వివరాలు వెల్లడిస్తున్న అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి, పక్కన డీఎస్పీ దుర్గాప్రసాద్, సీఐలు
నగరంపాలెం (గుంటూరు): గంజాయి తరలిస్తున్న 9 మంది యువకులను అరెస్ట్ చేసి, వారి నుంచి 7 కిలోల గంజాయి, 2 కార్లు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. అర్బన్ జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అక్రమంగా గంజాయి తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతో తాడేపల్లి పోలీస్‌స్టేషన్ సీఐ ఎం.సుబ్రమణ్యం, ఎస్సై జి.బాలకృష్ణలు తమ సిబ్బందితో శనివారం సీతానగరం రైల్వే బ్రిడ్జి సమీపంలో రెండు కార్లను ఆపి తనిఖీలు చేశారు.
భారీగా గంజాయి పట్టుబడటంతో వాహనాల్లో ఉన్న 9 మంది యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. వీరంతా తాడేపల్లి టౌన్, పెనుమాక, తుళ్లూరు మండలంలోని వెంకటపాలెం, మంగళగిరిలోని కాజ, ఎర్రబాలెం గ్రామాలకు చెందిన వారుగా గుర్తించారు. చదువుకునే రోజుల నుంచే మిత్రులు అయిన వీరంతా చెడు వ్యసనాలకు అలవాటుపడి, గంజాయి అక్రమ రవాణాకు పాల్పడినట్లుగా గుర్తించామని ఎస్పీ తెలిపారు. వీరిపై రౌడీషీట్‌లు తెరిచి నిఘా ఉంచుతామన్నారు. సమావేశంలో నార్త్ డీఎస్పీ దుర్గాప్రసాద్, సీఐలు సుబ్రమణ్యం, జె.రాజారావు, ఎస్సై బాలకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment