నిందితుల అరెస్ట్ చూపుతున్న పోలీసులు
కర్నూలు : గంజాయి ముఠా గుట్టు రట్టయింది. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని జొహరాపురంలో భారీగా గంజాయి నిల్వ ఉంచి ఓ మహిళ విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో ఒకటో పట్టణ సీఐ విక్రమ సింహ తన సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. గ్రామ శివారులోని అల్లాబకాష్ దర్గా వెనుక ఖాళీ స్థలంలో చంద్రకంటి లక్ష్మమ్మ గంజాయి నిల్వ ఉంచి విక్రయాలు జరుపుతుండగా గురువారం పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి 1030 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విక్రయేత చంద్రకంటి లక్ష్మమ్మతో పాటు ఆమె వద్ద కొనుగోలు చేసి గంజాయి సేవిస్తున్న 8 మంది యువకులను కూడా అరెస్ట్ చేశారు. బాలాజీనగర్, కండేరి, గనిగల్లీ ప్రాంతాలకు చెందిన యువకులు లక్ష్మమ్మ వద్ద కొంతకాలంగా గంజాయి కొనుగోలు చేసేవారు. పక్కా సమాచారంతో వారందరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ విక్రమసింహ తెలిపారు. లక్ష్మమ్మ ఆత్మకూరు నుంచి గంజాయిని దిగుమతి చేసుకుని వ్యాపారం సాగిస్తున్నట్లు విచారణలో బయటపడింది. దర్యాప్తులో భాగంగా అసలైన వ్యక్తుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment