Special laws
-
ప్రత్యేక చట్టాలకూ సీఆర్పీసీ నిబంధనలు
సాక్షి, అమరావతి: నేర విచారణ ప్రక్రియ స్మృతి (సీఆర్పీసీ)లో అత్యంత ప్రాధాన్యత ఉన్న సెక్షన్ 41ఏ విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ ఐపీసీ నేరాలకు మాత్రమే కాకుండా ప్రత్యేక చట్టాలకు సైతం వర్తిస్తుందంటూ తీర్పునిచ్చింది. ఇందులో భాగంగానే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సస్ చట్టం (ఎన్డీపీఎస్) కింద జరిగే నేరాలకు కూడా సీఆర్పీసీ సెక్షన్ 41ఏ వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదు చేసే కేసులకు సీఆర్పీసీ 41ఏను వర్తింప చేయరాదన్న నిషేధం ఏదీ లేదంది. ఎన్డీపీఎస్ చట్టంలో ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడే సెక్షన్ల కింద కేసు నమోదు చేసినప్పుడు, దర్యాప్తు అధికారులు నిందితులకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ ఇటీవల తీర్పు వెలువరించారు. బెంగళూరుకు చెందిన కె.రంజిత్ వాహనంలో గంజాయి ప్యాకెట్లు దొరకడంతో చిత్తూరు జిల్లా గంగవరం పోలీసులు అతడితోపాటు మరికొందరిపై ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 20(బీ(2)(సీ) కింద గంజాయి అక్రమ రవాణా కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ రంజిత్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ విచారణ జరిపారు. 25 ఏళ్లకు పొడిగించవచ్చు.. పిటిషనర్ తరఫు న్యాయవాది డాక్టర్ మజ్జి సూరిబాబు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ వద్ద కేవలం 600 గ్రాముల గంజాయి మాత్రమే ఉందన్నారు. ఇలా స్వల్పంగా దొరికినప్పుడు నేరం నిర్ధారణ అయితే సెక్షన్ 20(బీ)(2)(ఏ) కింద ఏడాది మాత్రమే జైలుశిక్ష పడుతుందన్నారు. అందువల్ల పిటిషనర్‌కు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే ఈ వాదనను పోలీసుల తరఫు రాష్ట్ర అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్‌రెడ్డి వ్యతిరేకించారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్ కింద 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని.. దాన్ని 25 ఏళ్లకు సైతం పొడిగించవచ్చన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఎన్డీపీఎస్ చట్టం కింద పెట్టిన కేసులకు వర్తించదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం.. 1,000 గ్రాముల గంజాయి.. స్వల్ప పరిమాణం. 20 కిలోలు ఉంటే అది వాణిజ్య పరిమాణం. ప్రస్తుత కేసులో పిటిషనర్ వద్ద దొరికింది కేవలం 600 గ్రాములే కాబట్టి అతడిపై సెక్షన్ 20(బీ(2)(సీ) కింద కేసు సరికాదు. పిటిషనర్‌పై 20(బీ)(2)(ఏ) కింద మాత్రమే కేసు నమోదు చేయాలి. సీఆర్పీసీలోని సెక్షన్ 4(2) ఇతర చట్టాల కింద నమోదైన కేసులను కూడా విచారించి తీరాలని చెబుతోంది’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులకు.. ఏ రకంగా చూసినా ఎన్డీపీఎస్ చట్టం కింద ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసులకు సీఆర్పీసీ నిబంధనలు వర్తిస్తాయి. పోలీసులు ఇష్టారాజ్యంగా చేసే అరెస్టుల నుంచి పౌరుల స్వేచ్ఛను కాపాడేందుకు సీఆర్పీసీ సెక్షన్ 41, 41ఏ ఉన్నాయి. పౌరుల స్వేచ్ఛకు సంబంధించిన ఆ నిబంధనలు ప్రత్యేక చట్టాలకూ వర్తిస్తాయి. ప్రస్తుత కేసులో పిటిషనర్ వాహనంలో 600 గ్రాముల గంజాయి దొరికినందున, అందుకు పడే శిక్ష ఏడేళ్ల కన్నా తక్కువ కాబట్టి అతడి విషయంలో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ ప్రకారం నడుచుకోవాలి’ అని దర్యాప్తు అధికారిని న్యాయమూర్తి ఆదేశించారు. -
విధిగా ఓటేసేలా చట్టం రావాలి: హరీశ్
సాక్షి, సిద్దిపేట: ‘మనకు నచ్చిన.., ప్రజలకు సేవ చేసే నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఒక్క ప్రజాస్వామ్య దేశంలోనే సాధ్యం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ విధిగా ఓటు వేసేలా ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అవసరమైతే చట్టాల్లో మార్పులు చేయాలి’ అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ పాఠశాల మైదానంలో వంద మీటర్ల ఈవీఎం పెయింటింగ్‌ను వేశారు. వంద మీటర్ల జాతీయ పతాకంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ, ప్రభుత్వాలను ఎన్నుకునేందుకు 18 ఏళ్లు నిండిన ప్రతీ పౌరుడికి రాజ్యాంగం ఓటు హక్కును కల్పించిందని అన్నారు. వయోజనులందరూ కలసి మంచి నాయకుడిని ఎన్నుకుంటే మంచిపాలన అందుతుందని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని మహాత్మాగాంధీ కలలు కన్నారని వివరించారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తగ్గడం ప్రజాస్వామ్యానికి విఘాతం వంటిదని అన్నారు. ఎంత ఎక్కు వ మంది ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకుంటే.. అంత మంచి పాలకులు వస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు తదితరులు పాల్గొన్నారు. -
మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు
సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను తీసుకొస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అవసరమైతే ప్రస్తుత చట్టాలను సవరించేందుకూ వెనకాడమని చెప్పారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేట పీఆర్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో మంత్రి మాట్లాడారు. మహిళల రక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ఆ దిశగా ప్రణాళిక రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించారు. మహిళా చట్టాలను కఠినతరం చేసేందుకు ప్రభుత్వం సమాలోచన చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో బాలికల గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘షీ టీం’ బృందాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని మంత్రి పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో ఎస్పీ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక హెల్ప్‌లైన్ 24గంటలు పని చేయనుందన్నారు. వాట్సప్ నంబర్ 94906 17555, కాల్ సెంటర్ 94409 01835 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అనంతరం పలువురు మహిళలను సన్మానించారు. -
ప్రత్యేక చట్టాలపై మహిళలు అవగాహన కల్పించుకోవాలి
మూడేళ్ల క్రితం డిసెంబర్లో... మెడిసిన్ చదివే ఓ అమ్మాయికి ఒక ఐటీ స్టూడెంట్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్నారు. ఆ క్రమంలో వీరిద్దరూ నిరుడు డిసెంబరులో ఒకరోజు కలుసుకున్నారు. ఎప్పటిలా భవిష్యత్తు గురించి ఊసులాడుకున్నారు. ఆ వేళకు వీడ్కోలు తెలుపుకున్నారు. కాసేపయితే ఎవరి నివాసాలకు వాళ్లు చేరిపోయేవారే. కానీ అంతలోనే అనుకోని ఘోరం జరిగింది. గమ్యస్థానాలు చేరేందుకు వారు ఎక్కిన బస్సే వారి పాలిట శాపమయ్యింది. అందులో ఉన్న కొందరు దుర్మార్గుల చేతుల్లో ఆ అమ్మాయి గ్యాంగ్‌రేప్‌కి గురయ్యింది. తర్వాత కొన్ని రోజులకు ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయింది. కానీ వెళ్లిపోతూ వెళ్లిపోతూ ఆమె అందరిలోనూ ఆలోచనలు రేకెత్తించింది. ‘ఈ సమాజంలో ఆడపిల్ల పరిస్థితి ఏమిటి?’ అనే ప్రశ్నను సంధించిపోయింది. స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం, మహిళా సంక్షేమం వంటి మాటలన్నిటినీ సమాధి చేసింది ఆమె మరణం. ప్రజాగ్రహం పెల్లుబికింది. మా రక్షణ కోసం మీరేం చేస్తున్నారంటూ మహిళాలోకం ప్రభుత్వాన్ని నిలదీసింది. ఫలితంగా నిర్భయ చట్టం పుట్టుకొచ్చింది. ఆ తర్వాత ఇండియన్ పీనల్ కోడ్‌లో మార్పులు చేసి, స్త్రీల మానప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం సంకల్పించింది. మహిళల చుట్టూ ఎన్నో రక్షణ రేఖలు గీసింది. కానీ ఆ రేఖలు ఎవరినీ ఆపలేదు. ఆ సంఘటన తర్వాత కూడా ఎన్నో గ్యాంగ్ రేప్‌లు జరిగాయి. భారతదేశంలో ప్రతి ఇరవై నిమిషాలకొక అత్యాచారం జరుగుతోందని సర్వేలు చెబుతున్నాయి. కానీ వీటిని అరికట్టడం మాత్రం అసాధ్యంగా ఉంది. మహిళలకూ స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అత్యాచార భూతం ఆ స్వేచ్ఛను హరించేస్తోంది. ఉన్న చట్టాలను మార్చినా, కొత్తచట్టాలను చేర్చినా అవి ఆగకపోవడానికి కారణం... వాటి పట్ల ప్రజలకు సరయిన అవగాహన లేకపోవడం, వాటి అమలులో ప్రభుత్వం, అధికారులు విఫలమవడం. కాబట్టి మొదట చేయాల్సింది నిర్భయ అయితేనేమి, ఇతర ఏ చట్టాలయితేనేమి... వాటి గురించి పూర్తి అవగాహన కల్పించాలి. దానివల్ల భయం అనేది కలుగుతుంది. తప్పు చేశారని తేలగానే జాప్యం లేకుండా శిక్షను అమలుపర్చాలి. దానివల్ల తప్పు చేయడానికి జంకే పరిస్థితి వస్తుంది. అవి చేయనంతవరకూ ఎన్ని చట్టాలు చేసినా ఉపయోగం లేదు. వాటివల్ల మహిళలకు ఒరిగేదీ ఉండదు. - అమర్త్యసేన్