మళ్లీ హామిల్టన్‌కే...
మెర్సిడెస్ డ్రైవర్‌కు వరుసగా రెండో ‘పోల్ పొజిషన్’
నేడు మలేసియా గ్రాండ్‌ప్రి రేసు
కౌలాలంపూర్: సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో ఎదురైన చేదు ఫలితాన్ని మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ వెనక్కినెట్టాడు. రెండో రేసు మలేసియా గ్రాండ్‌ప్రిలో కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగాడు.
శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్‌లో దుమ్మురేపాడు. మూడు క్వాలిఫయింగ్ సెషన్స్‌లోనూ తన ఆధిపత్యాన్ని చాటుకున్న ఈ ప్రపంచ మాజీ చాంపియన్ సీజన్‌లో వరుసగా రెండోసారి ‘పోల్ పొజిషన్’ను సొంతం చేసుకున్నాడు. చివరిదైన మూడో క్వాలిఫయింగ్ సెషన్‌లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 59.431 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలోనూ ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్ తన కారు ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా రెండో ల్యాప్‌లోనే వైదొలిగాడు.
రెండో రేసులో హామిల్టన్ అదృష్టం ఎలా ఉంటుందో వేచి చూడాలి. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ రెండో స్థానం నుంచి రేసును ఆరంభిస్తాడు. హామిల్టన్ మాదిరిగానే తొలి రేసులో వెటెల్‌కు నిరాశ ఎదురైంది. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానం నుంచి... పెరెజ్ 14వ స్థానం నుంచి రేసును మొదలుపెడతారు.