విమానం ఆధారం దొరికింది!
హిందూ మహాసముద్రంలో రెండు వస్తువులు
ఒకటి విమానం రెక్కలోనిది కావొచ్చని అనుమానం
ఆస్ట్రేలియా శాటిలైట్ చిత్రాల్లో వస్తువుల గుర్తింపు
తేలాడే వస్తువులు ఉన్న ప్రాంతానికి బయల్దేరిన నిఘా విమానాలు
కనుక్కోలేకపోయిన అమెరికా నేవీ విమానం
కౌలాలంపూర్/మెల్బోర్న్/న్యూఢిల్లీ: గల్లంతైన మలేసియా బోయింగ్ విమానం జాడ కనుక్కోవడానికి తొలిసారిగా మంచి ఆధారం దొరికింది! దక్షిణ హిందూ మహాసముద్రంలో రెండు భారీ వస్తువులు తేలాడుతూ కనిపించాయి. ఇవి 13 రోజుల కిందట అదృశ్యమైన మలేసియా విమాన శకలాలో, కావో నిర్ధారించేందుకు ఆస్ట్రేలియా సైన్యం నేతృత్వంలో నిఘా విమానాలు గురువారం ఆ ప్రాంతానికి బయల్దేరాయి. ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల్లో ఒకటైన ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి నైరుతి దిశలో 2,500 కి.మీ దూరంలో రెండు తేలాడే వస్తువులను నాలుగు రోజుల కిందట తమ శాటిలైట్ చిత్రాల్లో గుర్తించినట్లు ఆస్ట్రేలియా అధికారులు చెప్పారు. వీటిలో ఒకటి 24 మీటర్లు(80 అడుగులు), మరొకటి ఐదు మీటర్ల(15 అడుగులు) పొడవు ఉంది.
పెద్దదాని కొలతను బట్టి అది విమానం రెక్కలో పెద్ద భాగం కావొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా తమ సైనిక విమానం ఆ వస్తువులు ఎక్కడున్నాయో కనిపెట్టలేకపోయిందని, అయితే మిగతా విమానాలు గాలింపు కొనసాగిస్తాయని, దీనికి సమయం పడుతుందని అస్ట్రేలియా అధికారులు చెప్పారు. బోయింగ్ కోసం ఇంతవరకు దశా, దిశా లేకుండా సాగిన గాలింపులో పలు తప్పుడు ఆధారాలు బయటపడ్డంతో ఈ వస్తువులకు సంబంధించి ముందస్తు నిర్ధారణకు రాకూడదన్నారు. ఇవి వేల మీటర్ల దూరం నుంచి కొట్టుకొచ్చినట్లు కనిపిస్తోందని తెలిపారు. వీటి గుర్తింపు ప్రస్తుతానికి మంచి ఆధారం కావొచ్చని ఆస్ట్రేలియా సముద్ర భద్రతా సంస్థ అధికారి జాన్ యాంగ్ తెలిపారు. అయితే సరుకు రవాణా నౌకల నుంచి అప్పుడప్పుడూ కంటైనర్లు జారి నీటిలో పడుతుంటాయి కనుక ఈ వస్తువులు సముద్రంలో చెత్త అయ్యుండే అవకాశమూ ఉందన్నారు.
విశ్వసనీయ ఆధారం: మలేసియా
తేలాడే వస్తువుల గురించి ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ గురువారం ఉదయం తమ ప్రధాని నజీబ్ రజాక్‌కు ఫోన్లో తెలిపారని మలేసియా రక్షణ, రవాణా మంత్రి హిషాముద్దీన్ హుసేన్ చెప్పారు. తమకు విశ్వసనీయ ఆధారం దొరికిందని, ధ్రువీకరించడానికి సమయం పడుతుందని అన్నారు. వస్తువులు కనిపించిన ప్రాంతాన్ని గుర్తించేందుకు డేటా మార్కర్ బాల్స్‌ను విమానాల ద్వారా జారవిడవనున్నట్లు చెప్పారు. ఈలోగా దక్షిణ హిందూ మహాసముద్రం నుంచి దక్షిణ, మధ్య ఆసియా వరకు ఉన్న రెండు కారిడార్లలో గాలింపు సాగుతుందన్నారు. వస్తువులున్న చోటికి న్యూజిలాండ్, అమెరికా, ఆస్ట్రేలియాల సైనిక విమానాలు, నౌకలు పయనమయ్యాయి. కాగా, వస్తువులు కనిపించిన ప్రాంతంలో గురువారం పొద్దుపోయాక గాలించిన తమ నేవీ నిఘా విమానం ఎలాంటి వస్తువులనూ కనుక్కోలేకపోయిందని అమెరికా తెలిపింది. ఈ ప్రాంతానికి నార్వే నౌక కూడా చేరుకుంది. అక్కడికి మంచును పగలగొట్టే తమ నౌకను పంపాలని చైనా యోచిస్తోంది. మరోపక్క.. విమానాన్ని గాలించేందుకు అండమాన్ సముద్రంలోకి తమ నాలుగు యుద్ధనౌకలను అనుమతించాలన్న చైనా విజ్ఞప్తిని భారత్ తోసిపుచ్చింది. తమ భద్రతా బలగాలు అభ్యంతరం చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాం తంలో భారత నేవీ, వాయుసేనలు ఇప్పటికే గాలిస్తున్న నేపథ్యంలో చైనా వినతిని తోసిపుచ్చారు. గాలింపు కోసం భారత్ భారీ విస్తీర్ణంలో గాలించగల పీ-81, సూపర్ హెర్క్కు లస్ నిఘా విమానాలను రంగంలోకి దింపనుంది. మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం ఈ నెల 8న ఐదుగురు భారతీయులు సహా 239 మందితో కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు వెళ్తూ.. బయల్దేరిన గంటకే అదృశ్యమవడం, దాని ఆచూకీ కోసం 26 దేశాలు గాలిస్తుండడం తెలిసిందే.