హామిల్టన్ తొలిసారి...
కౌలాలంపూర్: ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ... పది రేసుల తర్వాత మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన మలేసియా గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ విజేతగా నిలిచాడు. 56 ల్యాప్‌ల ఈ రేసును ఈ బ్రిటన్ డ్రైవర్ గంటా 40 నిమిషాల 25.974 సెకన్లలో పూర్తి చేశాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. నిరుటి విజేత వెటెల్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
ఈనెల 16న సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో ‘పోల్ పొజిషన్’తో బరిలోకి దిగిన హామిల్టన్ రెండు ల్యాప్‌ల తర్వాత వైదొలిగాడు. అయితే మలేసియాలో మాత్రం ఎలాంటి తప్పిదం చేయకుండా ఆరంభం నుంచి చివరి ల్యాప్ వరకు తన దూకుడు కొనసాగించాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ తొలి మలుపు వద్ద ఆధిక్యంలోకి వెళ్లి చివరిదాకా ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నాడు.
తన ఎనిమిదేళ్ల ఫార్ములావన్ కెరీర్‌లో హామిల్టన్‌కిది 23వ టైటిల్ కాగా మలేసియా గ్రాండ్‌ప్రిలో తొలిసారి చాంపియన్‌గా నిలిచాడు. గతేడాదిలో జులై 28న హంగేరి గ్రాండ్‌ప్రి రేసును నెగ్గిన తర్వాత హామిల్టన్‌కు వరుసగా పది రేసుల్లో విజయం దక్కలేదు.
ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి మాదిరిగానే ఈ రేసులోనూ అనూహ్యంగా ఏడుగురు డ్రైవర్లు రేసును పూర్తి చేయలేకపోయారు. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), రికియార్డో (రెడ్‌బుల్), గుటిరెజ్ (సాబెర్), సుటిల్ (సాబెర్), జీన్ వెర్జెన్ (ఎస్టీఆర్), బియాంచి (మారుసియా), మల్డొనాడో (లోటస్) ఈ జాబితాలో ఉన్నారు.
భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు మిశ్రమ ఫలితాలు లభించాయి. నికో హుల్కెన్‌బర్గ్ ఐదో స్థానంలో నిలువగా... మరో డ్రైవర్ సెర్గియో పెరెజ్ కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో బరిలోకి దిగలేదు. సీజన్‌లో తదుపరి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 6న జరుగుతుంది.