతడు ఇచ్చే ఆర్డర్ ఆధారంగా నాగరాజు, చిన్నారావు గంజాయిని రెండేసి కేజీల చొప్పున గాలి సోకని విధంగా ప్యాక్ చేసేవాళ్లు. వీటిని దుర్గాబాబు, నర్సింహల ద్వారా హైదరాబాద్‌కు పంపిస్తున్నారు.
నగరానికి ఇలా..
కేజీ రూ.1500 చొప్పున ఖరీదు చేస్తున్న శివశంకర్‌రెడ్డి దాన్ని ఇక్కడి వినియోగదారులకు గరిష్టంగా కేజీ రూ.7వేల చొప్పున అమ్ముతున్నాడు. దుర్గాబాబు, నర్సింహలు ఈ మాదకద్రవ్యాన్ని నేర్పుగా ప్రత్యేక బ్యాగుల్లో సర్దుకుని, ప్రైవేట్ బస్సుల ద్వారానే సిటీకి తీసుకువస్తున్నారు. అప్పుడప్పుడు మాత్రం వీరితో పాటు నాగరాజు, చిన్నారావు సైతం వచ్చి డబ్బు వసూలు చేసుకుని వెళ్తుంటారు. ఇటీవల తనకు 100 కేజీల గంజాయి కావాలంటూ శివశంకర్‌రెడ్డి ఆర్డర్ ఇచ్చాడు. దీంతో అది తీసుకుని నలుగురూ తొలుత భద్రాచలం చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రైవేట్ బస్సులో సరుకుతో సహా సిటీకి బయలుదేరారు. దీనిపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు జి.రాజశేఖర్‌రెడ్డి, బి.పరమేశ్వర్, కె.శ్రీకాంత్ మలక్‌పేట ప్రాంతంలో వల పన్నారు. ఓ బస్సును ఆపి తనిఖీ చేయగా.. ఈ నలుగురితో పాటు 96 కేజీల గంజాయి లభించింది. దీంతో నిందితుల్ని అరెస్టు చేసిన అధికారులు పరారీలో ఉన్న శివశంకర్‌రెడ్డి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment