ఫిల్మ్‌నగర్‌ కేంద్రంగా డ్రగ్స్‌ అక్రమ రవాణా | Drugs Gang Arrest in Hyderabad | Sakshi
Sakshi News home page

వినియోగదారుల నుంచి విక్రేతలుగా!

Published Mon, Jun 3 2019 8:01 AM | Last Updated on Mon, Jun 3 2019 8:01 AM

Drugs Gang Arrest in Hyderabad - Sakshi

స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలు

సాక్షి, సిటీబ్యూరో: మత్తుకు బానిసలై మాదకద్రవ్యాల వినియోగదారులుగా మారిన ముగ్గురు యువకులు అందుకు అవసరమైన డబ్బుల కోసం వాటినే అమ్మడం మొదలెట్టారు. అరకు ఏజెన్సీతో పాటు బెంగళూరు నుంచి వీటిని తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న తూర్పు మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు అదనపు డీసీపీ ఎస్‌.చైతన్యకుమార్‌ ఆదివారం వెల్లడించారు. వారి నుంచి నాలుగు రకాలైన నిషేధిత మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే..తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం ప్రాంతానికి చెందిన కె.భాస్కర్‌ వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్‌. బతుకుదెరువు నిమిత్తం ఆరు నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన ఇతను ఫిల్మ్‌నగర్‌ ప్రాంతంలోని గదిలో స్నేహితుడైన ఎం.విశాల్‌తో కలిసి ఉంటున్నాడు. నిరుద్యోగి అయిన విశాల్‌ సైతం ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. వీరిద్దరూ మత్తుకు బానిసలుగా మారి గంజాయి పీల్చడం ప్రారంభించారు.

ఈ వ్యసనంతో పాటు ఇతర ఖర్చులూ పెరిగిపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. వీటి నుంచి బయటపడేందుకు తామే డ్రగ్‌ పెడ్లర్స్‌గా మారి మాదకద్రవ్యాలను అక్రమ రవాణా చేయాలని పథకం వేశారు. వీటిని అవసరమైన వారికి ఎక్కువ ధరకు విక్రయించాలని భావించారు. ఇలా చేస్తే తాము సేవించడానికి, అమ్మితే కొంత డబ్బు కూడా వస్తుందని భావించాడు. ఇందులో భాగంగా భాస్కర్‌ కొన్ని రోజుల క్రితం అరకు వెళ్లి గంజాయి కంటే ఎక్కువ డిమాండ్‌ ఉన్న దాని అనుబంధ ఉత్పత్తి హష్‌ ఆయిల్‌ను తీసుకువచ్చాడు. విశాల్‌తో పాటు అతడి స్నేహితుడు ఎం.అభిషేక్‌ (విద్యార్థి) ఇటీవల బెంగళూరు వెళ్లి అక్కడ ఓ పబ్‌లో పెడ్లర్‌ నుంచి ఎక్స్‌టసీ, ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ వంటి డ్రగ్స్‌ ఖరీదు చేసుకుని తీసుకువచ్చారు. ఈ డ్రగ్స్‌ను ముగ్గురూ విశాల్‌ రూమ్‌లో ఉంచి కొనుగోలుదారుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌ నేతృత్వంలో ఎస్సైలు పి.రమేష్, జి.శ్రీనివాస్‌రెడ్డి, గోవింద్‌స్వామి తమ బృందాలతో శనివారం దాడి చేశారు. నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని వారి గదిలో ఉన్న 100 మిల్లీ లీటర్ల హష్‌ ఆయిల్, తొమ్మిది ఎక్స్‌టసీ ట్యాబ్లెట్లు, ఐదు ఎల్‌ఎస్‌డీ బోల్ట్‌లు, ఒక గ్రాము ఎండీఎంఏ, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న వాటినీ బంజారాహిల్స్‌ పోలీసులకు అప్పగించారు. 

200 కేజీల గంజాయి స్వాధీనం...
మరోపక్క ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసు ఆదివారం 200 కేజీల గంజాయి సైతం స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి కొందరు వ్యక్తులు గంజాయి కొనుగోలు చేసి కారులో నగరానికి తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో వలపన్నిన టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ నిందితులను అదుపులోకి తీసుకుని గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement