న్యూఢిల్లీ: ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురాదలి్చన మూడు బిల్లులపై పార్లమెంటరీ స్థాయీసంఘం గురువారం పరిశీలన ప్రారంభించింది. బీజేపీ ఎంపీ, మాజీ ఐపీఎస్ అధికారి బ్రిజ్‌లాల్ నేతృత్వంలో హోంశాఖ వ్యవహారాలపై ఈ పార్లమెంటరీ స్థాయీ సంఘం ఏర్పాటైంది. మూడు బిల్లులపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పార్లమెంట్ సభ్యులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. వారి అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలుసుకున్నారు.
ప్రతిపక్ష ఎంపీలు పలు అంశాలను లేవనెత్తారు. మూడు బిల్లులకు హిందీ పేర్లు పెట్టడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 348ను ఉల్లంఘించడమే అవుతుందని డీఎంకే సభ్యుడు దయానిధి మారన్ ఆక్షేపించారు. తన అభ్యంతరాలు, డిమాండ్లపై మారన్ ఒక లేఖ సమర్పించారు. మారన్ డిమాండ్లకు పలువురు విపక్ష ఎంపీలు మద్దతు పలికారు. మూడు బిల్లులను బీజేపీ సభ్యులు స్వాగతించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ‘భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లు’ను పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment