
వర్క్‌షాప్‌లో మాట్లాడుతున్న డీజీపీ గౌతమ్ సవాంగ్
సాక్షి, అమరావతి: గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణకు అన్ని శాఖల సమన్వయం కీలకమని, స్మగ్లర్ల డేటాను అన్ని శాఖల దగ్గర నిక్షిప్తం చేయడం ద్వారా వారి ఆగడాలను అరికట్టవచ్చని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ అన్నారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ‘మాదక ద్రవ్యాల ఉత్పాదన, రవాణాల నిర్మూలన, నియంత్రణ’పై ఒక రోజు వర్క్‌షాప్ జరిగింది. దక్షిణాది రాష్ట్రాల అధికారులతో నిర్వహించిన వర్క్‌షాప్‌ను డీజీపీ సవాంగ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో గంజాయి సాగు ఎక్కువగా సాగుతోందని, అది కర్ణాటక, తమిళనాడు రాష్రాలకు రవాణా అవుతోందన్నారు.
విద్యార్థులు మాదక ద్రవ్యాల ఉచ్చులో పడి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని డీజీపీ హితవు పలికారు. ఏపీ సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాల పోలీసులు పరస్పర సహకారం అవసరమన్నారు. ఏపీ శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణలో అన్ని శాఖల అధికారులతోపాటు విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, విద్యాలయాల నిర్వాహకులు కృషి చేయాలని కోరారు. అదనపు ప్రధాన అటవీ సంరక్షణ అధికారి ఆనంద్ కుమార్ ఝూ, ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) ఐజీ చంద్రశేఖర్, బెంగళూరు జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, బెంగళూరు జోనల్ డైరెక్టర్ సునీల్‌కుమార్, సీఐడీ ఏడీజీ దయానంద్‌లు మాట్లాడారు.