త్రీ ఇన్ వన్ అద్భుతం | Three-in-One miracle | Sakshi
Sakshi News home page

త్రీ ఇన్ వన్ అద్భుతం

Published Thu, Aug 7 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 11:32 AM

త్రీ ఇన్ వన్ అద్భుతం

త్రీ ఇన్ వన్ అద్భుతం

సింగపూర్
 
ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీస్.. ఆసియాలోనే క్లీనెస్ట్ సిటీగా పేరుపొందిన దేశం సింగపూర్. అలాంటి దేశాన్ని ఒక్కసారన్నా చూడాలన్న కోరిక ఇటీవలే తీరింది. మలేసియాలోని కౌలాలంపూర్‌లో ఉన్న మా మిత్రుణ్ణి కలవడానికి ముగ్గురు స్నేహితులం కలిసి 12 రోజులకు టూర్ ప్లాన్ చేసుకున్నాం. కౌలాలంపూర్ నుంచి సింగపూర్ వెళ్లాలనేది మా ప్లాన్. ముందుగా చెన్నై నుంచి కౌలాంపూర్ వెళ్లి, తిరిగి చెన్నై రావడానికి మూడు నెలల ముందు ఆఫర్‌లో బుక్ చేసుకుంటే రూ.14 వేల రూపాయలకు టికెట్ లభించింది. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ ఏషియా విమానమెక్కి కౌలాలంపూర్ చేరుకున్నాం. స్నేహితుణ్ణి కలిసి, అటు నుంచి కౌలాలంపూర్ నుండి సింగపూర్ బయల్దేరాం. సింగపూర్‌కు విమానాలు, ఓడల సదుపాయాలు ఉన్నాయి. అయినా మేం రోడ్డు మార్గాన్నే ఎంచుకున్నాం.
 
కౌలాలంపూర్ - సింగపూర్: మా స్నేహితుడు ముందుగా బుక్ చేసిన డబుల్ డెక్కర్ బస్సులో (రూ. 4 వేలు ఒక్కొక్కరికి) కౌలాలంపూర్ నుంచి సింగపూర్‌కి చేరుకున్నాం. ఎటు చూసినా ఎత్తై బిల్డింగ్‌లు అబ్బురపరుస్తూ ఆహ్వానం పలికాయి. ఆస్ట్రేలియా, చైనా, న్యూజిలాండ్, ఇండియా.. దేశాలకు సింగపూర్ అతి పెద్ద జంక్షన్. సింగపూర్ సిటీ నుంచి లోకల్ ట్రైన్‌లో ‘సెంటోసా ఐలాండ్’కి బయల్దేరాం.
 
అబ్బురపరిచే ట్రాఫిక్ వ్యవస్థ... దారంతటా విశాలమైన రోడ్లు, పకడ్బందీగా ఉండే సిగ్నలింగ్ వ్యవస్థ, పౌరుల క్రమశిక్షణ.. మెచ్చుకోకుండా ఉండలేం. వెహికిల్స్ అన్నీ క్రమప్ధతిలో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేసినట్లుగా వెళుతుండటం చూసి ముచ్చటేసింది. ఇక్కడ మన బడ్జెట్‌కు అనుగుణంగా మూడు రకాల టాక్సీలు అందుబాటులో ఉంటాయి.  
 
పర్యాటకుల సందడి సెంటోసా ఐలాండ్: నగరంలోని ఆకాశ హర్మ్యాలను తిలకిస్తూ ‘సెంటోసా ఐలాండ్’కు చేరుకున్నాం. అందమైన దీవులు ఈ దేశపు స్పెషల్ అట్రాక్షన్. అన్ని వయసుల వారిని అలరించేలా రకరకాల గేమ్స్ ఉంటాయిక్కడ. ఒకే షెల్టర్ కింద వేలాదిమంది క్యాసినో ఆడుతూ కనిపిస్తారు. ఇక్కడ జరిగే గాంబ్లింగ్ అంతా చట్టబద్ధం కావడంతో ఎలాంటి మోసాలకు తావుండదు. మేమూ కాసేపు క్యాసినో ఆడి, సరదా తీర్చుకున్నాం. సెంటోసా ఐలాండ్ క్యాంపస్‌లోనే గల యూనివర్సల్ స్టూడియో ప్రాంతం పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. సింగపూర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఇదో ముఖ్యమైన స్టూడియో. ‘సెంటోసా ఐలాండ్’లో మిస్ కాకుండా చూడాల్సినది ఈవెంట్ లేజర్ షో. సముద్రపు ఒడ్డున ఏర్పాటు చేసిన సెట్‌లో జరిగే ఈ షో చూసి తీరాల్సిందే.
 
లిటిల్ ఇండియా: సింగపూర్ పొరుగు దేశం కావడం వల్ల ఇండియా ప్రభావం ఇక్కడ చాలా ఎక్కువ. ఇక్కడ తమిళియన్స్ పెద్దసంఖ్యలో సెటిల్ అయ్యారు. సింగపూర్‌లోని ఏ ప్రాంతానికి వెళ్లినా వీళ్ళు కనిపిస్తారు. ఇండియా నుంచి వెళ్లినవారు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని ‘లిటిల్ ఇండియా’ అని పిలుస్తారు. అక్కడి వాతావరణం చూస్తే మనం ఉన్నది సింగపూర్‌లోనేనా అన్న అనుమానం కలుగుతుంది.
 
ముస్తఫా షాపింగ్ మాల్: షాపింగ్ అంటే ఆసక్తి ఉన్న పర్యాటకులకు సింగపూర్ స్వర్గధామం. సింగపూర్‌లో షాపింగ్ చేయాల్సిన ప్రదేశాల్లో ‘ముస్తాఫా షాపింగ్ మాల్’ ఒకటి. ఇక్కడ గుండుసూది నుంచి ఫర్నీచర్ వరకు అన్నీ లభ్యమవుతాయి. ఈ షాపింగ్ మాల్‌లో షాపింగ్ చేయాలంటే కనీసం రెండు రోజులు పడుతుంది. అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకోవడానికి ప్రతిరోజూ 24 గంటలు ఈ షాపింగ్‌మాల్ పనిచేస్తూనే ఉంటుంది. మూడురోజులు సింగపూర్‌లో ఉండి, తిరిగి కౌలాలంపూర్ చేరుకున్నాం. అటు నుంచి ఫిబ్రవరి 8న చెన్నై, అటు నుంచి హైదరాబాద్‌కు తిరిగొచ్చాం.
 
ఒక దేశం, ఒక ద్వీపం, ఒక నగరం.. ఈ మూడూ ఎలా ఉంటాయో చూడాలనుకుంటే ఒక్క సింగపూర్‌ని చూస్తే చాలు. ఈ మూడింటిని చూసిన అనుభూతి ఏకకాలంలో కలుగుతుంది.
 
- కె.ప్రేమ్‌కుమార్, హైదరాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement