సాక్షి, హైదరాబాద్ : దేశంలో నేటికీ అమల్లో ఉన్న బ్రిటిష్ కాలం నాటి చట్టాలతోపాటు ఇతర పురాతన చట్టాలను పునఃసమీక్షించి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పుచేర్పులు చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ) పరిధిలోని ఏడు విభాగాల పరిధిలో వివిధ చట్టాలకు సంబంధించిన నిబంధనలను సమీక్షించి సూచనలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. కార్మిక, తూనిక, కొలతలు, ఫ్యాక్టరీలు, బాయిలర్స్, విద్యుత్, పురపాలన, వాణిజ్య పన్నుల విభాగాల పరిధిలో పాత చట్టాలను అధ్యయనం చేసి వాటి సరళీకరణతోపాటు ఆయా చట్టాల్లో చేయాల్సిన మార్పులు చేర్పులపై అధ్యయనం చేయాలని సూచించింది. ప్రధాని మోదీ స్వయంగా ఈ అంశాన్ని పర్యవేక్షిస్తుండటంతో డీపీఐఐటీ కూడా కేంద్రం సూచించిన ఏడు విభాగాల పరిధిలోని చట్టాలకు సంబంధించిన నియమ నిబంధనలను అధ్యయనం చేయాలని కోరుతోంది.
రాష్ట్రంలో 25 శాఖల పరిధిలో:
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాత్రం ఈ అధ్యయనాన్ని కేవలం కేంద్రం సూచించిన ఏడు విభాగాలకే పరిమితం చేయకుండా పౌర సేవలతో ముడిపడిన అన్ని శాఖలకు వర్తింపచేయాలని ఆదేశించారు. పాత చట్టాలను అధ్యయనం చేయాల్సిన తీరు, వాటి సరళీకరణ, మార్పులు చేర్పులు తదితరాలకు సంబంధించిన మార్గదర్శకాలపై డీపీఐఐటీకి చెందిన అధికారుల బృందం శుక్ర, శనివారాల్లో హైదరాబాద్‌లో వర్క్‌షాప్‌ను నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏడు ప్రభుత్వ విభాగాలతో పాటు సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా మొత్తం 25 రాష్ట్ర ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు.
పౌర సేవలు సరళీకృతంగా అందించేందుకు అడ్డుగా ఉన్న చట్టాల్లోని నిబంధనలను గుర్తించడం, వాటికి చేయాల్సిన సవరణలను సూచించడం లక్ష్యంగా వర్క్‌షాప్‌లో కేంద్ర బృందం దిశానిర్దేశం చేసింది. చట్టాల్లోని నియమ నిబంధనలను సాకుగా చూపుతూ పౌర సేవలను అందించడంలో ఆలస్యాన్ని తొలగించేందుకు ఈ కసరత్తు దోహదం చేస్తుందని పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. మార్చి 31లోగా అధ్యయనం పూర్తి చేసి ప్రభుత్వ విభాగాల వారీగా ప్రణాళికను డీపీఐఐటీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని కేంద్ర అధికారుల బృందం గడువు విధించింది. ఈ నేపథ్యంలో డీపీఐఐటీ మార్గదర్శకాలకు అనుగుణంగా 25 రాష్ట్ర ప్రభుత్వ శాఖల పరిధిలో కసరత్తు ప్రారంభం కానున్నది.
Comments
Please login to add a commentAdd a comment